శ్రీ సాఈసచ్చరిత
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౩౬ వా||
||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః||
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః||
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||
ఆతా గతాధ్యాయానుసంధాన | రమ్య చౌర్యకథానిరూపణ |
దిధలే హోతే ఆశ్వాసన | దత్తావధాన వ్హా తయా | ||౧||
1. పోయిన అధ్యాయాన్ని ఇప్పుడు ముందుకు సాగిద్దాము. ఆసక్తి కలిగించే దొంగతనపు కథను చెబుతానని చెప్పాను. శ్రోతలు దానిని శ్రద్ధగా వినండి.
కథా నవ్హే హే స్వానందజీవన | పీతా వాఢేల తృష్ణా దారుణ |
తియేచేహీ కరాయా శమన | కథాంతర కథన హోఈల | ||౨||
2. ఇది కథ కాదు. ఇది ఒక ఆత్మానంద రసం. దీనిని త్రాగిన కొద్దీ, దాహం ఎక్కువ అవుతుంది. ఆ దాహాన్ని తీర్చటానికి మరొక కథను చెప్పాల్సి వస్తుంది.
జేణే శ్రవణే సుఖావే శ్రోతా | ఏసీ రసాళ తీ హీ కథా |
నివారే సంసారశ్రాంతవ్యథా | సుఖావస్థా ఆతుడే | ||౩||
3. దాని వలన శ్రోతలకు వినటంలో ఎంతో సుఖం కలుగుతుంది. ఇప్పుడు చెప్పే కథ ఎంతో ఆసక్తికరంగా ఉండటం వలన, శ్రోతలు విని ఆనందిస్తారు. సంసారంలోని కష్టాలన్నీ తొలగించి, వారికి ఆనందాన్ని, శాంతిని కలుగ చేస్తుంది.
నిజహిత సాధావయాచీ కామనా | అసేల జయా సభాగ్యాచ్యా మనా |
తయానే సాఈకథానిరూపణా | సాదర శ్రవణా అసావే | ||౪||
4. తన మేలును సాధించాలని అనుకునే భాగ్యవంతులు, సాయి కథల వర్ణనలను శ్రద్ధగా, భక్తితో వినండి.
సంత మహిమా అపరంపార | కవణా న వర్ణవే సాచార |
తేథే కాయ మాఝా అధికార | జాణీవ సాచార హీ మజలా | ||౫||
5. సాధు సంతుల మహిమలను మొత్తం ఎవరూ వర్ణించలేరు. అలాంటిది నాకు ఆ అర్హత ఎక్కడిది? లేదని నాకు బాగా తెలుసు.
ఇతుక్యా పురే వక్త్యాచే మీపణ | సాఈ లాఘవీ ఘేఊన ఆపణ |
కోణాహీ కరవీ నిజగుణకథన | కరవీ శ్రవణ నిజభక్తా | ||౬||
6. నా ఈ కొద్ది అహంకారాన్ని కూడా సాయి తమ ప్రేమతో తొలగించారు. ఎవరి చేతనైనా, సాయి తమ వైభవాన్ని తామే వర్ణింప చేసి, భక్తులు వినేటట్టు చేస్తారు.
తో హా పరాత్పరసరోవర హంస | హంసోసోహంవృత్తి1 ఉదాస |
బ్రహ్మ ముక్తసేవనోల్లాస2 | అసమసాహస3 జయాస | ||౭||
7. దేవుడనే సరోవరంలో విహరించే సాయి అనే హంస, ‘హంసః సోహం’ అని అనుకొని, దేనిలోనూ ఆసక్తి లేక, బ్రహ్మ రూపంలో ఉన్న ముత్యాలను, ఎంతో ఉత్సాహంతో, ఆహారంగా తీసుకుంటుంది.
జయా నసతా నావ గావ | అంగీ అపరంపార వైభవ |
క్షణే కరీల రంకాచా రావ | భ్రుకుటీ4 లాఘవ హే జ్యాచే | ||౮||
8. వారికి ఊరూ లేదు, పేరూ లేదు. కాని విపరీతమైన వైభవం ఉంది. ఒక క్షణంలో, తమ చూపులోని శక్తితో, పేదవాణ్ణి రాజుగా మార్చగలరు. ఇది వారి అద్భుతమైన లీల.
తో హా తత్వజ్ఞానావతార | దావీ సాక్షిత్వే సాక్షాత్కార |
నామానిరాళా రాహూని దూర | ఘడవీ ప్రకార నానావిధ | ||౯||
9. బ్రహ్మజ్ఞానమే మూర్తీభవించినట్లు ఉన్న వారు, పేరు ప్రతిష్ఠలకు చాలా దూరం. అయినా, ఎన్నో రకాల అనుభవాలతో, భక్తులకు సాక్షాత్కారాన్ని కలగచేస్తారు.
తో జయావరీ కరీ కృపా | దావీ తయా వివిధరూపా |
అఘటిత ఘటనా రచీ అమూపా | ప్రౌఢ ప్రతాపా పరిసా త్యా | ||౧౦||
10. వారు ఎవరిని అనుగ్రహిస్తారో, వారికోసం ఎన్నో అనుభవాలను కలిగించి, తమ వివిధ రూపాలను చూపుతారు. వారి కోసం లెక్కలేనన్ని ఘటనలను పుట్టిస్తారు. వారి అపారమైన మహిమను గురించి వినండి.
తయా జే జే ఆకళితీ ధ్యానే | అథవా గాతీ ప్రేమళ భజనే |
పడోంనేదీ తయాంచే ఉణే | సాంభాళీ పూర్ణపణే తయాంతే | ||౧౧||
11. ధ్యానం చేసి, వారిని తెలుసుకోవాలనే వారిని, లేదా భక్తిగా వారిని పాడేవారిని, పూర్తిగా రక్షించి, ఏ లోటూ లేకుండా, వారి కోరికలను తీర్చుతారు.
ఆవడ నిజ కథాంచీ బహుత | మ్హణోని ఆఠవ దేఈ అనవరత5 |
కరోని శ్రోత్యావక్త్యాంచే నిమిత్త | పురవీ మనోరథ భక్తాంచే | ||౧౨||
12. తమ కథలంటే సాయికి చాలా ఇష్టం. అందుకే ఎప్పుడూ వానిని గుర్తుకు తెచ్చి, చెప్పేవారిని, వినేవారిని, నిమిత్త మాత్రులుగా చేసి, భక్తుల కోరికలను తీర్చుతారు.
పరమార్థాచా పూర్ణ అభిమానీ | ప్రపంచావర సోడోనీ పాణీ |
జయానే జోడిలా చక్రపాణీ | అనంత ప్రాణీ ఉద్ధరిలే | ||౧౩||
13. తన సాంసారిక జీవితాన్ని పూర్తిగా వదులుకొని, పరమార్థాన్నే పూర్తిగా ఆశ్రయించి, చక్రపాణినే (శ్రీ విష్ణు) నమ్మిన వారిని ఎందరినో, వారు ఉద్ధరించారు.
దేశీ విదేశీ జయాతే భజత | భక్తిధ్వజ జయాచా ఫడకత |
దీనా దుబళ్యా పాలవీత6 | కామనా పురవీత సకళాంచ్యా | ||౧౪||
14. ఎన్నో దేశవిదేశాల వారు వారిని ఆరాధిస్తారు. వారి భక్తి పతాకం ఎప్పుడూ ఎగురుతుంటుంది. దీనులను, పేదలను ఎప్పుడూ కాపాడుతూ, అందరి కోరికలను తీర్చుతారు.
అసో ఆతా హే పరమ పవిత్ర | పరిసా సాదర సాఈచరిత్ర |
శ్రోత్యా వక్త్యాంచే శ్రోత్ర వక్త్ర | పావన సర్వత్ర హోవోత | ||౧౫||
15. చెప్పేవాని నోటిని, వినేవారి చెవులనూ పావనం చేసే, పరమ పవిత్రమైన ఈ సాయి చరిత్రను భక్తిగా, శ్రద్ధతో వినండి.
గోమాంతకస్థ దోఘే గృహస్థ | ఆలే సాఈ దర్శనార్థ |
దోఘేహీ సాఈ చరణీ వినటత | హోఊని ఆనందిత దర్శనే | ||౧౬||
16. సాయిని దర్శించుకోవాలని ఇద్దరు వ్యక్తులు గోవానుండి వచ్చారు. దర్శనంతో ఆనందించి, వారిద్దరూ, సాయి పాదాలకు నమస్కారం చేశారు.
దోఘే జరీ బరోబర యేత | సాఈ దక్షిణా ఎకాసిచ మాగత |
పంధరా రుపయే దే మజ మ్హణత | తో మగ తే దేత ఆనందే | ||౧౭||
17. ఇద్దరూ కలిసే వచ్చినా, అందులో ఒకరినే సాయి “నాకు పదిహేను రూపాయలు దక్షిణను ఇవ్వు” అని అడగగా, అతడు ఆనందంగా ఇచ్చాడు.
దుజియా పాశీ కాంహీ న మాగతా | ఆపణ హోఊన పసతీస7 దేతా |
సాఈ తాత్కాళ తే అవ్హేరితా | అతి ఆశ్చర్యతా తయాతే | ||౧౮||
18. రెండవ వ్యక్తి, అసలు అడగకుండానే, తనంతట తానే, ముప్పై ఐదు రూపాయలను ఇచ్చాడు. కాని, సాయి దానిని వెంటనే తిరిగిచ్చే సరికి, అతనికి ఆశ్చర్యం కలిగింది.
ఏసియా తయా సమయాతే | మాధవరావహీ8 తేథేంచ హోతే |
పాహూనియా త్యా విషమతేతే9 | పుసతీ సాఈతే తే పరిసా | ||౧౯||
19. అప్పుడు మాధవరావు కూడా అక్కడే ఉన్నాడు. జరిగిన భేద భావాన్ని చూసి, సాయిని ఏమని అడిగాడో వినండి.
బాబా ఏసే కైసే కరితా | దోఘే స్నేహీ బరోబర యేతా |
ఎకాచీ దక్షిణా మాగూన ఘేతా | పరతతా దేతా స్వయే దుజా | ||౨౦||
20. ‘బాబా! నువ్వెందుకిలా చేసావు? స్నేహితులిద్దరూ కలిసి వచ్చారు. ఒకరిని అడిగి మరీ దక్షిణను తీసుకున్నారు. రెండవ ఆయన, తనంతట తానే ఇచ్చినా, తిరిగిచ్చేసి, ఆయనను నిరాశ పరిచారు.
సంతాపాసీ కా హీ విషమతా | ఆపణ హోఊని ఎకా మాగతా |
స్వేచ్ఛే కోణీ దేతా పరతతా | హిరమోడ కరితా తయాచా | ||౨౧||
21. ‘సత్పురుషుల దగ్గర ఇలాంటి భేదభావమెందుకు? మీ అంతట మీరు ఒకరిని అడిగారు. తమంతట తామే ఇంకొకరు ఇస్తే, దానిని తిరిగిచ్చి, అతనిని నిరాశ పరచారు.
