Wednesday, September 4, 2013

||హండీవర్ణనం నామ అష్టత్రింశత్తమోధ్యాయః||


శ్రీ సాఈసచ్చరిత
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౩౮ వా||

||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః|| 
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః|| 
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||

సకల జగదానందకరా | భక్తేష్ట సంపాదన తత్పరా | 
చరణాశ్రిత త్రితాపహరా | నమన గురువరా తవ పాయా | ||౧|| 
1. మొత్తం ప్రపంచానికే ఆనందాన్నిచ్చేవారు, భక్తుల కోరికలను తీర్చడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారు, మీ పాదాలను శరణుజొచ్చిన వారి మూడు తాపాలను తొలగించే గురువరా! మీ పాదాలకు నమస్కారాలు.
ప్రణతపాలా పరమ ఉదారా | శరణాగత భక్తోద్ధారా | 
కరావయా లోకోపకారా | త్వా అవతారా ధరియేలే | ||౨|| 
2. శరణుజొచ్చిన వారిని రక్షించే పరమ ఉదారా! శరణాగత భక్తులను ఉద్ధరించేవారా! మీరు లోకాన్ని ఉద్ధరించడానికే అవతరించారు. 
జయజయాజీ ద్వైతదలనా | జయజయాజీ భక్తమనమోహనా | 
జయజయాజీ భవాపహరణా | జయకరుణాఘనా గురురాయా | ||౩|| 
3. వేరు వేరనే భావాన్ని (ద్వైతం) నాశనం చేసిన మీకు జయజయకారాలు! భక్తుల మనసును దోచినవారా మీకు జయజయలు! సంసార దుఃఖాలను తొలగించిన వారా మీకు జయజయలు! ఎంతో దయగల మీకు, గురురాయా, జయజయలు! 
కోఠీల భాగ్య ఆలే ఫళా | జేణే హే చరణ పాహిలే డోళా | 
భోగిలా సమాగమ సుఖసోహళా | గేలీ తీ వేళా పరతీ న యే | ||౪|| 
4. మీ పాదాలను కళ్ళతో చూడగలిగిన మాది, ఎంత అదృష్టమో! మీ సహవాస సుఖంలోని ఆనందాన్ని అనుభవించాము. గడిచి పోయిన ఆ సమయం ఇంక మళ్ళీ ఎన్నటికీ రాదు. 
కేవళ బ్రహ్మాచీ జీ మూస | ఓతూన శుద్ధ స్వరూపరస | 
ఆకారలీ జీ మూర్తి సురస | తీచ కీ సంతావతంస సాఈ | ||౫|| 
5. బ్రహ్మ అనే మూసలో, శుద్ధమైన ఆత్మ అనే రసాన్ని పోస్తే, వచ్చిన అందమైన ఆకారంగల మూర్తియే, సత్పురుష శ్రేష్ఠులైన ఈ సాయి. 
సాఈ తోచి ఆత్మారామ | తోచి పూర్ణానందధామ | 
స్వయే అవాప్త సకలకామ | కరీత నిష్కామ భక్తాంస | ||౬|| 
6. సాయియే ఆత్మారాముడు. సాయియే ఆనందానికి నిలయం. స్వయంగా వారికి ఏ కోరికలూ లేనివారు. భక్తులను కూడా కోరికలు లేనివారిగా చేస్తారు. 
జో సర్వ ధర్మ విధారక | బ్రహ్మక్షాత్రతేజ ఎక | 
తయాంసహ మృత్యూచా ఘోటక1 | లక్షణ హే త్రోటక జయాచే | ||౭|| 
7. అన్ని ధర్మాలనూ రక్షించేవారు, బ్రహ్మ క్షాత్ర తేజస్సుతో, చావును కూడా తొలగించే వారి సుగుణాలను వర్ణిస్తాను. 
జన్మమరణాది సంబంధ | తోడీ తడతడా జో హే బంధ | 
తయా మీ జడ అంధ | సాష్టాంగ వందన కరీతసే | ||౮|| 
8. చావు పుట్టుకల బంధనాలను త్రెంచే వారికి, మొద్దుని, గుడ్డివాణ్ణి అయిన నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. 
గతాధ్యాయీ అతి ఆవడీ | వర్ణిలీ సాఈనాథాంచీ చావడీ | 
ఆతా యే అధ్యాయీ హండీ | పరిసా అఖండీత సుఖదాయీ | ||౯|| 
9. పోయిన అధ్యాయంలో సాయినాథుని చావడి ఊరేగింపును ఎంతో ఉత్సాహంగా వర్ణించాను. ఈ అధ్యాయంలో అంతులేని సుఖాన్నిచ్చే వంట పాత్రను గురించిన వర్ణనను వినండి. 
తాన్హే బాళ ఖాఊ జాణే | కాయ ఖాఊ తే తే నేణే | 
దూధ వా కవళ లావూని భరవణే | కాళజీ హీ ఘేణే మాతేనే | ||౧౦||
10. పసిబిడ్డలకు తినాలని మాత్రమే తెలుసు. కాని, ఏమి తినాలో వారికి తెలియదు. వారికి పాలు పట్టాలా, లేక అన్నం పెట్టాలా అన్నది తల్లి చింత. 

తైసిచ మాఝీ సాఈ మాతా | లేఖణీ లేవవూని మాఝియే హాతా | 
లిహివూన ఘేఈ హా ప్రబంధ ఆయతా | ఆవడీ నిజభక్తాకారణే | ||౧౧|| 
11. అలాగే, మా సాయిమాత, నా చేత కలం పట్టించి, ఈ గ్రంథాన్ని తమ భక్తుల పైని ప్రేమతో, వారి కోసం వ్రాయిస్తున్నారు.  
యుగాయుగాచే సిద్ధి సాధన | మానవ ధర్మశాస్త్రీ వచన | 
కృతీ తప త్రేతీ జ్ఞాన | ద్వాపరీ యజ్ఞ దాన కలీ | ||౧౨|| 
12. ప్రతి యుగంలో, మోక్షం పొందటానికి చేయవలసిన, నిరూపించబడిన ధర్మాలను, సాధనలను, శాస్త్రాలలో చెప్పారు. అవి కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానం, ద్వాపరయుగంలో యజ్ఞం, మరియు కలియుగంలో దానం. 
సదా సర్వదా దానధర్మ | క్షుధాశాంతీ పరమ వర్మ | 
అన్న దాన నిత్య నేమ | కర్మాంత కర్మ హే ఆద్య | ||౧౩|| 
13. దాన ధర్మాలను ఎల్లప్పుడూ చేస్తూ ఉండాల్సిందే. కాని, వాటిలో గొప్పది, ఆకలిని తీర్చటమే. అదే పరమ ధర్మం. ప్రతి రోజూ నియమంగా అన్నదానం చేయటం, అన్ని పనులలో చాలా ముఖ్యమైనది. 
హోతా దోన ప్రహరచే బారా | అన్నావీణ జీవ ఘాబరా | 
జైసే ఆపణా తైసేంచ ఇతరా | జాణీల అంతరా తోచి భలా | ||౧౪|| 
14. మధ్యాహ్నం పన్నెండయితే చాలు. అన్నం లేకుంటే, ప్రాణం విలవిలలాడి పోతుంది. మనకు ఆకలి కలిగినట్లే ఇతరులకు కూడా కలుగుతుంది అని తెలుసుకునే వారు గొప్పవారు. 
ఆచారధర్మా మాజీ ప్రధాన | అగ్రగణ్య అన్నదాన | 
పాహూ జాతా తయాహూన | కాహీ న ఆన శ్రేష్ఠత్వే | ||౧౫|| 
15. శాస్త్రాల ఆధారంగా చేసే ధర్మాలలో, అన్నింటికంటే అన్నదానం గొప్పది. దానికంటే గొప్పదైనది మరొకటి లేదు. 
పరబ్రహ్మస్వరూప అన్న | త్యాంతూన భూతే హోతీ నిష్పన్న | 
అన్నచి జీవే జగాయా సాధన | అన్నాంతర్లీన అవసానీ | ||౧౬|| 
16. అన్నం పరబ్రహ్మకు ప్రతిరూపం. అన్నంలోనుండే ప్రాణులు పుట్టుకొస్తాయి. జీవులను జీవింప చేసే సాధనం అన్నమే. చివరకు, చనిపోయిన తరువాత జీవులు కలిసిపోయేది అన్నంలోనే. 
వేళీ అవేళీ యేతా అతిథి | అన్నదానే సుఖవావా గృహస్థీ | 
అన్నావీణ జే మాఘారా లావితీ | అచూక దుర్గతీ ఆమంత్రితీ | ||౧౭|| 
17. వేళలో కాని, వేళ కానప్పుడు కాని, ఎప్పుడైనా సరే, ఇంటికి వచ్చిన అతిథులను, ఇంటి యజమాని అన్నదానంతో తృప్తి పరచాలి. అన్నం పెట్టకుండా, అతిథులను తిప్పి పంపిస్తే, దుర్గతిని బొట్టు పెట్టి పిలిచినట్లే. 
వస్త్రపాత్రాదిదానీ విచార | అన్నదానీ నలగే ఆధార | 
కోణీ కధీంహీ యేవో దారావర | బరవా న అనాదర తయాచా | ||౧౮|| 
18. వస్తువులను, వస్త్రాలను ఇచ్చేటప్పుడు, తీసుకునే వారి యోగ్యతను గురించి ఆలోచించాలి. కాని, అన్నదానంలో అలాంటి ఆలోచనలేవీ అవసరం లేదు. ఎవరు ఎప్పుడు గుమ్మం దగ్గరకు వచ్చినా సరే, వారికి అన్నం పెట్టకుండా, ఆదరించక పోవటం మంచిది కాదు. 
ఏసీ అన్నదానాచీ మహతీ | ఎతదర్థ ప్రమాణ శ్రుతీ2
మ్హణోని బాబాహీ అన్న సంతర్పితీ | లౌకికరీతీ ఆచరితీ | ||౧౯|| 
19. అలా అని శ్రుతలలో (తైత్తరీయ ఉపనిషత్తు, అధ్యాయం ౩) అన్నదానం గురించిన గొప్పదనాన్ని చెప్పారు. అందుకే బాబా కూడా, ప్రపంచ రీతిని పాటిస్తూ, అన్న సంతర్పణ చేసేవారు. 
పైసా అడకా ఇతర దాన | అపూర్ణ అన్నదానావీణ | 
కాయసే ఉడుగణ శశీవిహీన | శోభే కా పదకావీణ హార | ||౨౦||
20. వేరే ఎన్ని దానాలు చేసినా అవన్నీ, చంద్రుడు లేని తారల లాగా, పతకం లేని హారం లాగా, అన్నదానం లేకుండా పూర్తి కావు. 