అసతో మీ జరీ అపులే స్థితి | ఏసీ న రీతీ ఆచరితో | ||౨౨||
22. ‘కొంచెం డబ్బునేమో ప్రేమగా తీసుకుని, ఎక్కువ డబ్బుకు ఆశ పడలేదు. నేనే మీ స్థితిలో ఉంటే, ఇలా ఖచ్చితంగా చేసేవాణ్ణి కాదు’ అని అన్నాడు.
“శామ్యా తుజలా ఠాఊక నాహీ | మీ తో కోణాచే కాంహీ న ఘేఈ | యేణే10 మాగే మశీదఆయి11 | ఋణముక్త హోఈ దేణారా | ||౨౩||
23. “శామ్యా! నీకేమీ అర్థం కాదు. నేను ఎవరి దగ్గరనుండీ, ఏమీ తీసుకోను. ఇక్కడున్న మసీదు మాత, బాకీ ఉన్న డబ్బును అడుగుతుంది. అది ఇచ్చి, వారు రుణాన్ని తీర్చుకుంటారు.
మజలా కాయ ఆహే ఘర | కివా మాఝా ఆహే సంసార | జే మజ లాగే విత్తాచీ జరూర | మీ తో నిర్ఘోర సర్వాపరీ12 | ||౨౪||
24. “నాకేమైనా ఇల్లుందా? లేక నాకేమైనా సంసారం ఉందా? నాకు డబ్బుతో అవసరం ఏమిటి? అన్ని విధాల నేను ఏ చింతా లేకుండా ఉన్నాను.
పరీ ఋణ వైర ఆణి హత్యా | కల్పాంతీహీ న చుకతీ కర్త్యా13 | దేవీ నవసితీ గరజే పురత్యా | మజ ఉద్ధరిత్యా14 సాయాస | ||౨౫||
25. “కాని, అప్పు, శత్రుత్వం, హత్య చేసిన వారిని, అవి కాలం ముగిసే వరకూ విడిచి పెట్టవు. వారికి పని పడినప్పుడు, జనం దేవతలకు మ్రొక్కుకుంటారు. ఆ మ్రొక్కునించి వారిని ముక్తులని చేయటానికి నేను కష్ట పడాలి.
తుమ్హాంస నాహీ త్యాచీ కాళజీ | వేళే పురతీ కరితా అజీజీ15 | అనృణీ16 జో భక్తాంమాజీ | తయా మీ రాజీ సదైవ | ||౨౬||
26. “మీకు అలాంటి చింతలేవీ లేవు. మీ అవసరాలు తీర్చుకోవటానికి, మీరు మ్రొక్కుకుని వేడుకుంటారు. రుణాన్ని తీర్చుకున్న భక్తులంటే నాకు ఎప్పుడూ ప్రీతి పాత్రులు.
ఆరంభీ హా అంకిచన17 తయాసీ | పంధరా18 దేతాంచ కేలే నవసాసీ | పహిలా ముశాహిరా19 దేఈన దేవాసీ | భూల తయాసీ పడలీ పుఢే | ||౨౭||
27. “మునుపు ఇతడు పేదవాడు. మొదటి జీతం రాగానే, దేవునికి ఇస్తానని మొక్కుకుని, పదిహేను రూపాయల జీతం వచ్చిన తరువాత, మరచిపోయాడు.
పంధ్రాచే తీస ఝాలే నంతర | తిసాచే సాఠ, సాఠాంచే శంభర | దుప్పట చౌపట వాఢతా పగార | బళావలా విసర20 అత్యంత | ||౨౮||
28. “కొంత కాలానికి ఆ పదిహేను రూపాయల జీతం, ముప్పై అయ్యింది. ముప్పైనుండి, అరవై, అరవైనుండి నూరు, అలా రెండింతలు, నాలుగింతలుగా జీతం పెరిగింది. అలాగే అతని మరపు కూడా బాగా పెరిగింది.
హోతా హోతా జాహలే సాతశే | పాతలే యేథే నిజకర్మవశే | తేవ్హా మీ మాఝే పంధరా హే ఏసే | దక్షిణా మిషే మాగితలే” | ||౨౯||
29. “అలా పెరిగి, పెరిగి అతని జీతం ఏడువందల రూపాయలు అయ్యింది. అదృష్టవశాత్తు, తన కర్మకొద్దీ, ఇక్కడికి వచ్చాడు. దాంతో నేను దక్షిణ నెపంతో, ఆ పదిహేను రూపాయలను అడిగాను.
“ఆతా ఏక దుసరీ గోఠీ21 | ఫిరతా ఎకదా సముద్రకాఠీ | లాగలీ ఎక హవేలీ మోఠీ | బైసలే ఓటీవర తియేచ్యా | ||౩౦||
30. “ఇక రెండవ కథ విను. ఒక సారి, సముద్ర తీరంలో పోతుండగా, ఒక పెద్ద ఇల్లు కనిపించింది. అక్కడ వరండాలో కూర్చున్నా.
హవేలీచా బ్రాహ్మణ మాలక | హోతా కులీన మోఠా ధనిక |
కేలే స్వాగత ప్రేమపూర్వక | యథేష్ట అన్నోదక అర్పునీ | ||౩౧||
31. “ఆ ఇంటి యజమాని, బ్రాహ్మణుడు. మంచి వంశంలో పుట్టిన ధనికుడు. నన్ను ప్రేమగా పిలిచి, నాకు అన్న పానీయాలను తృప్తిగా పెట్టాడు.
తేథేంచ ఎకా ఫడతాళా పాసీ | స్వచ్ఛ సుందర జాగా ఖాశీ | దిధలీ మజలా నిజావయాశీ | నిద్రా మజసీ లాగలీ | ||౩౨||
32. “అక్కడే ఉన్న అలమారా దగ్గర, నేను పడుకోవటానికి, శుభ్రమైన ప్రత్యేక చోటును ఇచ్చాడు. నాకు బాగా నిద్ర పట్టింది.
పాహూని ఝోంప లాగలీ సుస్త | దగడ సారూని ఫోడిలీ భింత | ఖిసా మాఝా కాతరిలా నకళత | నాగవిలే సమస్త మజ త్యానే | ||౩౩||
33. “నేను బాగా నిద్రపోతున్నదాన్ని చూసి, అతడు గోడలోని ఒక రాతిని ఊడబెరకి, గోడకు కన్నం వేసి, నాకు తెలియకుండానే నా జేబును కత్తిరించి, నన్ను పూర్తిగా దోచుకున్నాడు.
జాగా హోతా హే జంవ కళలే | ఎకాఎకీ రడూ కోసళలే | రుపయే తీస హజార గేలే | మన హళహళలే అత్యంత | ||౩౪||
34. “నేను మేలుకొన్న తరువాత, జరిగినది తెలియగానే, వెంటనే బాగా ఏడుపు వచ్చింది. ముప్పై వేల రూపాయలు పోయినవి. మనసుకు చాలా దుఃఖం కలిగింది.
త్యాతో హోత్యా అవఘ్యా నోటా | హోతా ఏసా అవచిత తోటా | భరలా మాఝే హృదయీ ధడకా | బ్రాహ్మణ ఉలటా సమజావీ | ||౩౫||
35. “ఆ డబ్బంతా నోట్ల కట్టలుగా ఉండేది. అనుకోకుండా అంత నష్టం వచ్చేసరికి, నా గుండె చెదిరి పోయింది. పైగా, బ్రాహ్మణుడు నన్ను ఓదార్చ సాగాడు.
గోడ న లాగే అన్నపాణీ | హోఊని ఏసా దీనవాణీ | పంధరా దివస తేచ ఠికాణీ | రాహిలో బైసూని ఓటీవర | ||౩౬||
36. “అన్న పానీయాలు నాకు రుచించలేదు. అలా పదిహేను రోజులు, అక్కడే వరండాలో, ఏడుపు మొహంతో కూర్చున్నాను.
పంధరావా దివస సంపతా | సవాల కరీత రస్త్యానే ఫిరతా | ఫకీర ఎక ఆలా అవచితా | మజ రడతాంనా పాహిలే | ||౩౭||
37. “పదిహేనవ రోజు పూర్తవతుండగా, అకస్మాత్తుగా, దేవుని గురించి గట్టిగా ప్రశ్నలను అడుగుతూ, ఆ దారి వెంట పోతున్న ఒక ఫకీరు, నేను ఏడుస్తుండటం చూశాడు.
పుసే తో మజ దుఃఖాచే కారణ | కేలే మ్యాతే సమస్త నివేదన | తో మ్హణే హే హోఈల నివారణ | కరిశీల సాంగేన మీ తైసే | ||౩౮||
38. “నేనెందుకు వ్యథలో ఉన్నానని అడిగాడు. జరిగినదంతా నేను అతనికి చెప్పాను. ‘నేను చెప్పినట్లు నువ్వు చేస్తే, నీ కష్టాలన్నీ తొలగిపోతాయి.
ఫకీర ఎక తుజ సాంగేన | దేఈన త్యాచే ఠావఠికాణ | తయాలాగీ జాఈ తూ శరణ | తో తుజ దేఈల ధన తుఝే | ||౩౯||
39. “ ‘నీకు ఒక ఫకీరు ఉండే చోటు, మరియు వారి గురించి చెప్పుతాను. నీవు వారి శరణు వేడుకో. వారు నీ డబ్బును నీకు మరల దొరికేటట్లు చేస్తారు.
పరీ మీ సాంగే తే ఆచరే వ్రత | ఇచ్ఛితార్థ ప్రాప్తీపర్యంత | త్యాగ తుఝా ఆవడతా పదార్థ | తేణే తవ కార్యార్థ సాధేల | ||౪౦||
40. “ ‘కాని, నీవు కోరుకున్నది నీకు దొరికే వరకు, నేను చెప్పిన విధంగా వ్రతాన్ని పాటించాలి. నీకు చాలా ఇష్టమైన ఒక వస్తువును వదిలి పెట్టు. దానివల్ల నీవనుకున్నది జరుగుతుంది’ అని చెప్పాడు.
ఏసే కరితా ఫకీర భేటలా | పైకా మాఝా మజలా మిళాలా |
మగ మీ తో వాడా22 సోడిలా | కినారా23 ధరిలా పూర్వవత | ||౪౧||
41. “ ‘ఆయన చెప్పినట్లు చేయగా, ఆ ఫకీరు కలిశారు. నా డబ్బు నాకు తిరిగి దొరికింది. తరువాత, నేను ఆ ఇంటిని విడిచి పెట్టాను. మునుపటిలాగే, మరల సముద్ర తీరానికి వచ్చాను.
మార్గ క్రరితా లాగలీ నావ24 | హోఈ న తేథే మజ శిరకావ |
తో ఎక శిపాఈ సుస్వభావ | దేఈ మజ ఠావ నావేంత | ||౪౨||
42. “అలా నడుస్తుండగా, ఒక నావ కనిపించింది. కాని, అందులో నేను వెళ్ళలేక పోయాను. అయినా, ఒక మంచి సిపాయి వలన, నాకు నావలో చోటు దొరికింది.