షడ్రసాన్నీ జైసే వరాన్న3 | పుణ్యాంత పుణ్య అన్నదాన | 
ముకుట శోభేన కళసావీణ | కమల విహీన సర తైస | ||౨౧|| 
21. ఆరు గొప్ప రసాలలో, అన్నింటికంటే గొప్పది, పప్పు. పుణ్యాలలో గొప్ప పుణ్యం, అన్నదానం. కలశం లేని శిఖరం, తామరలు లేని సరోవరం ఎప్పటికీ శోభించవు. 
భజన జైసే ప్రేమావీణ | కుంకమావీణ సువాశీణ | 
సుస్వరావీణ గాణ్యాచా శీణ | తక్ర అలవణ అస్వాదూ | ||౨౨|| 
22. ప్రేమలేని భజన, కుంకుమం లేని ముత్తైదువ, మంచి గోంతు లేకున్నా, పాడాలన్న ప్రయత్నం, ఉప్పులేని మజ్జిగ, ఇవేవీ బాగుండవు (అలాగే, అన్నదానం లేని వేరే ఏ దానం కూడా శోభించదు). 
త్యాంతహీ వ్యాధిష్ట శక్తిహీన | అంధ పంగూ బధిర దీన | 
తయాంలా ఆధీ ఘాలావే అన్న | ఆప్తేష్ట జన త్యామాగే | | ||౨౩|| 
23. రోగులకు, బలహీనులకు, గుడ్డి, కుంటి, చెవిటి వారికి, దీనులకు ముందుగా అన్నం పెట్టాలి. వారి తరువాతనే, ఆప్తులకు, బంధుమిత్రులకు పెట్టాలి. 
ఆతా బాబాంచ్యా హండీచీ కల్పనా | సాధారణతః శ్రోతయా మనా | 
వ్హావీ మ్హణోని కరితో యత్నా | జిజ్ఞాసు జనా ప్రీత్యర్థ | ||౨౪|| 
24. తెలుసుకోవాలనే ఆతురత ఉన్నవారికి, మరియు శ్రోతలకు తెలియ చేయటానికి, బాబాయొక్క వంట పాత్ర గురించి చెప్పటానికి ప్రయత్నిస్తాను. 
మశీదీచియా అంగణాంత | చూల ఎక మోఠీ రచీత | 
వరీ విస్తీర్ణ పాతేలే ఠేవీత | పాణీ తే నియమిత ఘాలునీ | ||౨౫|| 
25. మసీదు ముంగిలి ప్రదేశంలో, బాబా ఒక పెద్ద పొయ్యిని పెట్టేవారు. దానిపై చాలా పెద్దదైన పాత్రను పెట్టి, దానిలో సరిపడా నీరు పోసేవారు. 
కధీ “మిఠ్ఠే చావల” కరీత | కధీ పులావా మాంసమిశ్రిత | 
కధీ కణికేచీ ముటకుళీ వళీత | వరాన్నీ శిజవీత డాళీచ్యా | ||౨౬|| 
26. కొన్ని సార్లు తీయటి పరమాన్నం, మరి కొన్ని సార్లు మాంసంతో పులావు వండేవారు. ఇంకొన్ని సార్లు గోధుమ పిండితో ఉండలు చేసి, ఉడుకుతున్న పప్పు పులుసులో వేసేవారు. 
కధీ కరూన కణికేచే రోడగే | అథవా థాపూన కణికేచే పానగే | 
సోడీత శిజత్యా వరణాంత అంగే | ముటకుళ్యాం సంగే హళువార | ||౨౭|| 
27. మరి కొన్ని సార్లు, ఆ పిండిని పలచగా ఒత్తి, సన్నని ముక్కలుగా కోసి, వానిని ఉడుకుతున్న పప్పులో మెల్లగా వేసేవారు. 
మసాలా వాటూన పాట్యావరతీ | స్వయే కరీత పాక నిష్పత్తీ | 
ముగవడ్యా కరూని స్వహస్తీ | హళూచ సోడితీ హండీత | ||౨౮|| 
28. రాతి బండ మీద మసాలాను బాగా నూరేవారు. అన్నింటినీ సరియైన పాళ్ళలో, స్వయంగా బాబాయే వేసేవారు. పెసర పప్పు వడలను చేసి, తమ చేతులతో, మెల్లగా గిన్నెలో వేసేవారు. 
స్వర్గాది భువనాచియా ఆశా | యజ్ఞార్థీ కరవూనియా పశుహింసా | 
బ్రాహ్మణహీ సేవితీ పురోడాశా | సశాస్త్ర హింసా హీ మ్హణతీ | ||౨౯|| 
29. స్వర్గాన్ని పొందాలనే ఆశతో, యజ్ఞయాగాలు చేసే బ్రాహ్మణులు, పశువులను హింసించి, అగ్నికి ఆహుతిని చేసేవారు. తరువాత, అందులోని మాంసాన్ని ప్రసాదంగా బ్రాహ్మణులు కూడా తినేవారు. ఈ హింసను శాస్త్రాలు అనుమతించినట్లుగా చెప్పుతారు. 
తైసేచ ముల్లాస ఆజ్ఞాపూన | కరఊని శాస్త్రోక్త మంత్రోచ్చరణ | 
బాబాహీ కరవీత అజాహనన | విధివిధాన పురఃసర | ||౩౦||
30. అలాగే బాబా కూడా, ముల్లాను పిలిపించి, అతనితో శాస్త్రోక్తంగా, ‘ఫాతిహా’ (ఇస్లాము మంత్రాలను) చెప్పించి, నియమించిన పద్ధతితో మేకను కోయించేవారు. 

కధీ మోఠీ కధీ లహాన | హండీచే యా ప్రకార దోన | 
తియేమాజీ శిజవూని అన్న | కరవీత భోజన అన్నార్థియా | ||౩౧|| 
31. కొన్ని సార్లు పెద్ద కొప్పెరలో, మరి కొన్ని సార్లు చిన్న తపేలాలో, అన్నం వండి, ఇష్ట పడిన వారికి, భోజనం వడ్డించేవారు.   
పన్నాస జణా పురేసే అన్న | పురవీ జీ తీ హండీ లహాన | 
జియేంత శంభర పాత్రే జేవూన | ఉరే జై అన్న తీ మోఠీ | ||౩౨|| 
32. యాభై మందికి అన్నం సరిపోయే తపేలా గిన్నె చిన్నది. వంద మందికి పైగా అన్నం వండే పాత్ర పెద్ద కొప్పెర. 
తదర్థ ఆపణ వాణియాకడే | స్వయే జాఊని ఠరవీత ఆకడే | 
ఉధారీచీ వార్తా న తికడే | పైసే తే రోకడే హాతావరీ | ||౩౩|| 
33. బాబా తామే స్వయంగా వర్తకుల దగ్గరకు వెళ్ళి, సరుకులు కొనేవారు. అరువు మాటే లేదు. వెంటనే చేతిలో డబ్బులు పెట్టేవారు. 
మీఠ, మిరచీ, జిరే, మిరే | భాజీపాలా నారళ ఖోబరే | 
స్వయే బాబా ఆణీత సారే | పూర్ణ విచారే ఠరవూన | ||౩౪|| 
34. ఉప్పు, మిరపకాయలు, మిరియాలు, జీలకర్ర, కాయగూరలు, ఆకు కూరలు, కొబ్బరికాయ, మొదలైన వస్తువులన్నిటినీ, బాగా చూచి, బేరం చేసి, స్వయంగా తామే తెచ్చేవారు. 
స్వయే బైసూని మశీదీతే | జాతే మాండూనియా నిజ హాతే | 
గహూ డాళ జోంధళియాతే | బాబాంనీ తేథే దళావే | ||౩౫|| 
35. మసీదులో కూర్చుని, విసురు రాయిని తెచ్చుకుని, గోధుమలను, పప్పును, జొన్నలను, బాబా స్వయంగా విసిరేవారు. 
హండీ ప్రీత్యర్థ ముఖ్య పరిశ్రమ | బాబాచ ఆపణ కరీత అవిశ్రమ | 
మసాలా వాటావయాచేంహీ కర్మ | కరీత కీ పరమ మనోభావే | ||౩౬|| 
36. వంట కోసం చేయవలసిన ముఖ్యమైన పనినంతా, విశ్రాంతి అనేది లేకుండా, బాబాయే స్వయంగా చేసేవారు. మసాలాలను కూడా ఎంతో ఇష్టంతో నూరేవారు. 
కరావయా సౌమ్య వా ప్రఖర | చుల్లీ మాజీల వైశ్వానర | 
ఇంధనే హీ స్వయే ఖాలవర | కరీత వరచేవర బాబా | ||౩౭|| 
37. పొయ్యిలోని మంటను ఎక్కువ తక్కువ చేయటానికి, అందులోని కట్టెలను కిందకూ, పైకీ తరచుగా జరుపుతుండేవారు, 
డాళ ఘాలూనియా భిజత | స్వయే పాట్యావర వాటూ లాగత | 
హింగ జిరే కోథింబిర మిశ్రిత | ఖమంగ బనవీత ఖాద్య స్వయే | ||౩౮|| 
38. పప్పును నాన పెట్టి, తామే బండపై నూరేవారు. ఇంగువ, జీలకర్ర, కొత్తిమీర అవి వేసి, వంటకాలను ఘుమఘుమలాడేలా చేసేవారు. 
తింబూనియా కణకీచే గోళే | కరూని సవ్వా హాత వేటోళే | 
లాటూనియా మగ తే సగళే | కరీత పోళే విస్తీర్ణ | ||౩౯|| 
39. పిండిని తడిపి, దానిని మూరేడు పొడవు ముద్దులుగా చేసి, వానిని వెడల్పుగా ఒత్తి, చపాతీలను చేసేవారు. 
జోంధళ్యాచే పీఠా ఆంత | పాణీ ఘాలూని ప్రమాణాంత | 
కరూనియా తే తక్రమిశ్రిత | ఆంబీలహీ కరీత హండీత | ||౪౦||
40. జొన్న పిండిలో సరిపడా నీరు పోసి, పాత్రలో కాచి, కొంత మజ్జిగను కలిపి, అంబలిని కూడా చేసేవారు. 

తీహీ అంబీల అవఘియాంతే | పరమప్రేమే బాబా హాతే | 
వాఢీత ఇతర అన్నా సమవేతే | అతి ఆదరే తే సమయీ | ||౪౧|| 
41. ఇతర వంటకాలతో పాటు, ఈ అంబలిని కూడా వారు ఎంతో ప్రేమతో అందరికీ వడ్డించేవారు. 
అసో హండీ శిజలీ పూర్ణ | ఏసీ నీట పారఖ కరూన | 
చుల్లీ ఖాలీ ఉతరవూన | మశీదీ నేఊన ఠేవవీత | ||౪౨|| 
42. అలా వంట పూర్తయ్యాక, పాత్రను పొయ్యి మీదనుండి దింపి, తీసుకుని వెళ్ళి మసీదులో ఉంచేవారు. 
విధిపూర్వక మౌలవీ హస్తే | ఫాత్యా దేవవూన త్యా అన్నాతే | 
ప్రసాద పాఠవీత మ్హాళసాపతీతే | ఆణిక తాత్యాంతే ఆరంభీ | ||౪౩|| 
43. మౌల్వీతో శాస్త్ర ప్రకారంగా ‘ఫాతిహా’ (ఇస్లాం ధర్మ ప్రార్థనలు) చేయించేవారు. ఆ నైవేద్య ప్రసాదాన్ని మొదట మహల్సాపతికి, తాత్యాకు పంపేవారు. 
మగ తే శేష సకళ అన్న | బాబా వాఢీత నిజ హస్తే కరూన | 
గరీబ దుబళే తృప్త కరూన | సుఖ సమాధాన పావత | ||౪౪|| 
44. మిగతా నైవేద్యాన్నంతా, స్వయంగా తమ చేతులతో, బాబా వడ్డించేవారు. పేదవారు, బలంలేని వారు అది తిని తృప్తి చెందినప్పుడు, బాబా ఎంతో సంతోషంగా ఉండేవారు. 
తే అన్నార్థీ యావత్‍తృప్తి | అన్న సేవితీ ఉల్లాసవృత్తీ | 
వరీ బాబా ఆగ్రహ కరితీ | “ఘ్యా, ఘ్యా” మ్హణతీ ప్రీతీనే | ||౪౫|| 
45. ఆ భోజనం కోసం ఇష్టపడి వచ్చినవారు, కడుపు నిండేవరకు సంతోషంగా, తృప్తిగా తినేవారు. అయినా బాబా వారిని “తీసుకోండి, తీసుకోండి” అని ఎంతో ప్రేమతో బలవంత పెట్టేవారు. 
కాయ తయాంచే పుణ్య గహన | జయా హే లాధలే తృప్తి భోజన | 
స్వయే బాబా జ్యా ఓగరితీ అన్న | కాయ తే ధన్య భాగ్యాచే | ||౪౬|| 
46. స్వయంగా తమ చేతులతోనే బాబా వడ్డించగా, తృప్తిగా భోజనం చేసినవారు, ఎంత భాగ్యవంతులో! వారు ఎంతో ధన్యులు! 
యేథే సహజ యేఈల ఆశంకా | ప్రసాద మ్హణూని బాబా లోకా | 
సమాంస అన్నహీ భక్తా అనేకా | నిఃశంక మనే కా వాటీత | ||౪౭|| 
47. ఇక్కడ ఒక అనుమానం కలగవచ్చు. మాంసంతో వండిన అన్నాన్ని, ప్రసాదమని, భక్తులందరికీ భేదభావం లేకుండా, బాబా వడ్డించేవారా అని. 
తరీ యా శంకేచే నిరాకరణ | కరావయా న లాగే శీణ | 
జయాంస నిత్యాచే మాంసాశన | తయాంసిచ హే అన్న వాఢీత | ||౪౮|| 
48. ఈ అనుమానాన్ని తీర్చడం అంత కష్టమేమీ కాదు. మాంసం తినే అలవాటున్న వారికే బాబా ఆ అన్నాన్ని వడ్డించేవారు. 
ఆజన్మాంత నాహీ సహవాస | తయా స్పర్శూ న దేతీ మాంసాస | 
కధీంహీ న కరితీ హే సాహస | ప్రసాదీ లాలసా త్యా దేతీ | ||౪౯|| 
49. జీవితంలో ఎన్నడూ మాంసాన్ని ఎరుగని వారిని, అసలు మాంసాన్ని బాబా తాకనిచ్చే వారు కాదు. ఆ ప్రసాదాన్ని కావాలని కోరుకునే వారికే పెట్టేవారు. 
గురు స్వయే ప్రసాద దేతా | సేవ్యాసేవ్యాచా వికల్ప యేతా | 
శిష్య పావే నిజాత్మఘాతా | అధఃపాతాతే జాఈ | ||౫౦||
50. కాని, గురువే స్వయంగా ప్రసాదాన్ని ఇచ్చినప్పుడు, ‘తినవచ్చా, తినకూడదా’ అన్న ఆలోచన వస్తే, ఆ శిష్యుడు తన్ను తాను నాశనం చేసుకుని, నరకానికి పోతాడు. 