లాగోని సుదైవాచా వారా | ఆలీ నావ తీ పరతీరా |
గాడీంత బైసలో ఆలో జంవ ఘరా | దిసలీయా నేత్రా మశీదమాఈ” | ||౪౩||
43. “గాలి అనుకూలంగా ఉండటం వలన, నావ తీరానికి చేరుకుంది. బండిలో కూర్చుని, ఇంటికి రాగా, మసీదు మాత నా ఈ కళ్ళకు కనిపించింది”.
యేథే బాబాంచీ గోష్ట సరలీ | పుఢే శామాసీ ఆజ్ఞా ఝాలీ |
ఘేఊని జాఈ హీ పాహుణే మండళీ | జేఊ త్యా ఘాలీ ఘరాసీ | ||౪౪||
44. ఇంతటితో, బాబా చెప్పటం ముగిసింది. “ఈ అతిథులను ఇంటికి తీసుకుని వెళ్ళి, భోజనం పెట్టు” అని శ్యామాకు బాబా ఆజ్ఞాపించారు.
అసో; పుఢే పాత్రే వాఢిలీ | మాధవరావాంస జిజ్ఞాసా ఝాలీ |
పాహుణ్యాలాగీ పృచ్ఛా కేలీ | గోష్ట తీ పటలీ కీ తుమ్హా | ||౪౫||
45. తరువాత వారికి పళ్ళేలలో భోజనాన్ని వడ్డించి, ఎంతో కుతూహలంగా మాధవరావు, ‘బాబా చెప్పిన సంగతులు మీకేమైనా అర్థమైందా?’ అని అడిగాడు.
పాహూ జాతా వాస్తవీక | సాఈబాబా ఇథలే స్థాయిక |
నాహీ సముద్ర నావ నావిక | తయా హే ఠాఊక కేవ్హాంహీ | ||౪౬||
46. ‘నిజంగా చూస్తే, సాయిబాబా ఎప్పుడూ ఇక్కడే ఉంటారు. అలాంటిది, సముద్రం, నావ, నావికుడు, వారికెలా తెలుస్తుంది?
కైచా బ్రాహ్మణ కైచీ హవేలీ | జన్మ గేలా వృక్షాచే తళీ |
కోఠూని ఎవఢీ సంపత్తి ఆణిలీ | జీ మగ చోరిలీ చోరానే | ||౪౭||
47. ‘ఎక్కడి బ్రాహ్మణుడు, ఎక్కడి ఇల్లు? వారి జన్మంతా చెట్టు క్రిందే గడిచినప్పుడు, దొంగలు దోచుకుని పోయేటంత సంపద వారికెక్కడనుంచి వచ్చింది?
మ్హణోని హీ గోష్ట నివేదిలీ | తీహీ తుమ్హీ యేతాంచ ఆరంభిలీ |
ఎణేమిషే తుమ్హాంసీ పటవిలీ | వాటే ఘడలేలీ పూర్వ కథా | ||౪౮||
48. ‘ఈ సంగతిని మీరు రాగానే చెప్పటం మొదలుపెట్టారు. కనుక, ఇది మీకు సంబంధించిన మునుపటి కథ కావచ్చు. మీకు గుర్తు చేయటానికి చెప్పినట్లుంది’ అని అన్నాడు.
తేవ్హా పాహుణే హోఊని సద్గద | మ్హణాలే సాఈ ఆహేత సర్వవిద25 |
పరబ్రహ్మ అవతార నిర్ద్వంద్వ | అద్వైత అభేద వ్యాపక | ||౪౯||
49. అది విని, వచ్చినవారు గద్గదులై, ‘సాయిబాబా సర్వజ్ఞులు, పరబ్రహ్మావతారం, విరుద్ధ భావాలు లేనివారు. ఏ భేదభావం లేనివారు, అన్ని చోట్లా ఉండేవారు.
తయాంనీ జీ కథిలీ ఆతా | అక్షరే అక్షర తీ అముచీచ కథా |
చలా హే గోడ భోజన సరతా | కథితో సవిస్తరతా తుమ్హాంతే | ||౫౦||
50. ‘ఇప్పుడు వారు చెప్పిన కథలోని ప్రతి అక్షరం మా కథే. ఎంతో గొప్పగా ఉన్న ఈ భోజనమయాక, మీకు విస్తారంగా చెప్పుతాను.
బాబా జే జే బోలూన గేలే | తే తే సర్వచి కీ ఘడలేలే |
ఓళఖ నసతా త్యా కైసే కళలే | మ్హణూన సగళే అఘటిత హే | ||౫౧||
51. ‘బాబా చెప్పినదంతా నిజంగా జరిగినదే. కాని, మేము వారికి తెలియకున్నా, మా గురించి ఇన్ని వివరాలు ఎలా తెలుసుకున్నారు? అందుకే ఇది చాలా చాలా వింతగా ఉంది’ అని చెప్పారు.
చాలలే అసతా తాంబూల చర్వణ | కథానిరూపణ ఆరంభిలే | ||౫౨||
52. భోజనం అయిన తరువాత, మాధవరావుతో తాంబూలాన్ని నములుతూ, వారు తమ కథా వర్ణనను మొదలు పెట్టారు.
వదే దోఘాంమాజీల ఎక | ఘాటచి మాఝా మూళ ములూఖ | పరీ త్యా సముద్రపట్టీచా దేఖ | హోతా అన్నోదక సంబంధ | ||౫౩||
53. వారిద్దరిలో ఒకరు ఇలా చెప్పసాగారు. ‘నా మూల స్థానం సహ్యాద్రి కొండల ప్రాంతం. కాని, బ్రతుకు తెరువు కోసం, సముద్ర తీరంతో సంబంధం ఏర్పడింది.
తదర్థ గేలో గోమాంతకాంత | నోకరీ మిళవావీ ఆలే మనాంత | ఆరాధిలా తత్ ప్రీత్యర్థ దత్త | నవసిలా అత్యంత ఆదరే | ||౫౪||
54. ‘అందుకోసం, ఉద్యోగం వెతుక్కుంటూ గోవాకు వెళ్ళాను. ఉద్యోగం తొందరగా దొరకాలనే ఆశతో దత్త భగవానుని వేడుకున్నాను. ఎంతో భక్తిగా మొక్కుకున్నాను.
దేవా-కుటుంబ రక్షణార్థ | నోకరీ కరణే ఆహే ప్రాప్త | తరీ హోఊని కృపావంత | దేఈ తీ, లాగత పాయాంస | ||౫౫||
55. ‘దేవా! కుటుంబాన్ని పోషించటానికి, ఏదో ఒక ఉద్యోగం కావాలి. కరుణామయా! నేను నీ శరణుజొచ్చాను. నాకొక ఉద్యోగాన్ని ఇవ్వు.
అద్య ప్రభృతి అల్పావకాశీ | జరీ తూ నిజ బ్రీద రాఖిశీ | ప్రాప్తీ జీ హోఈల ప్రథమ మాసీ | సమగ్ర తుజసీ అర్పీన | ||౫౬||
56. ‘ ‘ఈ రోజునుంచి, తొందరగా నీ మాట నిలబెట్టుకుంటే, నా మొదటి నెల జీతమంతా నీకు అర్పిస్తాను’ అని మొక్కుకున్నాను.
భాగ్యే దత్త ప్రసన్న ఝాలా | అల్పావకాశీ నవసా పావలా | రుపయే పంధరా పగార మజలా | మిళూ లాగలా ఆరంభీ | ||౫౭||
57. ‘నా అదృష్టం కొద్దీ, దత్త భగవానుడు కరుణించాడు. తొందరలోనే మొక్కు ఫలించింది. నాకు మొదటి నెల జీతం పదిహేను రూపాయలు వచ్చింది.
పుఢే సాఈబాబాంనీ వర్ణిలీ | తైశీచ మాఝీ బఢతీ జాహలీ | సయ26 నవసాచీ సమూళ బుజాలీ | తీ మజ దిధలీ యే రీతీ | ||౫౮||
58. ‘తరువాత, సాయిబాబా చెప్పినట్లే, నా జీతం పెరిగింది. కాని, నా మొక్కును పూర్తిగా మరచి పోయాను. దానినే వారు ఇప్పుడు గుర్తుకు తెచ్చారు.
కోణాస వాటేల ఘేతలీ దక్షిణా | దక్షిణా నవ్హే తీ ఫేడిలే ఋణా | దిధలే ఎణే మిషే మజ స్మరణా | అత్యంత పురాణ్యా నవసాచే | ||౫౯||
59. ‘వారు దక్షిణను తీసుకున్నారని ఎవరికైనా అనిపిస్తుందేమో కాని, అది దక్షిణ కాదు. వారు నా అప్పు తీరేటట్లు చేశారు. అలా, దక్షిణ అనే నెపంతో, నా పాత మొక్కును గుర్తు చేశారు’ అని చెప్పారు.
తాత్పర్య సాఈ ద్రవ్య న యాచీత | నిజభక్తాంసహీ యాచూ న దేత | అర్థ హా నిత్య అనర్థ మానీత | భక్తా న పాడిత తన్మోహీ | ||౬౦||
60. తాత్పర్యమేమిటంటే, సాయి డబ్బును అడగరు. అంతే కాదు, వారు తమ భక్తులను కూడ డబ్బు అడగనివ్వరు. డబ్బు ఎప్పుడూ అనర్థమని అనుకునేవారు కనుక, బాబా తమ భక్తులను డబ్బు మోహంలో పడనివ్వరు.
మ్హాళసాపతీసారిఖా భక్త | సదా సాఈపదీ అనురక్త |
జరీ సంకటే చాలవీ చరితార్థ | తయా న లవ అర్థ జోడూ దే | ||౬౧||
61. ఎప్పుడూ వారి పాదాలనే ఆలోచించే మహల్సాపతివంటి భక్తుడు, ఎన్నో కష్టాలతో జీవితాన్ని గడుపుతున్నా, ఎవరి దగ్గరనుండీ ఏ మాత్రం డబ్బును సాయి తీసుకోనిచ్చే వారు కాదు.
వాంటీ పరీ కపర్దిక కదా | దేఈ న ఆపదాత్రస్తా త్యా | ||౬౨||
62. దక్షిణగా వచ్చిన డబ్బును, సాయి స్వయంగా ఎందరికో పంచి పెట్టేవారు. కాని, కష్టాలలో ఉన్న మహల్సాపతికి మాత్రం, ఎప్పుడూ, కొంచెం కూడా ఇచ్చేవారు కాదు.
తోహీ మోఠా బాణేదార | జరీ సాఈ ఏసా ఉదార | కధీ న తేణే పసరిలా కర | యాచనా తత్పర హోఉనీ | ||౬౩||
63. అతడు కూడా చాలా ఆత్మగౌరవం ఉన్నవాడు. సాయి ఎంత ఉదారంగా ఉన్నా, ఎన్నడూ వారిని అతను చేయి చాచి అడగలేదు.