యా తత్త్వాచీ కోఠవర జాణ | జాహలీ ఆపుల్యా భక్తాంలాగూన | 
మ్హణోని థట్టా వినోదే కరూన | బాబా హే ఆపణ అనుభవీత | ||౫౧|| 
51. ఈ తత్వాన్ని తమ భక్తులు ఎంత వరకు అర్థం చేసుకున్నారని, వినోదాలతో, తమాషాలతో బాబా పరీక్షించి చూసేవారు. 
యే అర్థీచీ అల్ప వార్తా | ఆఠవలీ జీ లిహితా లిహితా | 
శ్రోతీ పరిసిజే స్వస్థ చిత్తా | నిజహితార్థా లాగూన | ||౫౨|| 
52. ఇలా వ్రాస్తూ ఉంటే, ఒక చిన్న సంగతి గుర్తుకు వచ్చింది. తమ మేలు కొరకు, శ్రోతలు సావధానంగా దీనిని వినండి. 
ఆలీ ఎకదా ఎకాదశీ | బాబా వదతీ దాదాపాశీ4
“కోర్హాళ్యాహూన సాగోతీశీ | ఆణవిశీ కా మజలాగీ” | ||౫౩|| 
53. ఒక సారి, ఏకాదశి రోజున, దాదా కేల్కరుతో బాబా “నా కోసం, కొర్హాలానుండి మాంసాన్ని తెచ్చి పెడతావా?” అని అడిగారు. 
తదర్థ సాఈనీ రుపయే కాఢిలే | దాదాపాశీ మోజూన దిధలే | 
“జాతీనే జా” ఆజ్ఞాపిలే | “తూంచ హే కేలే పాహిజే” | ||౫౪|| 
54. దాని కొరకు, సాయి కొన్ని రూపాయలను తీసి, లెక్కపెట్టి, దాదాకు ఇచ్చి, “నువ్వే స్వయంగా వెళ్ళు”, అని “దీనిని నువ్వే చేయాలి” అని ఆజ్ఞాపించారు. 
నామే గణేశ దామోదర | ఉపనామ జయాంచే కేళకర | 
జన జాణోని తే వయస్కర | దాదాచ సర్వ సంబోధితీ | ||౫౫|| 
55. అతని పేరు గణేశ దామోదర. ఇంటి పేరు కేళకరు. వయస్సులో పెద్దవాడని, అందరూ అతనిని ‘దాదా’ అని పిలిచే వారు. 
హరీ వినాయక సాఠ్యాంచే శ్వశుర | సాఈపదీ ప్రేమ అనివార | 
బ్రాహ్మణ బ్రహ్మకర్మీ ఆదర | ఆచారవిచారసంపన్న | ||౫౬|| 
56. ఇతను హరి వినాయక సాఠేకు మామ. సాయి అంటే అతనికి చాలా ప్రేమ. స్వయంగా బ్రాహ్మణుడై, బ్రహ్మ కర్మ అంటే గౌరవమున్న వాడు. ఆచారాలను ఎంతో శ్రద్ధగా పాటించేవాడు. 
కరితా రాత్రందిన నిజగురు సేవా | ధణీ న పురే జయాచ్యా జీవా | 
తయాస యా ఆజ్ఞేచా నవలావా | నకళే వాటావా కైసేనీ | ||౫౭|| 
57. రాత్రింబవళ్ళు గురు సేవను చేసినా, తృప్తి చెందని వాడు. ఇలాంటి వానికి, ఇలాంటి ఆజ్ఞ విని, ఎందుకు ఆశ్చర్యం కలగలేదో, నాకు తెలియదు. 
జయాచీ గాత్రే అవికళ | జయా పూర్వాభ్యాసాచే బళ | 
తయాచే మన కధీ న చంచళ | బుద్ధీహీ అచళ గురుపదీ | ||౫౮|| 
58. దృఢమైన దేహం కలిగి, అభ్యాసం ద్వారా, మనసును నిలకడగా ఉంచుకున్న వారి బుద్ధి కూడా, గురువు పాదాల మీదా స్థిరంగా ఉంటుంది. 
ధనధాన్య వస్త్రార్పణ | హేంచ నవ్హే దక్షిణాదాన | 
గుర్వాజ్ఞేచే అనుష్ఠాన | గురు సంతోషణ దక్షిణా | ||౫౯|| 
59. కేవలం, ధనధాన్యాలు, వస్త్రాలు, మొదలైనవి గురువుకు అర్పించటం మాత్రమే గురు దక్షిణ కాదు. గురువుగారి ఆజ్ఞను పాటించి, వారిని సంతోష పరచడమే అసలైన గురు దక్షిణ. 
కాయా వాచా మనాదికాంచీ | కరీ జో కురవండీ సర్వాంచీ | 
అంతీ జో సాధీ గురుకృపేచీ | ప్రాప్తీ తయాచీ నిజశ్రద్ధా | ||౬౦||
60. తన దేహం, మాట, మనసు అన్నిటినీ గురువుకు అర్పించి, గురువు కృపను పొందిన వారిదే నిజమైన నమ్మకం. 

మగ తీ ఆజ్ఞా వందూని శిరీ | కపడే కరూని ఆలే సత్వరీ | 
నిఘాలే జాఊ త్యా గాంవావరీ | తంవ మాఘారీ బోలావిలే | ||౬౧|| 
61. బాబా ఆజ్ఞకు తలవంచి, దాదా వెంటనే బట్టలను మార్చుకొని, ఆ ఊరికి బయలుదేరాడు. అప్పుడు బాబా అతనిని వెనుకకు పిలిచారు.
“అరే, హీ ఖరేదీ కరావయాస | కోణాస తరీ పాఠవీనాస” | 
మ్హణాలే “జాణ్యాయేణ్యాచా త్రాస | ఉగీ న సాయాస కరావే” | ||౬౨|| 
62. “అరే, అది కొనడానికి వేరే ఎవరినైనా పంపరాదూ! అనవసరంగా పోవటం, రావటం, నీకెందుకు శ్రమ?” అని అన్నారు. 
మగ తీ సాగోతీ ఆణావయాస | దాదాంనీ పాఠవిలే పాండూ గడ్యాస | 
ఇతుక్యాంత బాబా వదతీ దాదాంస | పహా త్యా సమయాస కాయ తే | ||౬౩|| 
63. అందుకు, మాంసాన్ని తేవటానికి పాండు అనే నౌకరును దాదా పంపాడు. ఇంతలో, దాదాతో బాబా అప్పుడు ఏమన్నారో వినండి. 
పాండూ నిఘాలా జావయాస | పాహూని లాగలా తో రస్త్యాస | 
“రాహూ దే” మ్హణతీ “ఆజచా దివస” | పరతవీ తయాస మాఘారా | ||౬౪|| 
64. పాండు బయలుదేరి పోతుండగా, దాదాతో “ఉండనీ లే, ఈ రోజుకు” అని బాబా అతనిని వెనుకకు రప్పించారు. 
అసో పుఢే ఎక్యా కాళీ | ఆలీ హండీ బనవిణ్యాచీ ఉకళీ | 
చులీవర డేగ5 చఢవిలీ | సాగోతీ రిచవిలీ తియేంత | ||౬౫|| 
65. ఒక సారి, వంట చేయాలని బాబాకు బుద్ధి పుట్టింది. పొయ్యి మీద డేగిసాను ఉంచి, దానిలో మాంసపు ముక్కల్ని వేశారు. 
తాందూళ ధుఊన టాకిలే తీంత | యథా ప్రమాణ పాణీ ఘాలీత | 
లాంకడే సారూన ఖాలీ చులీంత | బాబా తీ ఫుంకీత బైసలే | ||౬౬|| 
66. తరువాత, బియ్యాన్ని కడిగి అందులో పోశారు. సరిపడా నీరు పోసి, పొయ్యిలో కర్ర మంట పెట్టి, ఊదుతూ కూర్చున్నారు. 
గాంవ సగళా త్యాంనా అంకిత | కోణీహీ ఆనందే బసతా ఫుంకీత | 
పరి బాబాంచ్యా ఆజ్ఞే విరహీత | చాలేనా హింమత కవణాచీ | ||౬౭|| 
67. గ్రామస్థులంతా వారి మాట దాటరు. ఎవరైనా కూర్చుని, ఆనందంగా ఊదుతారు. కాని, బాబా ఆజ్ఞ లేకుండా అలా చేయడానికి ఎవరికీ ధైర్యం లేదు. 
అన్నహీ రాంధూన ఆణావయాస | ఆజ్ఞాచ కరణ్యాచా అవకాశ | 
పరమ సోత్కంఠ సాఈచే దాస | సాఈచ ఉదాస ఎతదర్థ | ||౬౮|| 
68. బాబా ఆజ్ఞ చేస్తే, వారి భక్తులు ఎంతో ఉత్సాహంగా అన్నం కూడ వండి, ప్రేమతో పట్టుకుని తెస్తారు. కాని, బాబాకు అది ఇష్టం లేదు. 
ఉదాస మ్హణణే హేంహీ నసార్థ | స్వయంపాకీ జయా స్వార్థ | 
తో ఇతరాంతే కష్టవీల కిమర్థ | అన్నదానార్థ పరకియా | ||౬౯|| 
69. వారికి ఇష్టం లేదు అని అనటం కూడా సరి కాదు. ఎందుకంటే, వారే స్వయంగా వంట చేయాలని అనుకున్నప్పుడు, అన్నదానానికి ఇతరులను ఎందుకు కష్ట పెడతారు? 
నిజనిర్వాహా పోటాపూరీ | స్వయే జో మాగే మధుకరీ | 
హిండే తదర్థ దారోదారీ | మాగే భాకరీ చతకోర | ||౭౦||
70. వారు స్వయంగా ఇంటింటికీ తిరిగి, భిక్ష చేసి, తమ పొట్ట నింపుకోవటానికి, రొట్టెముక్కలను అడుక్కునే వారు. 

తోచ కరావయా అన్నదాన | సోశీల జేవ్హా కష్ట ఆపణ | 
తేవ్హాంచ తయాతే సమాధాన | రాహీనా అవలంబూన కోణావరీ | ||౭౧|| 
71. అలాంటిది, అన్నదానం చేయటానికి తాము కష్ట పడితేనే తృప్తి. అందువలన, వారు ఎవరిపైనా ఆధార పడేవారు కాదు. 
శంభర పాత్రాంచా స్వయంపాక | హోఈల ఇతుకే పీఠకణీక | 
 తాందూళ డాళ పాహూని చోఖ | ఆణీత రోఖ బాబా స్వయే | ||౭౨|| 
72. వంద మందికి సరిపడేలా పిండి, బియ్యం, పప్పు మొదలైన వస్తువులను, చక్కగా యేరుకుని, డబ్బు చెల్లించి, బాబా స్వయంగా తెచ్చేవారు. 
స్వయే సూప ఘేఊన హాతీ | వాణియాచే దుకానీ జే జాతీ | 
వ్యవహారీ చోఖ అసావే కితీ | జన హే శికతీ జయాచేనీ | ||౭౩|| 
73. చేటను చేతిలో పుచ్చుకుని, వర్తకుల అంగళ్ళకు తామే వెళ్ళేవారు. వ్యవహారం చేసేటప్పుడు ఎంత జాగురూకతతో ఉండాలో, వారిని చూసి నేర్చుకోవాలి. 
వస్తూ స్వయే హాతీ ఘేఊన | కరిత దరదామ కసూన | 
కోణీ జాఊ న శకే ఛకవూన | గర్వ హరూన జాతసే | ||౭౪|| 
74. వస్తువులను చేతిలో తీసుకుని, పరీక్షించి, చక్కగా బేరమాడేవారు. వారిని ఎవరూ మోసం చేయలేక పోయేవారు. పైగా, ఆ వర్తకుల గర్వం కూడా తొలగి పోయేది. 
ఏసా హిశేబీ ఆవ ఘాలితీ | పఈహీ న తేథే జాఊ దేతీ | 
పాంచ మాగతా దహా దేతీ | దామ చుకవితీ హాతోహాత | ||౭౫|| 
75. చక్కగా ధర కట్టి, లెక్క చేసినట్లు నటించినా, వర్తకులు ఐదు అడిగితే, వెంటనే పది ఇచ్చేసే వారు. 
స్వయే కామాచీ మోఠీ హౌస | దుజియానే కేలే న చలే త్యాంస | 
న ధరీ కధీ కుణాచీ ఆస | పరి న త్రాస కవణాచా | ||౭౬|| 
76. తమ పని తామే చేసుకోవటంలో వారికి ఎంతో ఉత్సాహం. ఇతరులు చేస్తే, వారికి నచ్చేది కాదు. ఇతరులు చేస్తారనే ఆశ కూడా పెట్టుకునే వారు కాదు. వారివల్ల ఎవరికీ ఏ కష్టమూ ఉండేది కాదు. 
హే ఎక తత్త్వ బాబాపాశీ | హోతే జాగృత అహర్నిశీ | 
మ్హణూన యా హండీచే కార్యాశీ | సాహ్య న కోణాశీ మాగత | ||౭౭|| 
77. రాత్రింబవళ్ళూ, ఎల్లప్పుడూ బాబా స్వభావం ఇలాగే ఉండేది. అందుకే, వంట చేయటంలో ఎవరి సహాయాన్ని అడిగేవారు కాదు. 
హండీచ కాయ ధునీచ్యా లగత | సర్పణాచే ఖోలీచీ భింత | 
పూర్వభాగాచీ తీన చతుర్థ | స్వహస్త రచిత బాబాంచీ | ||౭౮|| 
78. వంట మాత్రమేనా! ధునికొరకు కర్రలను ఉంచే గదియొక్క ముందు భాగం, మూడు వంతుల గోడ, బాబా తమ చేతులతోనే కట్టినది. 
మహాదూ కరీ కర్దమగారా6 | బాబా థాపీ ఘేఊని నిజకరా | 
రచీత విటాంచ్యా థరావర థరా | భింతీ ఉభారావయాస | ||౭౯|| 
79. పనివాడు మహాదు, మట్టి, సున్నం లేక ఆవుపేడ, మరియు నీరును బాగా కలిపి, మిశ్రమం చేసి ఇస్తే, తమ చేతిలో తాపీని పట్టుకుని, ఇటుకలను వరుసపై వరుస పేర్చుతూ, బాబా గోడ కట్టేవారు. 
ఆణిక బాబా కాయ న కరితీ | మశీద ఆపణ స్వయే సారవితీ | 
హాతీ కఫనీ లంగోట శివతీ | ఆస న ఠేవితీ కవణాచీ | ||౮౦||
80. వారు చేయని పని అంటూ ఏముంది? మసీదును తామే అలికేవారు. తమ కఫినీని, లంగోటీని చేత్తో తామే కుట్టుకునే వారు. ఎవరిపైనా ఆశ పెట్టుకునే వారు కాదు. 

హండీతూన యేతా వర | వాఫా ఉసళత అసతా భయంకర | 
అస్తనీ సారూని బాబా నిజకర | ఘాలూని ఖాలవర ఢవళీత | ||౮౧|| 
81. కొప్పెరలోనుండి ఆవిరి భయంకరంగా పైకి వస్తుంటే, చేతి మీది చొక్కాను పైకి జరుపుకొని, చక్కగా బాబా కిందా పైనా కలిపేవారు.
పాహూని తపేలే ఖతఖతలే | ఢవళణ్యాచే యోగ్య ఝాలే | 
నవల బాబా ఏసియా వేళే | అగాధలీలే దావీత | ||౮౨|| 
82. ఆ పాత్రలో కుతకుతలాడుతూ, ఉడుకుతున్నప్పుడు, కలపవలసి వస్తే, బాబా అమోఘమైన లీలను చూపేవారు.
కోఠే రక్తమాంసాచా హాత | కోఠే తపేలే ప్రఖర రఖరఖీత | 
పరి న భాజల్యాచీ ఖూణ యత్కించిత | న భయభీత ముఖచర్యా | ||౮౩|| 
83. ఎక్కడ రక్త మాంసాల వారి చేయి! ఎక్కడ కుతకుత ఉడుకుతున్న కొప్పెర! అయినా, వారి ముఖంలో భయంగాని, లేక వారి చేతిపై కాలిన గుర్తు కాని, కనిపించేవి కావు.
జో భక్తాంచియా పడతా మస్తకీ | తాత్కాళ వారీ త్రితాప సమస్త కీ | 
తయాసీ కైసే దుఖవావే పావకీ7 | మహతీ న ఠావుకీ కాయ తయా | ||౮౪|| 
84. భక్తుల తలపై పెట్టగానే, వారి మూడు తాపాలనూ తొలగించే బాబా చేతిని, అగ్ని ఎలా బాధపెట్టగలదు? అగ్నికి వారి మహిమ తెలియదా!
భిజలీ డాళ పాట్యావరతీ | ఘాలూనియా స్వయే నివడితీ | 
స్వయే వరవంటా ఘేఊని వాటితీ | ముగవడ్యా బనవితీ నిజ హస్తే | ||౮౫|| 
85. నానపోసిన పప్పును రాతిబండ పైన పోసుకుని, చక్కగా ఏరి, సన్నికల్లుతో నూరి, బాబా తమ చేత్తో పెసర వడలను చేసేవారు.
మగ త్యా హండీత హళూచ సోడితీ | ఖాలీ8 న లాగావ్యా మ్హణూనీ ఘాటితీ9
తయార హోతా హండీ ఉతరితీ | ప్రసాద వాటితీ సకళికా | ||౮౬|| 
86. వీటిని మెల్లగా పాత్రలో వేసి, అడుగు మాడకుండా కలిపేవారు. తయారయ్యాక, పాత్రను కిందకు దించి, ప్రసాదాన్ని అందరికీ పంచేవారు.
సకళికా కా మ్హణతీల శ్రోతే | సాఈబాబా తో యవన హోతే | 
మగ ఏసియా అధర్మాచరణాతే | జాహలే కరవితే కైసేనీ | ||౮౭|| 
87. ‘అందరికీనా?’ అని శ్రోతలు అడుగుతారేమో! సాయిబాబా ముస్లిము కదా, మరి ఇలాంటి అధర్మాన్ని భక్తుల చేత సాయి ఎలా చేయించేవారు?
యా శంకేచే ఎకచి ఉత్తర | ధర్మ ఆణి అధర్మ విచార | 
సాఈపాశీ హే సాచార | నిరంతర జాగత | ||౮౮|| 
88. ఈ అనుమానానికి ఒక్కటే జవాబు. సాయికి ధర్మం అధర్మం గురించి, నిజమైన అవగాహన ఎప్పుడూ ఉండేది.
హండీతీల శిజలేలే పదార్థ | ఘ్యావేత సర్వానీ సేవనార్థ | 
ఏసా దురాగ్రహ యత్కించిత | సాఈ న ధరీత కేవ్హాంహీ | ||౮౯|| 
89. “కొప్పెరలో వండిన పదార్థాలను అందరూ తినాలి”, అని సాయి ఎవరినీ, ఎప్పుడూ బలవంత పెట్టేవారు కాదు.
పరి తో ప్రసాద వ్హావా ప్రాప్త | ఏసియా సదిచ్ఛే జే జే ప్రేరిత | 
తయాంచీ కేవళ వాసనా పురవీత | ప్రపంచ న కరీత కేవ్హాంహీ | ||౯౦||
90. కాని, ఆ ప్రసాదాన్ని తినాలని ఆశ పడిన వారి కోరికను, తీర్చేవారు. అయినా, ఎప్పుడూ ఎవరినీ మోసగించే వారు కాదు.