సాంపత్తిక స్థితీ నికృష్ట | పరీ వైరాగ్య అతి ఉత్కృష్ట | వేఠీ గరీబీచేహీ కష్ట | అల్పసంతుష్ట సర్వదా | ||౬౪||
64. అతని ఆర్థిక పరిస్థితి చాలా దరిద్రంగా ఉండేది. అయినా, అతనికి ఎంతో గొప్పదైన వైరాగ్యముండేది. పేదరికంతో బాధపడుతున్నా, ఉన్నదానితోనే అతను సంతోషంగా ఉండేవాడు.
ఎకదా ఎక దయాళూ వ్యాపారీ | హంసరాజ అభిధానధారీ | మ్హాళసాపతీస కాంహీతరీ | ద్యావేసే అంతరీ వాటలే | ||౬౫||
65. జాలి గుండే గల హంసరాజు అనే ఒక వ్యాపారికి, ఒక సారి, మహల్సాపతికి ఏమైనా ఇవ్వాలని అనిపించింది.
పాహూని గరిబీచా సంసార | కరావా శక్య తో ఉపకార | లావావా కాంహీ హాతభార | సహజ సువిచార హా స్ఫురలా | ||౬౬||
66. అతని పేద సంసారం చూసి, తన చేతనైన సహాయం చేయాలనే, మంచి బుద్ధి ఆ వ్యాపారికి కలిగింది.
ఏసీ జరీ తయాచీ అవస్థా | ఇతర కోణీహీ దేఊ జాతా | తేంహీ నావడే సాఈనాథా | ద్రవ్యీ ఉదాసతా ఆవడే | ||౬౭||
67. అతను ఎంత పేదతనంలో ఉన్నా, ఇతరులెవరైనా అతనికి సహాయం చేయాలని అనుకున్నా, అది సాయినాథునికి నచ్చేది కాదు. డబ్బు మీద ఆసక్తి చూపటం వారికి ఇష్టముండదు.
మగ తో వ్యాపారీ కాయ కరీ | ద్రవూని త్యా భక్తార్థ అంతరీ | దోఘేహీ సమక్ష అసతా దరబారీ | ద్రవ్య సారీత త్యాకరీ | ||౬౮||
68. అందుకు ఆ వ్యాపారి ఏమి చేశాడంటే, దర్బారులో సాయి, మహల్సాపతి ఇద్దరూ ఉన్నప్పుడు, ఎంతో కనికరంతో, కొంత డబ్బును మహల్సాపతి చేతిలో పెట్టాడు.
హోఊనియా అతి వినీత | మ్హాళసాపతీ కరీ తే పరత | మ్హణే సాఈంచియా ఆజ్ఞేవిరహిత | మజలా న కరవత స్వీకార | ||౬౯||
69. దానికి మహల్సాపతి, ఎంతో వినయంగా ఆ డబ్బును తిరిగి ఇచ్చేసి, ‘సాయి అనుమతి లేకుండా నేను తీసుకోను’ అని చెప్పాడు.
భక్త నవ్హతా హా పైశాచా | మోఠా భుకేలా పరమార్థాచా | పదీ వినటలా కాయావాచా | ప్రేమళ మనాచా నిఃస్వార్థీ | ||౭౦||
70. అతను డబ్బుకు భక్తుడు కాదు. పరమార్థం అంటే ఎంతో పరితపించే వాడు. ప్రేమ నిండిన హృదయంతో, నిస్వార్థంగా, తన దేహం, మనసు మరియు మాటను సాయి పాదాలకు అర్పించినవాడు.
హంసరాజ సాఈతే వినవీ | సాఈ ఎకా కవడీస న శివవీ |
వదే మద్భక్తాంహీ ద్రవ్య న భులవీ | విత్తాచ్యా వైభవీ న గవే తో | ||౭౧||
71. అప్పుడు హంసరాజు సాయితో ‘బాబా! అతనిని కొంతైనా తాకనివ్వరే?’ అని అంటే, అందుకు వారు, “నా భక్తులను డబ్బు ఆకర్షించదు. వారు డబ్బు మోహంలో చిక్కుకో కూడదు” అని చెప్పారు.
పరిసా కరితో సమగ్ర కథనా | యేఈల శ్రవణ ఉల్హాస | ||౭౨||
72. తరువాత రెండవ వ్యక్తి మొదలుపెట్టాడు. ‘నాకు కూడా బాబా చెప్పింది అర్థమైంది. నా కథనంతా చెప్తాను వినండి. వింటూంటే ఎంతో ఉల్లాసంగా ఉంటుంది.
పస్తీస వర్షాంచా మాఝా బ్రాహ్మణ | నిరాలస ఆణి విశ్వాసూ పూర్ణ | దుర్దైవే బుద్ధిభ్రంశ హోఊన | కరీ తో హరణ మమ ఠేవా | ||౭౩||
73. ‘ముప్పై ఐదు ఏళ్ళనుండి నా దగ్గర ఎంతో నమ్మకంగా, శ్రద్ధగా పని చేస్తున్న బ్రాహ్మణునికి, దురదృష్టం కొద్దీ, బుద్ధి భ్రష్టు పట్టి, నేను కూడబెట్టిన డబ్బును దొంగిలించాడు.
మాఝియా ఘరాచ్యా భింతీత | ఫడతాళ ఆహే బసవిలే ఆంత | తేథీల చిరా సారూని అలగత27 | పాడిలే నకళత ఛిద్ర తయా | ||౭౪||
74. ‘మా ఇంటి గోడలోనే ఒక అలమారా అమర్చి ఉంది. ఆ గోడలోని ఇటుక రాయిని మెల్లగా ఊడదీసి, ఎవరికీ తెలియకుండా, కన్నం వేశాడు.
బాబా వర జే ఫడతాళ వదలే | త్యాసచి త్యానే ఛిద్ర పాడిలే | తదర్థ భింతీచే చిరే కాఢిలే | సర్వా నిజలేలే ఠేవూన | ||౭౫||
75. ‘అందరూ నిద్రించాక, బాబా చెప్పిన అలమారాలోనే, కన్నం వేయటానికని, గోడలోని రాయిని ఊడదీశాడు.
పుఢే బాబా ఆణీక వదలే | రుపయే మాఝే చోరూన నేలే | తేంహీ అవఘే సత్యత్వే భరలే | పుడకే నేలే నోటాంచే | ||౭౬||
76. ‘ “నా డబ్బు దొంగిలించ బడింది” అని బాబా చెప్పారు కదా! అదంతా కూడా నిజమే. అక్కడున్న నోట్ల కట్టను తీసుకుని పోయాడు.
తీస హజారచి త్యాంచీ కింమత | నకళే బాబాంస కైసే అవగత | శ్రమ సంపాదిత జాతా విత్త | బసలో మీ రడత అహర్నిశ | ||౭౭||
77. ‘అవి ముప్పై వెల రూపాయలు. ఇది బాబాకెలా తెలిసిందో అర్థం కావటం లేదు. కష్టపడి సంపాదించిన డబ్బు పోగా, రాత్రింబవళ్ళూ నేను ఏడుస్తూ కూర్చున్నా.
శోధ లావితా థకలీ మతి | నకళే కైశీ కరావీ గతి | పంధరా దివస చింతావర్తీ28 | పడలో నిర్గతీ లాగేనా | ||౭౮||
78. ‘వెదకివెదకి అలసిపోయాను. ఏం చేయాలో తెలియలేదు. పదిహేను రోజులు అలా చింతలో ఉన్నా. దానినుండి బయట పడే దారి కనిపించలేదు.
ఎకే దివశీ ఓటీవర | బసలో అసతా అతి దిలగీర | వాటేనే చాలలా ఎక ఫకీర | సవాల కరీత కరీత | ||౭౯||
79. ‘ఒక రోజు అలా దుఃఖంతో, వరాండాలో కూర్చుని ఉండగా, దైవాన్ని గురించిన ప్రశ్నలను గట్టిగా అడుగుతూ, ఆ దారిన ఒక ఫకీరు వెళ్తున్నాడు.
పాహూని మజ ఖిన్నవదన | ఫకీర పుసే ఖేదాచే కారణ | మగ మీ కరితా సాద్యంత నివేదన | సాంగే నివారణ తో మజ | ||౮౦||
80. ‘బాధ పడుతున్న నన్ను చూసి, నా దుఃఖానికి కారణం అడిగాడు. సంగతంతా నేను చెప్పగా, అతడు నాకు దుఃఖాన్ని తొలగించుకునే ఉపాయం చెప్పాడు.
కోపరగాంవ తాలుక్యాస | శిరడీ నామక ఎకా గాంవాస |
కరీ సాఈ అవలియా వాస | కరీ తయాస తూ నవస | ||౮౧||
81. ‘ ‘కోపర్గాం తాలూకాలో, శిరిడీ అనే ఒక గ్రామంలో సాయి అనే ఒక అవలియా ఉన్నారు. నువ్వు వారికి మొక్కుకో.
“దర్శన తుమచే హోఈతోంవర | వర్జిలే” సాచార వద తయా | ||౮౨||
82. ‘ ‘నీకు చాలా ఇష్టమైన వస్తువును తినడం మానివేసి, ‘మీ దర్శనం అయ్యేవరకు నేను దీనిని తీసుకోను’ అని మొక్కుకో’.
ఏసే మజ ఫకీరే కథితా | అన్న వర్జిలే క్షణ న లాగతా | వదలో “బాబా చోరీ మిళతా | దర్శన హోతా సేవీన తే” | ||౮౩||
83. ‘అని ఆ ఫకీరు చెప్పిన వెంటనే, నేను అన్నం తినడం మానుకున్నాను. ‘బాబా! దొంగిలించబడ్డ నా డబ్బు దొరికాక, మీ దర్శనం చేసుకుని, తరువాత అన్నం తింటాను’ అని మొక్కుకున్నాను.
పుఢే ఎకచి పంధరవడా గేలా | నకళే కాయ ఆలే మనాలా | బ్రాహ్మణ ఆపణ హోఊన ఆలా | ఠేవా దిధలా మజ మాఝా | ||౮౪||
84. ‘అంతే! ఒక పదిహేను రోజులు గడిచే సరికి, బ్రాహ్మణుని మనసుకు ఏమి తోచిందో తెలియదు, కాని, అతడు తనంతట తానే వచ్చి, నా డబ్బును నాకు ఇచ్చేశాడు.
మ్హణే మాఝీ బుద్ధి చళలీ | తేణే హీ ఏసీ కృతీ ఘడలీ | ఆతా పాయీ డోఈ ఠేవిలీ | “క్షమా మీ కేలీ” ఏసే వదా | ||౮౫||
85. ‘ ‘నా బుద్ధి చెడిపోవటం వలన, నేను ఇలాంటి పని చేశాను. ఇప్పుడు మీ పాదాలపై నా తలనుంచుతున్నాను. నన్ను క్షమించానని చెప్పండి’ అని వేడుకున్నాడు.
అసో; పుఢే ఝాలే గోడ | సాఈదర్శనీ ఉదేలీ ఆవడ | తేంహీ ఆజ పురవిలే కోడ | ధన్య హీ జోడ భాగ్యాచీ | ||౮౬||
86. ‘అలా అంతా బాగానే జరిగింది. సాయిని చూడాలని మనసు చాలా ఆరాట పడ సాగింది. ఆ కోరిక కూడా, ఇవాళ తీరింది. ఇంత భాగ్యం నాకు కలిగినందుకు నేను చాలా ధన్యుణ్ణి.