శివాయ ఠావీ కోణాస జ్ఞాతీ | మశీదీ వసతీ యవన మ్హణతీ | 
పరి తయాంచీ ఆచరితీ రీతీ | పాహూని జాతీ కళేనా | ||౯౧|| 
91. ఇంతకీ, వారి జాతి అసలు ఎవరికి తెలుసు కనుక? మసీదులో ఉంటారు, కనుక ముసల్మాను అని అంటారు. కాని, వారి పద్ధతులను, ఆచరణను చూసి, వారి జాతిని ఎవరూ పసిగట్టలేరు.
భక్త జయాస దేవ మానితీ | జయాచ్యా తే పదరజీ లోళతీ | 
తయాచీ అవలోకీ కాయ జాతీ | పరమార్థప్రాప్తీ ధిక్‍ త్యాంచీ | ||౯౨|| 
92. ఎవరిని భక్తులు దైవమని అంటారో, ఎవరి పాదాల ధూళిలో పొర్లుతారో, అలాంటి వారి జాతి గురించి ఆలోచించే వారి, పరమార్థ ప్రయత్నానికి సిగ్గుపడాలి.
ఇహాముత్రీ జో బాణలా విరక్తీ | వివేక వైరాగ్య జయాచీ సంపత్తీ | 
కాయ తయాచీ పహాణే జాతీ | పరమార్థ ప్రాప్తీ ధిక్‍ త్యాచీ | ||౯౩|| 
93. ఎవరిలో ఈ లోకం, పరలోకం గురించి విరక్తి, మరియు వైరాగ్యం, వివేకాల ఆస్తి విపరీతంగా ఉందో, అలాంటి వారి జాతిని వెదికే వారి పరమార్థ ప్రయత్నం సిగ్గుచేటు.
ధర్మాధర్మాతీంత స్థితీ | జయాచీ శుద్ధ ఆనందవృత్తీ | 
కాయ తయాచీ పాహణే జాతీ | పరమార్థ ప్రాప్తీ ధిక్‍ త్యాచీ | ||౯౪|| 
94. ఎవరు ఎప్పుడూ ధర్మం అధర్మాలకు మించి, శుద్ధమైన ఆనంద స్థితిలో ఉంటారో, అలాంటి వారి జాతి గురించి తెలుసుకోవాలనే వారి, పరమార్థ ప్రయత్నం సిగ్గుచేటు.
ఏసే హే బాబాంచే చరిత | మీ తో గాఈ నిజసుఖార్థ | 
అసేల కోణా శ్రవణాచీ ఆర్త | పురేలహీ భావార్థ తయాచా | ||౯౫|| 
95. ఇలాంటి సాయియొక్క చరిత్రను, నా సంతోషం కోసం పాడుతున్నాను. వినాలనే కోరిక ఎవరికైనా ఉంటే, వారిని ఇది తృప్తి పరుస్తుంది.
అసో యా కథేచే అనుసంధాన | రాహిలే మాగేంచ పహా పరతూన | 
 బాబా దాదాస అనులక్షూన | వదతీ అవధాన ద్యా తేథే | ||౯౬|| 
96. ఇక వెనుక ఉండిపోయిన కథను తిరిగి చూద్దాం. దాదాతో బాబా ఏమన్నారో వినండి.
“ఖారా పులావా ఆహే కేలా | పాహిలాస కా కైసా ఝాలా” | 
దాదానీ ఉపచారార్థ నావాజిలా | హోహో చాంగలా మ్హణూనీ | ||౯౭|| 
97. “ఖారా పులావు చేశాను. ఎలా వచ్చిందో చూశావా?” అని అడిగారు. దానికి, మర్యాద కోసం, దాదా, ‘ఓహో! చాలా బాగుంది’ అని అన్నాడు.
దాదా పురాణేభక్త వరిష్ఠ | స్నాన సంధ్యా నియమనిష్ఠ | 
పాహతీ సదా శిష్టాశిష్ట | తయా న హే ఇష్ట వాటలే | ||౯౮|| 
98. దాదా వెనుకటి కాలం నాటి భక్త శ్రేష్ఠుడు. స్నానం, సంధ్యావందనాలు, మొదలైన వాటిని నియమ నిష్ఠలతో పాటించేవాడు. మంచి చెడులను తెలిసిన వాడు. అతనికి బాబా పద్ధతి నచ్చలేదు.
నాహీ కధీ దృష్టీ దేఖిలా | నాహీ కధీ జివ్హే చాఖిలా | 
ఏసియాస కైసా మ్హణసీ చాంగలా | మ్హణతీ దాదాలా తవ బాబా | ||౯౯|| 
99. దానికి బాబా “ఎప్పుడూ నాలుకతో రుచి చూడలేదు, కనీసం కళ్ళతో కూడా చూడలేదు. అలాంటిది బాగుందని ఎలా చెప్పగలవు?” అని దాదాను అడిగారు.
“కాఢ కీరే డేగీచే ఝాంకణ | పహా కీ ఆంత హాత ఘాలూన” | 
మగ స్వయే తయాంచా హస్త ధరూన | ఖుపసితీ ఆంతూన డేగీచ్యా | ||౧౦౦||
100. “డేగిస మీద మూత తీసి, చేయి లోపల పెట్టి చూడు” అని అంటూ, అతని చేతిని బాబా పట్టుకుని, డేగిస లోపలికి తోశారు.

పుఢే మ్హణతీ “హాత కాఢ | పళా ఘే హా తాటాంత వాఢ | 
సోవళ్యాచీ న ధరీ చాడ | ఉగీచ బాడ మారూ నకో” | ||౧౦౧|| 
101. తరువాత, బాబా “ఇప్పుడు చేయి తీసేయి. గరిటె తీసుకుని పళ్ళెంలోకి వడ్డించు. మడి గురించి ఆలోచించకు. ఉత్తుత్తిగా బడాయి చేయకు” అని అన్నారు.
సంత మ్హణతీల శిష్యాస బాట | కల్పనాచ హీ ఆధీ అచాట | 
సంత కృపేనే భరలే ఘనదాట | తయాచీ వాట త్యా ఠావీ | ||౧౦౨|| 
102. ‘సత్పురుషులు శిష్యులకు చేయరానిది చేయమని చెప్పుతారు’ అని అనుకోవడం పొరపాటు. వారు ఎప్పుడూ విపరీతమైన దయకలిగి ఉంటారు. వారు చేసేది వారికే తెలుసు. 
ఖర్యా ప్రేమాచీ ఉఠతా లహరీ | మాతా హీ ములా ఘే చిమటా కరీ | 
మగ జై బాళ ఆరోళీ మారీ | తవ తీచ ధరీ పోటాసీ | ||౧౦౩|| 
103. ప్రేమ పొంగినప్పుడు, తల్లి కూడా బిడ్డను గిల్లి, బిడ్డ ఏడుస్తుంటే, తన గుండెలకు హత్తుకుంటుంది. 
అభక్ష భక్షార్థీ జయాచే మన | తయాచీ వాసనా కరితీ శమన | 
తేంచ కరీ జో మనాచే దమన | తయాస అనుమోదన దే సాఈ | ||౧౦౪|| 
104. తినకూడని వానిని తినాలని, ఇష్టపడిన వారి కోరికను, బాబా తీరుస్తారే కాని, మనసును అదుపులో పెట్టుకున్న వారంటేనే బాబాకు నచ్చుతారు. 
హీ ఆజ్ఞాపాలన మీమాంసా | జాఈ కధీ తీ ఇతుకీ కళసా | 
స్పర్శలే జే న ఆజన్మ మాంసా | తయాంచా భరవసా డళమళే | ||౧౦౫|| 
105. గురువు ఆజ్ఞ పాటించాలనే శిష్యుడి నిశ్చయం, ఎంత కష్టమైన పరీక్షకు దారి తీసేదంటే, జీవితంలో ఎన్నడూ మాంసాన్ని తాకని వాడి నిశ్చయం కూడా, నిలకడ తప్పేది. 
పాహూ జాతా వస్తుస్థితీ | ఏసియా భక్తా కవణాహీ ప్రతీ | 
కధీ న బాబా స్వయే ప్రవర్తవితీ | ఉన్మార్గవర్తీ వ్హావయా | ||౧౦౬|| 
106. అలా చూస్తే, నిజానికి, బాబా ఎప్పుడూ, ఏ భక్తుని కూడా, తప్పు దారిలో ప్రవేశ పెట్టేవారు కాదు. 
అసో సన ఎకోణీసశే దహా | తయా వర్షాపూర్వీ పహా | 
యోగ హండీచా వరచేవర హా | బహు ఉత్సాహా సమన్విత | ||౧౦౭|| 
107. క్రి. శ. ౧౯౧౦వ సంవత్సరానికి ముందు, ఎంతో ఉత్సాహంగా, బాబా తరచూ వంటలు వండేవారు. 
తేథూన పుఢే ముంబా శహరీ | దాస గణూచీ ఆలీ ఫేరీ | 
సాఈమాహాత్మ్య కీర్తనగజరీ | కోందిలే అంతరీ సకళాంచ్యా | ||౧౦౮|| 
108. తరువాత, ముంబై పట్టణంలో, మరి అక్కడక్కడా, దాసగణు కీర్తనల ద్వారా, సాయి గొప్పతనం ప్రజల మనసులో నిలిచి పోయింది. 
తేవ్హాం పాసూన బాబాంచీ మహతీ | కళూని ఆబాలవృద్ధాంప్రతీ | 
తేథూని జన జాఊ లాగతీ | శిరడీ న గణతీ తయాంచీ | ||౧౦౯|| 
109. అప్పటినుండి, చిన్నా పెద్దా అందరూ, బాబా మహిమను తెలుసుకున్నాక, లెక్కలేనన్ని జనులు శిరిడీ రాసాగారు. 
పుఢే పూజా పంచోపచార | నైవేద్యాచే నానాప్రకార | 
సురూ ఝాలే ఆహార ఉపహార | దుపారతిపార బాబాంస | ||౧౧౦||
110. తరువాత బాబాకు పంచోపచార పూజలు, ఎన్నో రకాల నైవేద్యాలు, మధ్యాహ్నం, సాయంకాలం, భోజన ఫలహారాలు మొదలయ్యాయి. 

వరణ భాత శిరాపురీ | చపాత్యా చటణీ కోశింబిరీ | 
నానావిధ పంచామృత ఖిరీ | అన్నసామగ్రీ లోటలీ | ||౧౧౧|| 
111. అన్నం, పప్పు, పూరీ, హల్వా, చపాతీలు, పచ్చళ్ళు, వడపప్పు, ఇంకా ఎన్నో రకాల వంటకాలు, పంచామృతం, పాలన్నం అవీ విపరీతంగా వచ్చేవి. 
యాత్రా లోటలీ అపరిమిత | జో తో దర్శనా జాఈ ధాంవత | 
సాఈ చరణీ నైవేద్య అర్పీత | క్షుధార్త సంతృప్త సహజేంచ | ||౧౧౨|| 
112. యాత్రికులు పరుగెత్తుకుంటూ వచ్చేవారు. సాయికి నైవేద్యాన్ని అర్పించేవారు. దానితో ఆకలిగొన్నవారు తృప్తి చెందేవారు. 
హోఊ లాగలే రాజోపచార | ఢాళూ లాగలే ఛత్రచామర | 
టాళ ఘోళ వాద్య గజర | భజక పరివార వాఢలా | ||౧౧౩|| 
113. బాబాకు ఛత్ర చామరాలతో రాజోపచారాలు జరిగేవి. తాళాలు, తప్పెట్లు, ఢోలు మొదలైన వాద్యాల ఘోషతో, భజనలు చేసేవారూ పెరిగారు. 
మహిమా వాఢలా సర్వత్ర | గాఊ లాగలే స్తుతిస్తోత్ర | 
పుఢే శిరడీ జాహలే క్షేత్ర | పరమ పవిత్ర యాత్రార్థియా | ||౧౧౪|| 
114. సాయి మహిమ అంతటా వ్యాపించింది. భక్తులు స్తోత్రాలతో స్తుతించే వారు. తరువాత, యాత్రికులకు శిరిడీ పరమ పవిత్రమైన పుణ్య క్షేత్రమైంది. 
తేణే హండీచే కారణ సరలే | నైవేద్య ఇతుకే యేఊ లాగలే | 
త్యాంతచి ఫకీర ఫుకరే ధాలే | ఉరూ లాగలే అన్న బహు | ||౧౧౫|| 
115. దానితో, బాబా వంట చేయడం ఆగిపోయింది. నైవేద్యాలు ఎంత ఎక్కువగా వచ్చేవి అంటే, ఫకీరులు, భిక్షగాళ్ళు తిన్నా, ఇంకా చాలా అన్నం మిగిలి పోయేది. 
ఆతా కథితో ఆణిక కథా | పరిసతా ఆనంద హోఈల చిత్తా | 
ఆరాధ్య వస్తూచా అనాదర కరితా | బాబా నిజచిత్తా అప్రసన్న | ||౧౧౬|| 
116. ఇప్పుడు, శ్రోతలకు ఆనందాన్ని కలిగించే ఇంకొక కథను చెప్తాను. మనం ఆరాధించే, మనల్ని రక్షించే దైవాన్ని ఉపేక్షిస్తే, బాబా సహించేవారు కాదు. 
కరూని కాంహీ తరీ అనుమాన | కోణీ సాఈస మ్హణతీ బ్రాహ్మణ | 
కోణీ తయా ముసలమాన | జ్ఞాతి విహీన అసతా తో | ||౧౧౭|| 
117. ఏవేవో అనుమానాలతో, కొందరు బాబా బ్రాహ్మణుడని అంటే, మరి కొందరు ముస్లిము అని అనేవారు. కాని, వారు ఏ జాతికీ చెందిన వారు కాదు. 
నాహీ జయాచే ఠావఠికాణ | కవణ్యా జ్ఞాతీ కేవ్హా జనన | 
కవణ మాతా పితా హే జ్ఞాన | కైసా ముసలమాన బ్రాహ్మణ వా | ||౧౧౮|| 
118. వారు ఎక్కడివారో, ఎప్పుడు పుట్టారో, వారి తల్లి తండ్రి ఎవరో, ఏ జాతివారో అన్నది ఏదీ తెలియనప్పుడు, వారిని బ్రాహ్మణుడని అనుకోవాలా, లేకా ముస్లిమని అనుకోవాలా? 
అసతా జరీ ముసలమాన | కైసే మశీదీంత అగ్న్యారాధన10
అసతే కా తేథ తులసీ వృందావన | ఘంటావాదన సాహతా కా | ||౧౧౯|| 
119. వారు ముస్లిమైతే, మసీదులో అగ్నిని ఎందుకు ఆరాధిస్తారు? అక్కడ తులసీ బృందావనం ఉంటుందా? ఘంటానాదాన్ని సహిస్తారా? 
కరూ దేతా శంఖస్ఫోరణ | సవాదిత్ర కథా కీర్తన | 
టాళ ఘోళ మృదంగ వాదన | హరినామ గర్జన మశీదీ | ||౧౨౦||
120. మసీదులో శంఖనాదం, తాళాలు, తప్పెట్ల చప్పుళ్ళను, మృదంగం మొదలైన వాద్యాలతో, కథా కీర్తనలను, హరినామ గర్జనలను చేయనిచ్చేవారా? 