అసతా ఖిన్న దుఃఖీ సంకటీ | బసలో అసతా ఆపులే ఓటీ | ఆలా జో మమ సాంత్వనాసాఠీ | పునరపి భేటీ న తయాచీ | ||౮౭||
87. ‘నేను కష్టంలో దుఃఖ పడుతూ, వరండాలో కూర్చుని ఉండగా, నాకు ధైర్యాన్ని కలిగించిన ఆ ఫకీరు మరల కనిపించలేదు.
జయా మాఝీ కళకళ పోటీ | జేణే కథిలీ సాఈచీ గోఠీ | జేణే దావిలీ శిరడీ బోటీ | పునరపి భేటీ న తయాచీ | ||౮౮||
88. ‘నా మీద కరుణతో, నాకు సాయిని గురించి చెప్పి, శిరిడీని చేతితో చూపించిన వారిని, మరల కలవలేదు.
జయాచీ మజ అవచి గాఠీ | సవాల ఘాలీత ఆలా జో వాక్పుటీ | నవస కరవూని గేలా శేవటీ | పునరపి భేటీ న తయాచీ | ||౮౯||
89. ‘అకస్మాత్తుగా నన్ను కలిసి, నా సంగతి అడిగి తెలుసుకుని, చివరకు నా మొక్కును తీర్చుకునేలా చేసిన వారు, మరల కలవలేదు.
తోచ ఫకీర వాటే సాచా | సాఈచ హా అవలియా తుమచా | లాభ ఆమ్హా నిజ దర్శనాచా | ద్యావయా లాచావలా స్వయే | ||౯౦||
90. ‘నిజంగా, ఆ ఫకీరే అవలియా అయిన ఈ సాయి అని నాకు అనిపిస్తుంది. నాకు వారి దర్శనాన్ని కలిగించటానికి, వారు కూడా ఎంతో ఉత్సాహ పడ్డారు.
కోణీ కాంహీ ఘేఊ లాచావతీ | మజ యా దర్శనీ ఇచ్ఛాహీ నవ్హతీ |
ఫకీర ఆరంభీ కరీ ప్రవృత్తి | విత్త ప్రాప్తీ ప్రీత్యర్థ | ||౯౧||
91. ‘ఎవరైనా కాని, ఏదో ఒక కోరికతోనే, సాధువుల దర్శనానికి వెళ్ళుతారు. కాని, నాకు అసలు వీరిని చూడాలనే కోరికే లేదు. నా డబ్బు దొరకాలని, ఆ ఫకీరే మొదట వీరికి మొక్కుకొమ్మని ప్రోత్సాహించాడు.
తో కాయ మాఝ్యా యా పసతిసే29 | లాచావే ఏసే న ఘడేచ | ||౯౨||
92. ‘ఎవరికి మొక్కుకుంటే, ఎంతో సులభంగా నా డబ్బు దొరికిందో అలాంటివారు, ముప్పై అయిదు రూపాయలను ఆశించటం జరగదు.
ఉలట ఆమ్హీ అజ్ఞాన నర | ఆమ్హా కరావయా పరమార్థ తత్పర | ఆముచ్యా కల్యాణీ ఝటే నిరంతర | ఆణీ వాటేవర యా మిషే | ||౯౩||
93. ‘పైగా, అజ్ఞానులైన మనల్ని, పరమార్థంవైపు నడిపించటానికి, మనకు ఎల్లప్పుడూ మంచి చేయడానికి, వారు కష్ట పడతారు. దక్షిణ అనే నెపంతో, మనలను దారికి తీసుకువస్తారు.
ఎతదర్థచి హా అవతార | నా తో ఆమ్హీ అభక్త పామర | హోతా కైచా హా భవ పార | కరా కీ విచార స్వస్థపణే | ||౯౪||
94. ‘దానికోసమే ఈ అవతారం. లేకపోతే, ఏ భక్తీలేని వారమైన మనం, పామరులం, ఎలా ఈ సంసార సాగరాన్ని దాటగలం? బాగా ఆలోచించండి.
అసో; చోరీ మిళాల్యావర | ఝాలా మజ జో హర్ష ఫార | పరిణామీ పడలా నవసాచా విసర | మోహ దుర్ధర విత్తాచా | ||౯౫||
95. ‘అలా, నా డబ్బు దొరికిన సంతోషంలో, మొక్కుబడిని మరచిపోయాను. డబ్బు మీద మోహాన్ని తొలగించుకోవడం చాలా కష్టం.
పుఢే పహా ఎక దివస | అసతా కులాబ్యాచే బాజూస | స్వప్నీ పాహిలే మీ సాఈస | తైసాచ శిరడీస నిఘలో | ||౯౬||
96. ‘తరువాత, కులాబా (ముంబైలోని ఒక ప్రాంతం) దగ్గర ఉన్నప్పుడు, రాత్రి కలలో సాయిని చూశాను. వెంటనే, శిరిడీకి బయలుదేరాను.
సమర్థే కథిలా నిజప్రవాస | మనాఈ నావేంత చఢావయాస | శిపాయానే కరితా ప్రయాస | చుకలా సాయాస తే సత్య | ||౯౭||
97. ‘సాయి సమర్థులు తమ యాత్ర అని చెప్పినట్లే, నన్ను నావలో ఎక్కనివ్వక అడ్డుపడ్డారు. అప్పుడు, ఒక సిపాయి ప్రయత్నంతో, నా కష్టం తీరింది. ఇదీ నిజమే.
యా తో సర్వ మాఝ్యా అడచణీ | పాతలో జేవ్హా నావేచ్యా ఠికాణీ | ఖరేంచ ఎక శిపాఈ కోణీ | కరీ మనధరణీ మజసాఠీ | ||౯౮||
98. ‘ఇవన్నీ నా కష్టాలే. నేను రేవు వద్దకు వచ్చినప్పుడు, నిజంగానే ఎవరో ఒక సిపాయి, నా కోసం, వాళ్ళని వేడుకున్నాడు.
తేవ్హాంచ నావేచా అధికారీ | ఆరంభీ జరీ మజ ధిఃకారీ | దేఊని మజ వావ30 నావేవరీ | కేలే ఆభారీ మజ తేణే | ||౯౯||
99. ‘అంతకు ముందు నన్ను అడ్డగించిన నావ అధికారులు, నాకు నావలో చోటిచ్చి, నన్ను కృతజ్ఞుణ్ణి చేశారు.
శిపాఈహీ అగదీ అనోళఖీ | మ్హణే యాంచీ మాఝీ ఓళఖీ | మ్హణోని ఆమ్హా కోణీ న రోఖీ | బైసలో సుఖీ నావేంత | ||౧౦౦||
100. ‘ఆ సిపాయి ఎవరో నాకు అసలు తెలియదు. అయినా, నేను తనకి తెలుసని చెప్పగా, నావలో ఎవరూ నన్ను అడ్డగించలేదు. నావలో సుఖంగా కుర్చున్నాము.
ఏసీ హీ నావేచీ వార్తా | తైశీచ తీ శిపాయాచీ కథా |
ఆమ్హాసంబంధే ఘడలీ అసతా | ఘేతీ నిజ మాథా సాఈ హే | ||౧౦౧||
101. ‘ఇదే ఆ నావ దగ్గర జరిగిన సిపాయి సంగతి. ఇది నాకు జరిగినా, సాయి దీనిని తమపై వేసుకున్నారు.
వాటే మజ ఇత్థంభూత జగతీ | భరలే అసతీ హే సాఈ | ||౧౦౨||
102. ‘ఈ అద్భుతమైన వింతను చూసి, నాకు మతి పోయింది. ఈ జగత్తంతా సాయియే నిండి ఉన్నట్లు, ఇప్పుడు నాకు అనిపిస్తోంది.
నాహీ అణూరేణూ పురతీ | జాగా యయాంచ్యావీణ రీతీ | ఆమ్హాంస జైసీ దిధలీ ప్రచీతీ | ఇతరాంహీ దేతీల తైశీచ | ||౧౦౩||
103. ‘వీరు లేకుండా, అణువంత చోటు కూడా లేదు. ఇలా, మాకు అనుభవాన్ని కలగజేసినట్లే, ఇతరులకు కూడా వీరు అలాగే అనుభవాలను కలిగిస్తారు.
ఆమ్హీ కోణ, వాస్తవ్య కోఠే | కేవఢే ఆముచే భాగ్య మోఠే | ఓఢూన ఆమ్హాంస నేటేపాటే | ఆణిలే వాటేవర హే ఏసే | ||౧౦౪||
104. ‘మేము ఎవరం? ఎక్కడి వారం? అయినా మా భాగ్యం ఎంత గొప్పదంటే, మమ్మల్ని తమ దగ్గరకు లాక్కొని వచ్చి, ఇలా చక్కని దారికి తీసుకుని వచ్చారు.
కాయ ఆమ్హీ నవస కరావా | కాయ ఆముచా ఠేవా చోరావా | కాయ నవస ఫేడీచా నవలావా | ఠేవాహీ మిళావా ఆయతా | ||౧౦౫||
105. ‘మేము మొక్కుకోవటం, మా డబ్బు దొంగిలించబడటం, ఆ మొక్కును ఎంత అద్భుతంగా తీర్చటం, ఎంత సులభంగా ఆ డబ్బు చేతికందటం!
కాయ ఆముచే భాగ్య గహన | నాహీ జయాచే పూర్వీ దర్శన | నాహీ చింతన నాహీ శ్రవణ | తయాహీ స్మరణ ఆముచే | ||౧౦౬||
106. ‘మా భాగ్యమెంత గొప్పది! మేము వారిని మునుపెప్పుడూ చూడలేదు. వారిని తలచుకోలేదు. కనీసం వారి గురించి విననైనా లేదు. అయినా, వారు మమ్మల్ని గుర్తుంచుకున్నారు.
మగ తయాచియా సంగతీంత | వర్షానువర్షే జే జే వినటత | జే జే అహర్నిశ తత్పద సేవిత | భగవద్భక్త తే ధన్య | ||౧౦౭||
107. ‘ఇలాంటి వారి సహవాసంలో, ఇన్ని ఏళ్ళున్న వారు, రాత్రింబవళ్ళూ వారి పాదాలను సేవించే భగవద్భక్తులు, నిజంగా ధన్యులు.
జయాసంగే సాఈ ఖేళలే | హంసలే, బసలే, బోలలే, చాలలే | జేవలే, పహుడలే, రాగేజలే31 | భాగ్యాగళే32 తే సర్వ | ||౧౦౮||
108. ‘ఎవరెవరితో సాయి ఆడుకున్నారో, నవ్వారో, కూర్చున్నారో, నడిచారో, భోజనం చేశారో, పడుకున్నారో, కోపగించారో, వారందరూ ఎంతో అదృష్టవంతులు.