అసతా జరీ ముసలమాన | మశీదీంత స్వయే బైసూన | 
కరూ దేతా కా గంధ చర్చన | తేథ సహభోజన కరితా కా | ||౧౨౧|| 
121. ముస్లిము అయితే, మసీదులో కూర్చుని, భక్తులను తమ నొసట చందనాన్ని పూయనిస్తారా? అందరితో కూర్చుని, మసీదులో సహ పంక్తిలో భోజనం చేస్తారా?
అసతా జరీ ముసలమాన | అసతే కాయ సవింధ కాన | 
నిజపల్లవచే దామ వేంచూన | కరితా కా జీర్ణోద్ధారణ దేఉళాచే | ||౧౨౨|| 
122. ముస్లిము అయి ఉంటే, వారి చెవులు కుట్టి ఉండేవా? తమ స్వంత డబ్బు ఖర్చు పెట్టి, పాత దేవాలయాల జీర్ణోద్ధారణను చేయనిస్తారా? 
ధారణ కరితా కా స్నానోత్తర | మహావస్త్ర పీతాంబర | 
ఉలట ఆరాధ్య దైవతీ అనాదర | ఝాలియా క్షణభర ఖపత నసే | ||౧౨౩|| 
123. స్నానం అయిన తరువాత, పీతాంబర వస్త్రాలని ధరిస్తారా? అంతే కాకుండా, ఎవరైనా సరే, ఆరాధించే దైవాన్ని అలక్ష్యం చేస్తే, బాబా క్షణమైనా సహించేవారు కాదు. 
యే అర్థీంచీ బోధక కథా | ఆఠవలీ జీ లిహితా లిహితా | 
సాదర కరితో అతివినీతతా | స్వస్థ చిత్తా పరిసిజే | ||౧౨౪|| 
124. ఇది వ్రాస్తూ ఉంటే, దీనికి సంబంధించినదే ఒక ఉపదేశ కథ గుర్తుకు వచ్చింది. వినయంగా దానిని మనవి చేస్తాను. స్థిరమైన మనసుతో వినండి. 
పహా ఎకదా ఏసే ఘడలే | బాబా లేండీహూని పరతలే | 
మశీదీసీ యేఊని బైసలే | భక్త పాతలే దర్శనా | ||౧౨౫|| 
125. ఒక సారి ఏం జరిగిందంటే, లెండీనుండి బాబా తిరిగి వచ్చి, మసీదులో కూర్చుని ఉండగా, వారి దర్శనానికి భక్తులు వచ్చారు. 
త్యాంతచి బాబాంచ్యా బహుప్రీతీచే | హోతే భక్తవర చాందోరకర11 సాచే | 
ఆలే భుకేలే దర్శనాచే | బినీవాల్యాంచే12 సమవేత | ||౧౨౬|| 
126. వారిలో, బాబాకు అత్యంత ప్రియుడైన నానా చాందోర్కరు, తన షడ్డకుడైన బినీవాలాతో, ఎంతో ఆతురతగా, బాబా దర్శనానికి వచ్చాడు. 
నమస్కారోని సాఈనాథా | సన్ముఖ బైసలే తే ఉభయతా | 
చాలల్యా అసతా కుశళవార్తా | బాబా అవచితా రాగావలే | ||౧౨౭|| 
127. వారిద్దరూ సాయినాథులకు నమస్కరించి, వారి ఎదుట కూర్చున్నారు. కుశల ప్రశ్నలు చేస్తుండగా, అనుకోకుండా, బాబాకు చాలా కోపం వచ్చింది. 
మ్హణతీ “నానా తుజకడూన | వ్హావే కైసే హే విస్మరణ | 
హేంచ కాయ త్వా కేలే సంపాదన | మజ సవే దిన ఘాలవూని | ||౧౨౮|| 
128. “నానా, నువ్వు ఇది ఎలా మరచి పోగలవు? ఎన్నో రోజులనుండి నా సహవాసంలో ఉంటూ, నువ్వు నేర్చుకున్నది ఇదేనా?” అని అన్నారు. 
త్వా జీ మాఝీ కేలీ సంగతీ | అఖేర తీచీ హీచ కా గతీ | 
ఏసీ కైసీ భ్రమలీ మతీ | యథా నిగుతీ మజ సాంగ” | ||౧౨౯|| 
129. “నువ్వు నాతో ఉండిన ఫలం, చివరకు ఇదేనా? నీ మనసు ఎందుకిలా మారి పోయింది? నాకంతా, ఉన్నది ఉన్నట్లుగా, పూర్తిగా చెప్పు” అని అన్నారు. 
పరిసోని నానా అధోవదన | మనీ విచారితీ కోప కారణ | 
హోఈనా కాంహీంహీ ఆఠవణ | మన ఉద్విగ్న జాహలే | ||౧౩౦||
130. ఆ మాట విని, నానా తలదించుకున్నాడు. బాబా కోపానికి కారణం ఏమిటా అని ఆలోచించాడు. కాని, ఏదీ గుర్తుకు రాలేదు. మనసు అల్లకల్లోలమైంది. 

చుకలే కోఠే కాంహీ కళేనా | కోపాస కాంహీ కారణ దిసేనా | 
పరి కాంహీ తరీ జాహల్యావినా | బాబా న కోణా దుఖవతీ | ||౧౩౧|| 
131. తను ఎక్కడ తప్పు చేశాడో తెలియలేదు. బాబా కోపానికీ కారణం తోచలేదు. ఏదో తప్పు జరగక పోతే, బాబా ఎవరి మనసునూ బాధపెట్టరు. 
మ్హణోని బాబాంచే పాయ ధరిలే | బహుతాంపరీ వినవిలే | 
అఖేర నానాంనీ పదర పసరిలే | పుసిలే భరలే కా రాగే | ||౧౩౨|| 
132. అందుకు, బాబా పాదాలను పట్టుకుని, ఎన్నో రకాల మొరపెట్టుకున్నాడు. చివరకు దీనంగా, తన కండువాని వారి ఎదుట పరచి, ఎందుకు కోపం వచ్చిందో చెప్పమని వేడుకున్నాడు. 
“వర్షానువర్ష మాఝీ సంగతీ | అసతా తుఝీ హే కా గతీ | 
కాయ ఝాలే తుఝియా మతీ” | బాబా వదతీ నానాతే | ||౧౩౩|| 
133. అప్పుడు బాబా “ఎన్నో ఏళ్ళుగా నాతో ఉంటున్నా, నీకీ గతి ఎందుకు పట్టింది? నీ మనసుకు ఏమయింది?” అని అడిగారు. 
“కోపరగాంవీ కధీ ఆలా | వృత్తాంత కాయ వాటేసీ ఘడలా | 
మార్గాంత మధ్యే కోఠే ఉతరలా | తాంగా హాంకిలా కీ థేట | ||౧౩౪|| 
134. “కోపర్గాంకు ఎప్పుడు వచ్చావు? దారిలో ఏం జరిగింది? దారిలో ఎక్కడైనా దిగావా? టాంగా నేరుగా ఇక్కడికే వచ్చిందా? 
నవల కాంహీ ఘడలే వాటే | సాద్యంత పరిసావే ఏసే వాటే | 
సాంగ పా ఝాలే కాయ కోఠే | అసో మోఠే సాన వా” | ||౧౩౫|| 
135. “దారిలో ప్రత్యేకంగా ఏమైనా జరిగిందా? చిన్నదైనా, పెద్దదైనా, జరిగినదంతా చెప్పు. నాకు వినాలని ఉంది. ఎక్కడ ఏం జరిగింది?” అని నిలదీశారు. 
ఏసే పరిసతా నానా ఉమజలే | తాత్కాళ త్యాంచే తోండ ఉతరలే | 
జరీ బోలావయా మనీ శరమలే | తరీ తే కేలే నివేదన | ||౧౩౬|| 
136. ఆ మాటలు విన్న వెంటనే నానాకు అంతా అర్థమైంది. వెంటనే తలదించుకున్నాడు. చెప్పడానికి సిగ్గుగా ఉన్నా, అంతా చెప్పాడు. 
లపవాలపవీ న చలే యేథ | మనాంత కేలే హే నిశ్చిత | 
మగ జే ఘడలే సాద్యంత | నానా సాంగత బాబాంతే | ||౧౩౭|| 
137. బాబా దగ్గర దాపరికం పనికి రాదు. కనుక, జరిగినదంతా ఉన్నది ఉన్నట్లు చెప్పటానికి నిశ్చయించుకున్నాడు. 
అసత్య చాలేనా సాఈప్రతీ | అసత్యే నాహీ సాఈచీ ప్రాప్తి | 
అసత్యే జాణే అధోగతీ | అంతీ దుర్గతీ అసత్యే | ||౧౩౮|| 
138. సాయి దగ్గర అబద్ధాన్ని చెప్పలేము. అబద్ధమాడి సాయి కృపను పొందలేము. అబద్ధం వలన అధోగతి, చివరకు దుర్గతే. 
గురువంచన మహా దుష్కృతి | పాపాస నాహీ తయా నిష్కృతీ | 
జాణోని నానా బాబాంప్రతి | ఘడలేలే కళవితీ సాద్యంత | ||౧౩౯|| 
139. గురుదేవుని మోసం చేయటం మహాపాపం. ఆ పాపానికి విరుగుడే లేదు. అని అనుకొని, జరిగిన సంగతంతా నానా, బాబాకు తెలియ చేశాడు. 
మ్హణతీ ప్రథమ టాంగా ఠరవిలా | థేట శిరడీచా ఠరావ కేలా | 
గోదాతటీంచా దత్త13 అంతరలా | బినీవాల్యాంనా త్యాయోగే | ||౧౪౦||
140. ‘మొదట టాంగా మాట్లాడినప్పుడు, నేరుగా శిరిడీకే మాట్లాడాము. కాని, దాంతో బినీవాలాకు గోదావరీ తీరాన ఉన్న దత్త భగవానుని దర్శనం దొరికేది కాదు. 