కాంహీంహీ న ఘడతా ఆమ్హా హాతీ | ఇతుకే ఆమ్హా జై కళవళతీ | తుమ్హాంతేహీ నిత్య సంగతీ | భాగ్య స్థితీ ధన్య తుమచీ | ||౧౦౯||
109. ‘చేతులారా వారికి మేము ఏ సేవ చేయకపోయినా, వారు మాపై ఇంత అనుగ్రహాన్ని చూపారు. ఎప్పుడూ వారి సహవాసంలో ఉన్న మీరు ధన్యులు, భాగ్యవంతులు.
వాటే తుమచ్యా పుణ్యార్జిత సత్కృతీ | ధారణ కరవూని మనుష్యాకృతీ | తుమ్హీంచ పరమ భాగ్యవంతీ | ఆణవిలీ హీ మూర్తీ శిరడీంత | ||౧౧౦||
110. ‘మీ మంచి పనులతో, మీరు సంపాదించుకున్న పుణ్యంతో, ఎంతో భాగ్యవంతులైన మీరే, మనిషి రూపంలో ఉన్న ఈ దివ్యమూర్తిని శిరిడీకి రప్పించినట్లు అనిపిస్తుంది.
అనంత పుణ్యాఈచ్యా కోడీ | తేణే ఆమ్హా లాధలీ శిరడీ |
వాటే శ్రీసాంఈచ్యా దర్శనపరవడీ | కరావీ కురవండీ సర్వస్వీ | ||౧౧౧||
111. ‘అనంత కోటి జన్మల పుణ్యఫలం వలన, మాకు శిరిడీ రావటం జరిగింది. శ్రీసాయి దర్శన భాగ్యం కలగటానికి, ఉన్నదంతా అర్పించేయాలని అనిపిస్తుంది.
జ్ఞానద్రుమాచా కోంభచి సాచార | శోభే హా భాస్కర చిదంబరీ | ||౧౧౨||
112. ‘సాయి సజ్జనులు స్వయంగా అవతార పురుషులు. గొప్ప విష్ణు భక్తునిలా నడచుకుంటారు. నిజంగా వారు జ్ఞానమనే చెట్టుకు కొమ్మ. ఈ జ్ఞానమనే ఆకాశంలో ఎప్పుడూ వెలుగుతున్న సూర్యుడు వారు.
అసో, ఆముచీ హీ పుణ్యాఈ | మ్హణోని భేటే హీ మశీద ఆఈ | నవస ఆముచే ఫేడూన ఘేఈ | దర్శన దేఈ సవేంచ | ||౧౧౩||
113. ‘మా పుణ్యం కొద్దీ, ఈ మసీదు మాత దొరికి, మా మొక్కులను తీర్చి, సాయి దర్శనం కలిగించింది.
ఆమ్హా హాచ ఆముచా దత్త | ఎణేంచ ఆజ్ఞాపిలే తే వ్రత | ఎణేంచ ఆమ్హా బసవిలే నావేంత | దర్శనా శిరడీంత ఆణిలే | ||౧౧౪||
114. ‘మాకు వీరే దత్త భగవానులు. అందుకే, ఆ వ్రతం చేయమని ఆజ్ఞాపించి, మమ్మల్ని నావలో కూర్చోబెట్టి, తమ దర్శనానికని శిరిడీకి తీసుకుని వచ్చారు.
ఏసీ సర్వ వ్యాపకతేచీ | నిజ సర్వాంతర్యామిత్వాచీ | దిధలీ సాంఈనీ జాణీవ సాచీ | సాక్షిత్వాచీ సర్వత్ర | ||౧౧౫||
115. ‘ఇలా, తాము అన్ని చోట్లా ఉన్నారని, అందరి మనసులో ఉన్నారని, అన్నిటికీ తాము సాక్షి అని, సాయి తెలియచేశారు.
పాహోనియా సస్మిత ముఖ | ఝాలే మనీ పరమ సుఖ | ప్రపంచీ విసరే ప్రపంచ దుఃఖ | నసమాయే హరిఖ పరమార్థీ | ||౧౧౬||
116. ‘నవ్వుతూ ఉండే వారి ముఖాన్ని చూసి, పరమానందం కలిగింది. ప్రపంచంలోని దుఃఖాన్ని మరచిపోయాము. పరమార్థాన్ని సాధించాలనే ఉత్సాహం కలిగింది.
హోణార హోవో ప్రారబ్ధగతీ | ఏశీ వ్హావీ నిశ్చిత మతీ | సాఈచరణీ అఖండ ప్రీతీ | రాహో హీ మూర్తీ నిత్య నయనీ | ||౧౧౭||
117. ‘ ‘ఏది జరగాలని ఉందో, దానిని జరగనీ’ అని మనసులో నిశ్చయించుకుని, సాయి పాదాలలో ఎప్పటికీ ప్రేమ ఉండాలి, పవిత్రమైన వారి రూపం ఎల్లప్పుడూ కళ్ళల్లో ఉండాలి.
అగాధ అగమ్య సాఈ లీలా | సీమా నాహీ ఉపకారాలా | వాటే తుమ్హావరూనీ దయాళా | ఓంవాళావా హా దేహ | ||౧౧౮||
118. ‘అగాధము, అర్థం కానివి అయిన సాయి లీలలకు, వారి ఉపకారాలకు, ముగింపనేదే లేదు. దయాళువైన సాయీ! ఈ దేహాన్ని మీకు అర్పించాలని అనిపిస్తుంది’.
అసో, ఆతా ఏకా కథాంతర | సావధాన హోఊని క్షణభర | సాఈ ముఖీ వదలే జే అక్షర | తే తో నిర్ధార బ్రహ్మలేఖ | ||౧౧౯||
119. ఇప్పుడు, కాసేపు సావధానంగా, శ్రద్ధగా మరో కథను వినండి. సాయి నోటినుండి బయటపడిన అక్షరాలు, ఖచ్చితంగా బ్రహ్మ రాసిన రాతలే.
సఖారామ ఔరంగాబాదకర | నివాసస్థాన సోలాపూర శహర | పుత్ర సంతానాలాగీ ఆతుర | పాతలే కలత్ర శిరడీస | ||౧౨౦||
120. సఖారాం ఔరంగాబాద్కరు సోలాపూరు పట్టణంలో నివాసి. కొడుకు పుట్టాలని ఎంతో ఆశతో, అతని భార్య శిరిడీకి వచ్చింది.
సాఈబాబా సంతపవిత్ర | ఏకూన త్యాంచే అగాధ చరిత్ర |
సవే ఘేఊన సాపత్నపుత్ర | ఆలీ సత్పాత్రదర్శనా | ||౧౨౧||
121. సత్పురుషులు, పరమ పావనులైన సాయియొక్క అద్భుతమైన జీవిత చరిత్రను విని, తన సవతి కొడుకుని వెంటబెట్టుకుని, సాయి దర్శనానికి వచ్చింది.
థకలీ దేవదేవీ నవసితా | నిరాశ చిత్తా జాహలీ | ||౧౨౨||
122. పెళ్ళై ఇరవై ఏడు ఏళ్ళయినా, ఆమెకు పిల్లలు పుట్టలేదు. దేవీ దేవతలకు మొక్కుకున్నా, ఆమె మనసు నిరాశతోనే ఉండిపోయింది.
అసో; ఏసీ తీ సువాసినీ | హేతూ ధరూని బాబాంచే దర్శనీ | ఆలీ ఏసీ శిరడీలాగునీ | విచార మనీ ఉద్భవలా | ||౧౨౩||
123. ఆ సువాసిని, తన మనసులోని కోరికతో, బాబా దర్శనానికి శిరిడీకి వచ్చింది. వచ్చి, ఆలోచించ సాగింది.
బాబా సదా భక్తజనవేష్ఠిత | కైసే మజ సాంపడతీ నివాంత | కైసే కథిజేల మాఝే హృద్గత | మ్హణోని సంచిత జాహలీ | ||౧౨౪||
124. ‘ఇలా బాబా చుట్టూ ఈ భక్తులు గుమిగూడి ఉంటే, బాబాతో నాకు ఒంటరిగా మాట్లాడి, నా మనసులోని కోరికను వారికి ఎలా చెప్పాలి?’ అని చింతించ సాగింది.
ఉఘడీ మశీద ఉఘడే అంగణ | బాబాభోవతే సదా భక్తగణ | కైసా మిళేల నివాంత క్షణ | ఆర్ద్ర నివేదన వ్హావయా | ||౧౨౫||
125. ‘మసీదు తెరిచే ఉంటుంది, ప్రాంగణం కూడా తెరిచే ఉంటుంది. బాబా భక్తులు ఎప్పుడూ ఉంటారు. ఒంటరిగా, తన బాధను చెప్పుకోవటానికి, ఎవరూ లేని సమయం ఎప్పుడు దొరుకుతుందో?’ అని బాగా ఆలోచించేది.
తీ ఆణి తీచా సుత | నామ జయాచే విశ్వనాథ | రాహిలే దోన మహినేపర్యంత | సేవా కరీత బాబాంచీ | ||౧౨౬||
126. అలా ఆమె, ఆమె కొడుకు విశ్వనాథుడు, ఇద్దరూ బాబా సేవను చేస్తూ, అక్కడ రెండు నెలలు గడిపారు.
ఎకదా మాధవరావా వినవణీ | విశ్వనాథ అథవా కోణీ | బాబాంపాశీ నాహీ పాహునీ | కరీ తీ కామినీ తీ పరిసా | ||౧౨౭||
127. ఒక సారి, బాబా దగ్గర విశ్వనాథుడుగాని, వేరే ఎవరూ గాని, లేని సమయం చూసి, ఆ స్త్రీ తన కోరికను మాధవరావుతో చెప్పుకుంది.
తుమ్హీ తరీ పాహూని అవసర | మాఝియా మనీచే హే హార్ద్ర | పాహూని బాబా శాంతస్థీర | ఘాలా కీ కానావర తయాంచే | ||౧౨౮||
128. ‘ఎవరూ లేకుండా, బాబా ప్రశాంతంగా ఉన్నప్పుడు, మంచి అదును చూసి, మీరైనా కనీసం, నా మనసులోని కోరికను బాబా చెవిలో వేయండి.
తేహీ జేవ్హా అసతీ ఎకలే | నాహీ భక్త పరివారే వేఢిలే | తేవ్హాంచ కీ హే సాంగా వహిలే | కోణీ న ఏకిలే జాయ అసే | ||౧౨౯||
129. ‘అది కూడా, బాబా చుట్టూ ఎవరూ లేకుండా, వారు ఒక్కరే ఉన్నప్పుడు, ఎవరూ వినకుండా చెప్పాలి’ అని వేడుకుంది.
మాధవరావ ప్రత్యుత్తర కరితీ | మశీద హీ తో కధీ న రీతీ | కోణీ నా కోణీ దర్శనార్థీ | యేతచి అసతీ నిరంతరీ | ||౧౩౦||
130. దానికి, మాధవరావు ఆమెతో, ‘ఈ మసీదు ఎప్పుడూ ఖాళీగా ఉండదు. ఎప్పుడూ ఎవరో ఒకరు దర్శనానికి వస్తూనే ఉంటారు.