బినివాలే దత్తభక్త | లాగతా దత్త మందిర మార్గాంత | 
ఉతరావే ఖాలీ ఆలే మనాంత | దర్శనార్థ దత్తాచ్యా | ||౧౪౧|| 
141. ‘బినీవాలా దత్త భగవానుని భక్తుడు. దారిలో దత్త మందిరముందని తెలిసి, దత్త దేవుని దర్శనానికి అక్కడ దిగాలని, అతనికి అనిపించింది.
పరి హోతీ మజలా ఘాఈ | మీచ తయాంతే కేలీ మనాఈ | 
శిరడీహూన పరతతా పాహీ | ఘేతా హే యేఈల దర్శన | ||౧౪౨|| 
142. ‘కాని, ఇక్కడకు తొందరగా రావాలని, నేను అతనితో ‘ఇప్పుడు వద్దు, శిరిడీనుండి తిరిగి వచ్చేటప్పుడు దర్శనం చేసుకుందాం’ అని చెప్పాను. 
ఏసా హోఊన ఉతావేళ | శిరడీస యావయా హోఈల వేళ | 
మ్హణోని కేలీ మ్యా టాళాటాళ | భేట హేళసిళీ దత్తాచీ | ||౧౪౩|| 
143. ‘దాని వలన శిరిడీకి రావటం ఆలస్యమౌతుందని, ఇక్కడికి తొందరగా చేరుకోవాలని, నేను దత్తదేవుని దర్శించుకోలేదు. 
పుఢే కరితా గోదాస్నాన | కంటక మోఠా పాయీ రుతూన | 
మార్గీ అత్యంత జాహలా శీణ | కాఢిలా ఉపటూన ప్రయత్నే | ||౧౪౪|| 
144. ‘తరువాత, గోదావరిలో స్నానం చేస్తుంటే, కాలిలో పెద్ద ముల్లు గుచ్చుకుని, దారిలో చాలా బాధ కలిగింది. అతి కష్టంతో దానిని బయటికి లాగేశాను’ అని చెప్పాడు. 
తవ బాబా దేతీ ఇషారా | “బరీ హీ నవ్హే ఏసీ త్వరా | 
సుటలాసీ కాంట్యావరీ తూ బరా | కరూని అనాదరా దర్శనీ | ||౧౪౫|| 
145. అప్పుడు బాబా హెచ్చరిస్తూ “ఇలా తొందర పడటం మంచిది కాదు. దత్తదేవుని దర్శనం చేసుకోకుండా, అనాదరం చేసినా, ఈ మారు ఒట్టి ముల్లు గుచ్చుకోవటంతోనే బయట పడ్డావు. 
దత్తా సారిఖే పూజ్య దైవత | అసతా సహజ మార్గీ తిష్ఠత | 
అభాగీ జో దర్శనవర్జిత | మీ కాయ పావత తయాసీ” | ||౧౪౬|| 
146. “దత్త భగవానునివంటి ఆరాధ్య దైవం దారిలో, ఏ కష్టమూ లేకుండా, సులభంగా దర్శనం ఇవ్వడానికి ఉండగా, ఆ దేవుణ్ణి దర్శనం చేసుకోనివాడు దురదృష్టవంతుడు. అలాంటివాడు, నా దగ్గర ఏం పొందగలడు?” 
ఆతా అసో హండీచీ వార్తా | మశీదీ మాజీ సాఈసమవేతా | 
కాయ తీ అపరాన్హ భోజన పావనతా | భక్త ప్రేమళతా సాఈచీ | ||౧౪౭|| 
147. ఇక ఇప్పుడు వంట సంగతి. మసీదులో సాయితో పాటు మధ్యాహ్నం చేసే ఆ భోజనం ఎంత పవిత్రమైనది! భక్తులంటే సాయికి ఎంత ప్రేమ, వాత్సల్యం! 
మాధ్యాహ్నపూజా ఝాలియావరతీ | ప్రత్యహీ హోతా బాబాంచీ ఆరతీ | 
భక్తజన జంవ మాఘారా పరతతీ | ఉదీ తంవ దేతీ సమస్తా | ||౧౪౮|| 
148. ప్రతి రోజూ, మధ్యాహ్న పూజ, ఆరతి జరిగిన తరువాత, భక్తులు తిరిగి వెళ్ళేటప్పుడు, బాబా వారందరికీ ఉదీని ఇచ్చేవారు. 
మశీదీచియా ధారేవరతీ | బాబా యేఊని ఉభే ఠాకతీ | 
భక్తగణ అంగణీ తిష్ఠతీ | చరణ వందితీ ఎకేక | ||౧౪౯|| 
149. మసీదు చేయిగోడ వరకు బాబా వచ్చి నిల్చనుండగా, ప్రాంగణంలో కూర్చున్న భక్తులు, ఒక్కొక్కరుగా వచ్చి, వారి పాదాలకు నమస్కారం చేసేవారు. 
పాయావరీ ఠేవూని డోఈ | జో జో సన్ముఖ ఉభా రాహీ | 
తయా ఎకేకా భాళీ తే సమఈ | లావీత సాఈ ఉదీతే | ||౧౫౦||
150. పాదాలకు నమస్కరించి, వారు ఎదుట నిలబడగా, బాబా ఒక్కొక్కరి నొసటన ఉదీ రాసేవారు. 

“ఆతా సమస్తీ లహానథోరీ | జావే జేవయా ఆపులాల్యా ఘరీ” | 
వందూని బాబాంచీ ఆజ్ఞా హీ శిరీ | జన మాఘారీ పరతత | ||౧౫౧|| 
151. తరువాత, “ఇప్పుడు చిన్న పెద్దలందరూ, మీ ఇళ్ళకు వెళ్ళి, భోజనం చేయండి” అని బాబా చెప్పగానే, వారి ఆజ్ఞకు తలవంచి, భక్తులు వెళ్ళిపోయేవారు. 
ఫిరతా మగ బాబాంచీ పాఠ | పడదా ఓఢీత యథా పరిపాఠ | 
తాటావాట్యాంచా ఖణఖణాట | హోఈ మగ థాట ప్రసాదాచా | ||౧౫౨|| 
152. ఆ పై బాబా తిరిగి మసీదులో రాగానే, రోజువారి అలవాటు ప్రకారం, తెరను లాగేవారు. పళ్ళాలు, గిన్నెల చప్పుళ్ళతో, ప్రసాదాన్ని పంచడం ఎంతో వైభవంగా జరిగేది. 
సాఈకరస్పర్శే పూత | నైవేద్యశేష మిళావా పరత | 
మ్హణోని మార్గప్రతీక్షా కరీత | కిత్యేక బైసత అంగణీ | ||౧౫౩|| 
153. సాయి చేయి స్పర్శతో పావనమైన నైవేద్యంలో, కొంతైనా తీసుకుని వెళ్ళాలని, ఎందరో భక్తులు తమ పళ్ళెములతో ఎదురు చూస్తూ, ప్రాంగణంలో కూర్చునే వారు. 
యేరీకడే నింబరానికట | బాబా జంవ బైసతీ కరూని పాఠ | 
దోహీ బాజూస పంక్తీచా థాట | ఆనంద ఉద్భట సకళీకా | ||౧౫౪|| 
154. నింబారు దగ్గర, గోడకు వీపును ఆనించి, బాబా కూర్చునే వారు. వారికి రెండు వైపులా, వరుసగా పంక్తులు తీరి, కూర్చున్న వారందరికీ ఎంతో ఆనందంగా ఉండేది. 
జో తో ఆపాపలా నైవేద్య సారీ | సాఈ సమర్థాంచియా పుఢారీ | 
తేహీ మగ ఎకా తాటాభీతరీ | నిజకరే కరీత ఎకత్ర | ||౧౫౫|| 
155. తమతమ నైవేద్యాలను వారు సాయి సమర్థుల ముందు ఉంచగా, వారు తమ చేత్తో దాన్నంతటినీ ఒక పళ్ళెంలో కలిపేవారు. 
తే బాబాంచ్యా హాతీచే శిత | లాధాయా పాహిజే భాగ్య అమిత | 
జేణే భోక్తా సబాహ్య పునీత | సఫల జీవిత తయాచే | ||౧౫౬|| 
156. బాబా చేతి స్పర్శను పొందిన ఆ ప్రసాదంలోని ఒక గింజను పొందడానికి కూడా, ఎంతో భాగ్యముండాలి. ఎందుకంటే, ఆ ప్రసాదాన్ని తిన్నవారు లోపల బయటా పరిశుద్ధత చెంది, తమ జీవితాలను సఫలం చేసుకుంటారు. 
వడే అపూప సాంజోర్యా పురియా | కధీ శిఖరిణీ ఘారగే ఫేణియా | 
వివిధ శాకా ఖిరీ కోశింబిరీయా | బాబా మగ బరవియా ఎకవటతీ | ||౧౫౭|| 
157. వడలు, అరిసెలు, హల్వా, పూరీలు, పేణీలు మొదలైన పిండి వంటలూ, ఎన్నో రకాల కూరలు, వడపప్పు, పాయసం మొదలగు వానిని అన్నింటినీ బాబా ఒక్కటిగా కలిపేవారు. 
ఎణే విధీ మగ తే అన్న | బాబా కరీత ఈశ్వరార్పణ | 
మగ శామా14 నానాకడూన15 | తాటే భరభరూన వాఢవీత | ||౧౫౮|| 
158. అలా కలిపిన తరువాత, ఆ ప్రసాదాన్ని బాబా ఈశ్వరార్పణం చేసేవారు. తరువాత, శామా, నానా (నిమోన్కరు)లతో పళ్ళెముల నిండా వడ్డన చేయించేవారు. 
పుఢే ఎకేకాస బోలావూన | ఆపులే పాశీ బైసవూన | 
పరమానందే ప్రీతీ కరూన | ఆకంఠ భోజన కరవీత | ||౧౫౯|| 
159. ఆ పైన ఒక్కొక్కరినే పిలిచి, ఎంతో ప్రేమతో తమ దగ్గర కూర్చోబెట్టుకుని, వారు తృప్తి చెందేవరకూ తినేలా చేసేవారు. 
ఖమంగఘృతే జో సుఖాడలా | పోళీవరాన్న ఇహీ మిసళిలా | 
ఏసా కరూని గోడ కాలా | బాబా సకలాంలా వాఢీత | ||౧౬౦||
160. అన్నాన్ని, రొట్టెలను కలిపి, ముద్దగా చేసి, అందులోకి ఘుమఘుమలాడే మంచి నెయ్యి పోసి, దానిని బాబా అందరికీ వడ్డించేవారు. 