సాఈచా హా దరబార ఖులా | యేథే మజ్జావ నాహీ కుణాలా |
తథాపి ఠేవితో సాంగూన తుజలా | ఆణ కీ ఖులాసా హా ధ్యానీ | ||౧౩౧||
131. ‘ఈ సాయి దర్బారు ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ఇక్కడ ఎవరికీ ఏ అడ్డూ లేదు. అయినా, ఒక మాట చెప్తాను, గుర్తుంచుకో.
ప్రయత్న కరణే మాఝే కామ | యశదాతా మంగల ధామ | అంతీ తోచి దేఈల ఆరామ | చింతేచా ఉపశమ హోఈల | ||౧౩౨||
132. ‘ప్రయత్నించటం నా పని. కాని, ఫలితాన్నిచ్చేవాడు ఆ దేవుడు. చివరకు సుఖాన్ని కలిగించేది ఆ దేవుడే, మీ చింతలన్నీ తొలగిపోతాయి.
తూ మాత్ర బైస ఘేఉని హాతీ | నారళ ఎక ఆణి ఉదబత్తీ | సభామండపీ దగడావరతీ | బాబా జేవూ బైసతీ తై | ||౧౩౩||
133. ‘బాబా భోజనానికి కూర్చున్నప్పుడు, ఒక టెంకాయను, అగరవత్తులను చేతపట్టుకుని, నువ్వు సభామండపంలో, రాతిమీద కూర్చొని ఉండు.
మగ మీ భోజన ఝాలియావరతీ | పాహీన జేవ్హా ఆనందిత వృత్తి | ఖుణావీన కీ తుజప్రతీ | తేవ్హాంచ వరతీ యావే త్వా | ||౧౩౪||
134. ‘బాబా భోజనమయాక, వారు ఆనందంగా ఉన్నప్పుడు చూసి, నేను నీకు సైగ చేస్తాను. అప్పుడే నువ్వు పైకి రా’ అని చెప్పాడు.
అసో; ఏసే కరితా కరితా | ప్రాప్త ఘడీచ యోగ యేతా | ఎకదా సాఈచే భోజన ఉరకతా | పాతలీ అవచితా తీ సంధీ | ||౧౩౫||
135. ఆమె అలా ఎదురు చూస్తుండగా, మంచి ఘడియ కలిసిరాగా, ఒక సారి, సాయి భోజనం చేసిన తరువాత, అనుకోకుండా ఆ అవకాశం వచ్చింది.
సాఈ ఆపులే హస్త ధూతా | మాధవరావ వస్త్రానే పుసతా | ఆనంద వృత్తీమధ్యే అసతా | తే కాయ కరితాత పహావే | ||౧౩౬||
136. సాయి తమ చేతులు కడుక్కున్న తరువాత, మాధవరావు వారి చేతిని వస్త్రంతో తుడుస్తుండగా, వారు సంతోషంగా ఉన్నది చూసి, ఏం చేశాడో చూడండి.
ప్రేమోల్హాసే మాధవరావాచా | బాబా తంవ ఘేతీ గాలగుచ్చా | ఏసి యే సంధీచా దేవా-భక్తాచా | సంవాద వాచా ప్రేమాచా | ||౧౩౭||
137. మాధవరావు మీద ప్రేమ పొంగి, బాబా అతని బుగ్గను గిల్లారు. అప్పుడు, దేవునికి, భక్తునికి జరిగిన ప్రేమతో నిండిన మాటలను వినండి.
మాధవరావ వినయసంపన్న | పరీ రాగాచా ఆవ దావూన | వినోదే మ్హణతీ బాబాలాగూన | ‘హే కాయ లక్షణ బరే కా? | ||౧౩౮||
138. మాధవరావు ఎంతో వినయంతో ఉన్నా, కోపాన్ని నటిస్తూ, బాబాతో వినోదంగా ‘ఇది మంచి లక్షణమేనా!
నలగే ఏసా దేవ ఖట్యాళ | గాలగుచ్చే జో ఘేఈ ప్రబళ | ఆమ్హీ కాయ తుఝే ఓశాళ | సలగీచే ఫళ హే కాయ?’ | ||౧౩౯||
139. ‘ఇంత గట్టిగా బుగ్గ గిల్లే తుంటరి దేవుడు, మాకు అనసరం లేదు. మేము ఏ రకంగానైనా, మీకు బాకీ ఉన్నామా? మన స్నేహానికి ఇదా ఫలితం?’ అని అన్నాడు.
తంవ బాబా ప్రత్యుత్తర దేత | “కధీ అవఘ్యా బహాత్తర పిఢీంత | లావిలా రే మ్యా తుజ హాత | అసే కా స్మరణ పహా బరే” | ||౧౪౦||
140. దానికి జవాబుగా బాబా, “మొత్తం డెబ్బై రెండు జన్మలలో, నేను ఎప్పుడైనా నీ మీద చేయి వేశానా? బాగా గుర్తు చేసుకో” అని అన్నారు.
తంవ బోలతీ మాధవరావ | ‘ఆమ్హా పాహిజే ఏసా దేవ |
దేఈల జో ముకే సదైవ | మిఠాఈ అభినవ ఖావయా | ||౧౪౧||
141. దానికి మాధవరావు, ‘తినటానికి కొత్తకొత్త మిఠాయిలను ఎప్పుడూ ఇచ్చే దేవుడు, మాకు కావాలి.
జాగో తుఝియా పాయీ ఇమాన | ఇతుకేంచి దాన దేఈ మజ’ | ||౧౪౨||
142. ‘మీ గౌరవ మర్యాదలు, లేదా స్వర్గలోక విమానాలు, మాకు అవసరం లేదు. మీ పాదాల దగ్గర ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండేలా కరుణించండి. అంతే, ఇంత దానం ఇస్తే చాలు’ అని అన్నాడు.
తంవ బాబా లాగలే బోలో | “ఎతదర్థాచి మీ యేథే ఆలో | తుమ్హాంస ఖాఊ ఘాలూ లాగలో | లాగలా లోలో33 మజ తుమచా” | ||౧౪౩||
143. అందుకు బాబా, “అందుకేగా నేను ఇక్కడికి వచ్చాను. నాకు మీ మీద ప్రేమ ఉండటంతోనే, మీకు తిండి పెట్టటానికే నేను ఇక్కడికి వచ్చాను.
ఇతుకే హోతా కఠడ్యాపాశీ | బాబా బైసతా నిజాసనాసీ | మాధవరావ కరితా ఖుణేసీ | బాఈ నిజకార్యాసీ సావధ | ||౧౪౪||
144. అదయిన తరువాత, బాబా వెళ్ళి, కటకటాల దగ్గర ఉన్న తమ ఆసనంపై కూర్చోగానే, మాధవరావు ఆ స్త్రీకి సైగ చేశాడు. ఆమె తన కోరికను తీర్చుకోవటానికి సిద్ధమైంది.
ఖూణ హోతాంచ తాత్కాళ ఉఠలీ | లగబగీనే పాయర్యా చఢలీ | బాబాంచియా సన్ముఖ ఆలీ | నమ్ర ఝాలీ సవినయ | ||౧౪౫||
145. సైగ అందిన వెంటనే లేచి, గబగబా మెట్లెక్కి, బాబా ఎదుటికి వచ్చి, వినయంగా, నమ్రతతో నిలబడింది.
తాత్కాళ చరణీ అర్పిలే శ్రీఫళ | వందిలే మగ చరణకమళ | బాబాంనీ నిజ హస్తే తో నారళ | హాణీతలా సబళ కఠడ్యావరీ | ||౧౪౬||
146. బాబాకు శ్రీఫలాన్ని (కొబ్బరికాయ) అర్పించి, వారి పాదాలకు నమస్కారం చేసింది. ఆ కొబ్బరికాయను బాబా తమ చేతులతో గట్టిగా కటకటాల పైన కొట్టారు.
మ్హణతీ “శామా హా కాయ మ్హణతో | నారళ ఫారచి రే గుడగుడతో” | శామా మగ తీ సంధీ సాధతో | కాయ వదతో బాబాంస | ||౧౪౭||
147. “శామా! ఇది ఏమంటుంది? కొబ్బరికాయ బాగా చప్పుడు చేస్తూ ఉంది రా” అని అన్నారు. శామా ఆ అవకాశాన్ని వెంటనే అందుకుని, ఏమన్నాడంటే,
‘మాఝియే పోటీ ఏసేంచ గుడగుడో | బాఈ హీ మనీ మ్హణే తే ఘడో | అఖండ మన తంవ చరణీ జడో | కోడే ఉలగడో తియేచే | ||౧౪౮||
148. ‘తన కడుపులో కూడా ఇలాంటి చప్పుడు అవ్వాలని ఈమె తన మనసులో అనుకుంటూ ఉంది. ఆమె కోరిక తీరాలి. ఆమె మనసు ఎప్పుడూ మీ పాదాల మీదే లగ్నమై, ఆమె సమస్య తీరుగాక.
పాహీ తిజకడే కృపాదృష్టీ | టాక తో నారళ తిచే ఓటీ | తుఝియా ఆశీర్వాదే పోటీ | బేటా బేటీ ఉపజోత’ | ||౧౪౯||
149. ‘ఆమెను అనుగ్రహించి, ఆ కొబ్బరికాయను ఆమె ఒడిలో వేయండి. మీ ఆశీర్వాదంతో, ఆమె కడుపు పండి, కొడుకులు, కూతుళ్ళూ కలుగుతారు’ అని అన్నాడు.
తంవ బాబా తయా వదతీ | “కాయ నారళే పోరే హోతీ | ఏశా కైశా వేడ్యా సమజుతీ | చళలే వాటతీ జనలోక” | ||౧౫౦||
150. దానికి బాబా అతనితో, “కొబ్బరికాయలతో పిల్లలు కలుగుతారా? ఇలా వెర్రిగా ఎందుకనుకుంటారు? జనానికి పిచ్చి పట్టినట్లు అనిపిస్తూ ఉంది” అని అన్నారు.
శామా వదే ఆహే ఠాఊక | తుఝియా బోలాచే కౌతుక |
లేండార మాగే లాగేల ఆపసుఖ | ఏసా అమోలిక బోల తుఝా | ||౧౫౧||
151. దానికి శామా, ‘మాకు బాగా తెలుసు. మీ మాటల అద్భుతమైన శక్తితో, వరుసగా పిల్లలు పుట్టుతారు. మీ మాటలు అంత అమూల్యమైనవి.
పరీ తూ సాంప్రత ధరిశీ భేద | నేదిశీ ఖరా ఆశీర్వాద | ఉగాచ ఘాలీత బససీ వాద | నారళ ప్రసాద దేఈ తిస | ||౧౫౨||
152. ‘కాని మీరు ఇప్పుడు, భేదభావంతో, ఊరికెనే కూర్చుని, ఆశీర్వాదాన్ని ఇవ్వకుండా, వృథాగా వాదన చేస్తున్నారు. ఆమెకు కొబ్బరికాయను ప్రసాదంగా ఇవ్వండి’ అని అన్నాడు.
“నారళ ఫోడ” బాబా వదత | శామా వదే టాక పదరాంత | ఏసీ బరీచ హోతా హుజత | హారీస యేత తంవ బాబా | ||౧౫౩||
153. “సరే, కొబ్బరికాయను పగులగొట్టు” అని బాబా అంటే, ‘కాదు, కాదు ఆమె ఒడిలో వేయండి’ అని శామా అన్నాడు. ఇలా బాగా వాదులాడాక, చివరికి, బాబా ఒప్పుకున్నారు.
“మ్హణతీ హోఈల జా రే పోర” | శామా మ్హణే “కధీ” దే ఉత్తర | వదతా “బారా మాహిన్యానంతర” | నారళ తాడకర ఫోడిలా | ||౧౫౪||
154. “అలాగే రా, ఆమెకు బిడ్డలు కలుగుతారు, ఇక వెళ్ళు” అని అన్నారు. శామా కదలకుండా ‘ఎప్పుడు?’ అని నిలదీసి అడిగాడు. “పన్నెండు నెలల తరువాత” అని బాబా చెప్పగా, శామా ధన్‍మని కొబ్బరికాయను పగులకొట్టాడు.
అర్ధభాగ దోఘీ సేవిలా | అర్ధ రాహిలా బాఈతే దిధలా | మాధవరావ వదే బాఈలా | “మాఝియా బోలా తూ సాక్షీ | ||౧౫౫||
155. అందులో సగం కాయను ఇద్దరూ తిని, మిగిలిన సగాన్ని ఆ స్త్రీకి ఇచ్చారు. మాధవరావు ఆమెతో ‘నా మాటలకు నీవే సాక్షి.
బాఈ తుజ ఆజపాసూన | బారా మహినే నవ్హతా పూర్ణ | జాహలే నాహీ పోటీ సంతాన | కాయ మీ కరీన తే పరిస | ||౧౫౬||
156. ‘ఇవాల్టినుండి పన్నెండు నెలలు పూర్తి కాక మునుపే, నీ కడుపు పండి, బిడ్డ పుట్టకపోతే, నేను ఏమి చేస్తానో విను.
ఏసాచ నారళ డోకీంత ఘాలూన | యా దేవాలా మశీదీమధూన | మీ న జరీ లావీ కాఢూన | తరీ న మ్హణవీన మాధవ | ||౧౫౭||
157. ‘వీరి తలపై ఇలాగే కొబ్బరికాయను కొట్టి, ఈ దేవుణ్ణి మసీదునుండి తరిమి వేయకపోతే, నా పేరు మాధవరావు కాదు.
ఏసా దేవ న మశీదీంత | ఠేవూ దేణార వదతో ఖచిత | యేఈల వేళీ యాచీ ప్రచిత | నిర్ధార నిశ్చిత హా మాన” | ||౧౫౮||
158. ‘ఇలాంటి దేవుణ్ణి, మసీదులో ఉండనివ్వను అని, ఖచ్చితంగా చెప్పుతున్నాను. దీనికి ప్రమాణం సరియైన సమయంలో నీకు అనుభవమౌతుంది అని తెలుసుకో’ అని చెప్పాడు.
ఏసే మిళతా ఆశ్వాసన | బాఈ మనీ సుఖాయమాన | పాయీ ఘాలోని లోటాంగణ | గేలీ స్వస్థమన నిజ గ్రామా | ||౧౫౯||
159. నమ్మకాన్ని పుట్టించే అతని మాటలను విని, ఆ స్త్రీ మనసులో ఆనందించి, బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి, ఏ చింతా లేకుండా తన గ్రామానికి వెళ్ళిపోయింది.
పాహూని శామా నిత్యాంకిత | రక్షావే భక్త మనోగత | సాఈ ప్రేమరజ్జూనియంత్రిత | ఆలా న కించిత కోప తయా | ||౧౬౦||
160. శామా మాటలు విని సాయికి కొంచెం కూడా కోపం రాలేదు. ఎందుకంటే, శామా తమకు అంకితమై పోయాడు. అంకిత భక్తుల ప్రేమతో కట్టుబడి ఉన్న సాయి, ఎప్పుడూ ఆ భక్తుల కోరికలను తీర్చుతారు.
ఖరే కరాయా భక్తవచన | ప్రణతపాళ కరుణాఘన |
సాఈ దయాళ భక్తాశ్వాసన | లడివాళపణ పురవీత | ||౧౬౧||
161. భక్తులు చెప్పిన మాటలు నిజమని చూపించటానికి, భక్తులను పాలించే కరుణామయులైన సాయి, భక్తులు చెప్పినదాన్ని ప్రేమతో తీరుస్తారు.
సంత భక్తసంకల్ప పురవీత | హేంచ నిజవ్రత తయాచే | ||౧౬౨||
162. “శామా నాకిష్టమైన భక్తుడు. తన ప్రేమలో, ఏది సరియైనదో, ఏది కాదో తెలియని అమాయకుడు”. భక్తుల కోరికలను తీర్చటం సత్పురుషుల వ్రతం.
అసో, భరతా బారా మాస | కృత నిర్ధార నేలా తడీస | తీనచి మహినే హోతా బోలాస | పాతలే గర్భాస సంతాన | ||౧౬౩||
163. పన్నెండు నెలలు గడిచే సరికి, తాము తలచుకున్నదానిని బాబా పూర్తి చేశారు. బాబా అనుగ్రహించిన మూడు నెలల తరువాత, ఆ స్త్రీ గర్భవతి అయ్యింది.
భాగ్యే జాహలీ పుత్రవతీ | పాంచా మహిన్యాంచే బాళ సంగతీ | ఘేఊని ఆలీ శిరడీప్రతీ | పతిసమవేతీ దర్శనా | ||౧౬౪||
164. అదృష్టం కొద్దీ, ఆమె కొడుకును కనింది. ఐదు నెలల బిడ్డను వెంట తీసుకుని, తన భర్తతో సహా, ఆమె బాబా దర్శనానికి శిరిడీకి వచ్చింది.
పతీనేం హీ ఆనందోనీ | సాఈ సమర్థ చరణ వందోనీ | పాయీ పంచశత రుపయే అర్పునీ | కృతజ్ఞ నిజ మనీ జాహలా | ||౧౬౫||
165. ఎంతో ఆనందంతో, ఆమె భర్త సాయి సమర్థుని పాదాలకు నమస్కరించి, కృతజ్ఞతతో, వారికి ఐదు వందల రూపాయలను అర్పించాడు.
బాబాంచా వారూ శామకర్ణ | తయాచే సాంప్రత వసతిస్థాన | తయాచ్యా భింతీ ఘేతల్యా బాంధూన | రుపయే లావూన హేచ పుఢే | ||౧౬౬||
166. కొన్ని రోజుల తరువాత, ఆ డబ్బును, బాబాయొక్క గుర్రం శ్యామకర్ణను ఉంచే చోటులో, గోడలను కట్టించటానికి ఉపయోగించారు.
మ్హణోని ఏసా సాఈ ధ్యావా | సాఈ స్మరావా సాఈ చింతావా | హాచ హేమాడా నిజ విసావా | కరీ న ధాంవాధాంవ కుఠే | ||౧౬౭||
167. అందుకే ఇలాంటి సాయి సమర్థుని తలచుకొండి. వారి గురించి ఆలోచించండి, ధ్యానించండి. వారే ఎప్పటికీ హేమాడుకు నిజమైన విశ్రాంతి ధామం. వేరే ఎక్కడికీ వెతుక్కుంటూ పరుగులు పెట్టకండి.
నిజ నాభీంత అసతా జవాదీ34 | కిమర్థ భ్రమావే బిదోబిదీ | అఖండ వినటత సాఈపదీ | హేమాడ నిరవధి సుఖ లాహే | ||౧౬౮||
168. మన బొడ్డులోనే కస్తూరిని ఉంచుకుని, వేరే ఎక్కడో వెతుక్కోవడం ఎందుకు? హేమాడు ఎల్లప్పుడూ సాయి పాదాలలోనే మగ్నమై, అంతులేని సుఖాన్ని ఆనందిస్తున్నాడు.
పుఢీల అధ్యాయ యాహూన రసాళ | కైసే బాబాంసీ భక్త ప్రేమళ | మశీదీంతూన చావడీజవళ | మిరవీత సకళ ఆనందే | ||౧౬౯||
169. తరువాతి అధ్యాయం ఇంతకంటే ఆసక్తికరమైనది. ప్రేమికులైన బాబా భక్తులందరూ, ఎంతో ఆనందంతో బాబాను మసీదునుండి చావడికి ఎలా ఉత్సాహంతో ఊరేగించేవారో,
తైసీచ బాబాంచ్యా హండీచీ కథా | ప్రసాదదాన వినోదవార్తా | పుఢీల అధ్యాయీ పరిసిజే శ్రోతా | చఢేల ఉల్హాసతా శ్రవణాస | ||౧౭౦||
170. దాని గురించి, మరియు బాబాయొక్క వంట పాత్ర కథ, ప్రసాదాన్ని పంచటం, ఇంకా ఎన్నో వినోదమైన సంగతులను, శ్రోతలారా, తరువాతి అధ్యాయంలో వినండి. మీకు వినాలనే ఉత్సాహం ఎక్కువ అవుతుంది.
| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే |
| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | సాఈసర్వవ్యాపకతా తదాశిర్వవచన సాఫల్యతానామ |
| శట్‍త్రింశత్తమోధ్యాయః సంపూర్ణః |
||శ్రీ సద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||
టిపణీ:
1. మీ తోచ తో, తో తోచ మీ. 2. బ్రహ్మరూప మోత్యాంచా చారా.
3. అత్యంత. 4. కటాక్షలీలా. 5. నిరంతర. 6. బోలావీత.
7. పస్తీస రుపయే. 8. మాధవరావ దేశపాండే మ్హణజే బాబాంచా శామా.
9. భేదవృత్తీస. 10. కోణాపాసూన యేణే ఠరలేలీ రక్కమ.
11. మశీదీచీ అధిష్ఠాత్రీ దేవతా. 12. సర్వ ప్రకారే. 13. కరణార్యాలా.
14. భక్తోద్ధార కరణార్యా మలా. 15. అతినమ్రపణే కేలేలీ వినవణీ.
16. జ్యాలా ఋణ నాహీ తో. 17. గరీబ, ద్రవ్యహీన. 18. పంధరా రుపయే.
19. పగార. 20. విస్మరణ. 21. గోష్ట. 22. హవేలీ. 23. సముద్రకాఠ.
24. గలబత, ఆగబోట. 25. సర్వజ్ఞ. 26. ఆఠవణ. 27. అగదీ హళూ.
28. చింతేచ్యా భోవర్యాత. 29. పస్తీస రుపయాంచ్యా దక్షిణేనే.
30. జాగా. 31. రాగావలే. 32. భాగ్యానే శ్రేష్ఠ . 33. ఆవడ, ప్రేమ.
34. కస్తురీ, జవాదీ జాతీచ్యా మాంజరాచ్యా అండ్యాతీల కస్తురీ.
No comments:
Post a Comment