సేవితా హా ప్రేమాచా కాలా | కాయ గోడీ బ్రహ్మానందాలా | 
భోక్తా బోటే చోఖీత నిఘాలా | అఖండ ధాలా తృప్తీనే | ||౧౬౧|| 
161. బాబా ఎంతో ప్రేమతో చేసిన ఆ మిశ్రమాన్ని తింటే, కలిగే బ్రహ్మానందాన్ని, ఎవరు మటుకు వర్ణించగలరు? భోజనం చేసిన వారు, వేళ్ళను, చేతినీ నాలుకతో నాకుతూ తృప్తిగా వెళ్ళేవారు.
కధీ మాండే పూర్ణ పోళియా | కధీ పురీయా శర్కరే ఘోళలియా | 
కధీ బాసుందీ శిరా సాంజోరియా | వాఢితీ గుళ వరియా స్వాదిష్ట | ||౧౬౨|| 
162. కొన్ని సార్లు మండిగలు, బొబ్బట్లు, ఇంకొన్ని సార్లు చక్కెర పాకంలో వేసిన పూరీలు, మరి కొన్ని సార్లు బాసుంది, లేదా రుచికరమైన రవ్వ కేసరి, బెల్లం అప్పాలు, 
కధీ శుభ్ర అంబేమోహోర | తయావరీ వరాన్న సుందర | 
ఘృత లోణకఢే స్వాదిష్ట రుచిర | శాఖాపరికర వేష్టిత | ||౧౬౩|| 
163. కొన్ని సార్లు ‘అంబేమోహోర’ అనే తెల్లని సువాసనగల అన్నం, పప్పు, మీద ఘుమఘుమలాడే వెన్న కాచిన నెయ్యి, వాటి చుట్టూ కూరలు. 
లోణచే పాపడ ఆణి రాయతే | నానాపరీచీ భజీ భరితే | 
క్వచిదామ్ల దధితక్ర పంచామృతే | ధన్య తే సేవితే దివ్యాన్నా | ||౧౬౪|| 
164. ఇలా రకరకాల వేపుడు కూరలు, అప్పడాలు, ఊరగాయ, పచ్చళ్ళు, పెరుగు పచ్చడి, కొంచెం పుల్లటి పెరుగు, పంచామృతం ఉండేవి. అలాంటి దివ్యామృతాన్ని తిన్నవారు నిజంగా ధన్యులు. 
జేథే భోక్తా శ్రీ సాఈనాథ | భోజనాచీ త్యా కాయ మాత | 
భక్త తేథ ఆకంఠ జేవీత | ఢేకరహీ దేత తృప్తీచే | ||౧౬౫|| 
165. స్వయంగా సాయినాథులే వడ్డిస్తున్నప్పుడు, వారు ప్రసాదించిన ఆ భోజనం మాట చెప్పాలా! అక్కడ, భక్తులు గొంతు దాకా భోజనం చేసి, తృప్తిగా త్రేన్చేవారు. 
గ్రాసోగ్రాసీ సమాధాన | తుష్టీ పుష్టీ క్షుధానాశన | 
ఏసే తే గోడ సుగ్రాస అన్న | పరమ పావన ప్రేమాచే | ||౧౬౬|| 
166. ముద్దముద్దకూ ఎంతో హాయి. తృప్తిగా, పుష్టిగా ఆకలి తీరటం. ప్రేమతో నిండిన ఆ మధురమైన భోజనం ఎంతో పావనం! 
గ్రాసోగ్రాసీ నామ సమస్త | దివ్యాన్నాచ్యా ఆహుతీ దేత | 
పాత్ర అణుమాత్ర రితే న హోత | ఓగరిలే జాత వరిచేవరీ | ||౧౬౭|| 
167. ముద్దముద్దకూ సాయి పేరును తలచుకుంటూ, ఆ దివ్యమైన భోజనాన్ని చేస్తూంటే, మరల మరల ఎన్ని సార్లు వడ్డించినా, పాత్రలు పళ్ళేలు ఖాళీ అయేవి కావు. 
జయా పక్వాన్నీ జయా ఆసక్తి | ప్రేమే వాఢితీ తయాంస తీంతీం | 
కితీ ఎకాంస ఆమ్రరసీ ప్రీతి | రస త్యా వాఢితీ ప్రీతీనే | ||౧౬౮|| 
168. ఎవరికి ఏ పక్వాన్నం ఇష్టమైతే, ఆ వంటకాలనే ప్రేమగా వడ్డించేవారు. మామిడి పళ్ళ రసం ఇష్టమున్న వారికి, ఎంతో ప్రీతిగా ఆ రసాన్నే ఇచ్చేవారు. 
ఏసే హే అన్న వాఢావయాసీ | నానాసాహేబ నిమోణకరాంసీ | 
అథవా మాధవరావ దేశపాండ్యాంసీ | బాబా ప్రతిదివశీ ఆజ్ఞాపిత | ||౧౬౯|| 
169. ఈ భోజనాన్ని వడ్డించమని నానాసాహేబు నిమోణ్కరుకు గాని, మాధవరావు దేశపాండేకు గాని బాబా ప్రతిరోజూ ఆజ్ఞాపించేవారు. 
తయాంచాహీ నిత్య నేమ | నైవేద్య వాఢణే హేంచి కామ | 
తదర్థ కరీత అతి పరిశ్రమ | పరమ ప్రేమ సమన్విత | ||౧౭౦||
170. ప్రతి రోజూ నియమంగా, నైవేద్యాలను వడ్డించడం వారి పని. తమకు ఎంతో కష్టమైనా, అలసట కలిగినా, వారు ఆ పనిని పరమ ప్రేమతో చేసేవారు. 

భాత సుగ్రాస జిరేసాళీ | జైసీ మోగరియాచీ కళీ | 
వరీ తురీచీ దాళీ పివళీ | ఘృత పళీ పళీ సమస్తా | ||౧౭౧|| 
171. మల్లెమొగ్గలవంటి మంచి సన్న బియ్యపు అన్నం, దాని మీద పచ్చని కందిపప్పు. ఆ పైన, గరిటతో ఘుమఘుమలాడే నెయ్యి, అందరికీ వడ్డించేవారు. 
వాఢితా యే ఆమోద ఘమఘమిత | చటణియాంసీ భోజన చమచమిత | 
అపక్వ అరుచిర నాహీ కించిత | యథేష్ట నిశ్చిత జేవతీ | ||౧౭౨|| 
172. వడ్డిస్తున్నప్పుడే సువాసనలు గుబాళించేవి. అలా ఆనందంగా పచ్చళ్ళతో సహా వడ్డిస్తుంటే, అక్కడ ‘సరిగ్గా వండలేదు’, ‘రుచిగా లేదు’ అని అనిపించక, అందరూ తృప్తిగా భోజనం చేసేవారు. 
త్యా స్వానంద తాటీచ్యా శేవయా | సప్రేమ భక్తీచియా కురండియా16
శాంతిసుఖ స్వానుభవియా | వాంచూన జేవావయా కోణ యే | ||౧౭౩|| 
173. ఆత్మానందమనే సేమియా, భక్తి ప్రేమలనే వడియాలు, మొదలైన వాటిని పొందటానికి, శాంతి సుఖం అనుభవించిన వారు తప్ప, వేరే ఎవరు భోజనానికి రాగలరు? 
“హరిరన్నం హరిర్భోక్తా” | హరీచ రసాచీ చవీ చాఖితా | 
ధన్య తేథీల అన్న వాఢితా | ధన్య తో సేవితా దాతాహీ | ||౧౭౪|| 
174. ‘హరిః అన్నం, హరిః భోక్తా’ – హరియే అన్నం, ఆ అన్నాన్ని రుచి చూసేవాడూ హరియే. అలాంటి అన్నాన్ని ఇచ్చే దాతలు, వడ్డించేవారు, తినేవారు, నిజంగా ధన్యులు. 
యా సర్వ గోడియేచే జే మూళ | తీ ఎక నిష్ఠా గురుపదీ ప్రబళ | 
గోడ నవ్హే శర్కరా గూళ | గోడ తీ సమూళ శ్రీశ్రద్ధా | ||౧౭౫|| 
175. ఇంతటి తియ్యదనానికి మూలం – గురు పాదాలలో ఉండే బలమైన నిష్ఠ. తియ్యని చక్కెర, బెల్లం కావు. అసలైన తీపి, శ్రీహరి పాదాలలో ఉండే శ్రద్ధ. 
ఏసే నిత్యశ్రీర్నిత్యమంగళ | ఖీర శిరా కాల్యాచీ చంగళ | 
పాత్రీ బసల్యావర టంగళమంగళ | చాలే న అమ్మళ హీ తేథే | ||౧౭౬|| 
176. ఇలా నిత్యం సంపత్తితో, నిత్యం మంగళకరంగా, అక్కడ ఉండేది. హల్వా, పాలు-అన్నం మిశ్రమం ఉండగా, పళ్ళేల ముందు కూర్చోగానే, అక్కడ ‘వద్దు’ అనే మాట నోట రాదు. 
పరోపరీచీ పాకనిష్పత్తీ | సేవూని హోతా ఉదర పూర్తీ | 
వినా దధ్యోదన నాహీ తృప్తీ | నసల్యాస మాగతీ తక్ర తరీ | ||౧౭౭|| 
177. కాని, ఇన్ని రకాల వంటలను తినినా, కడుపు నిండి పోయినా, చివరకు పెరుగు అన్నం లేకపోతే, తిన్నవారికి తృప్తి ఉండదు. పెరుగు లేక పోయినా సరే, కొంత మజ్జిగనైనా కోరుకుంటారు. 
ఎకదా స్వచ్ఛ తక్రాచా ప్యాలా | జో గురురాయే నిజహస్తే భరిలా | 
ప్యావయా మజ ప్రేమే దిధలా | మ్యా జంవ లావిలా ఓఠాస | ||౧౭౮|| 
178. ఒక సారి, గురు మహారాజు స్వయంగా, తెల్లని మజ్జిగను గ్లాసులో నింపి, త్రాగమని ప్రేమతో నాకు ఇచ్చారు. గ్లాసును నేను పెదవుల దగ్గర పెట్టుకున్నాను. 
శుభ్ర స్వచ్ఛ తక్ర దృష్టి | పాహోని జాహలీ సుఖసంతుష్టీ | 
లావితా తో ప్యాలా ఓష్ఠీ | స్వానంద పుష్టీ లాధలో | ||౧౭౯|| 
179. శుభ్రంగా ఉండే తెల్లని మజ్జిగను, కళ్ళతో చూడగానే, ఎంతో సుఖం, తృప్తి కలిగాయి. నోటికి అందాక, మరీ ఆనందం కలిగింది. 
ఆధీంచ పక్వాన్నీ ధాలే పోట | తేథ హే హోఈల కైసేవ17 ప్రవిష్ట | 
ఆశంకా ఏసీ ఘేతా క్లిష్ట | ఘుటకా తో స్వాదిష్ట లాగలా | ||౧౮౦||
180. ‘అసలే పక్వాన్నాలతో కడుపు నిండి పోయింది. అందులోకి ఈ మజ్జిగ ఎలా పోగలదు?’ అని అనుమానిస్తూనే ఒక గుటక తాగగా, ఎంతో రుచికరంగా అనిపించింది. 

పాహోని ఏసా మీ సంకోచిత | బాబా అతి కాకుళతీ వదత | 
“పిఊన ఘే రే తే సమస్త” | యోగ న హా పరత జణూ గమలా | ||౧౮౧|| 
181. అలా అనుమానిస్తున్న నన్ను చూసి, బాబా ఎంతో ప్రేమగా “తాగేసేయి రా, అదంతా” అని అన్నారు. అలాంటి అవకాశం మరల రాదు, అని వారు అనుకున్నట్లుగా ఉంది. 
అసో పుఢే ఆలీచ ప్రచీతీ | తేథూని పుఢే దో మాసాంతీ | 
బాబా అపులా అవతార సంపవితీ | ఖరేంచ పావతీ నిర్వాణ | ||౧౮౨|| 
182. తరువాత, అదే అనుభవానికి వచ్చింది. అది జరిగి రెండు నెలలు గడిచే సరికి, నిజంగానే, బాబా తమ అవతారాన్ని చాలించి, నిర్వాణాన్ని పొందారు. 
ఆతా తయా తాకాచీ తహాన | భాగవావయా మార్గ న ఆన | 
వినా సాఈకథామృతపాన | తేంచ కీ అవలంబన ఆపులే | ||౧౮౩|| 
183. మజ్జిగ కోసం వచ్చే దాహాన్ని, ఇప్పుడు తీర్చుకోవాలంటే, సాయి కథామృతాన్ని తాగడం తప్ప, మరో దారి లేదు. మనకు ఇక ఇదే ఆధారం. 
హేమాడ సాఈనాథాసీ శరణ | సాఈచ దేతీల పుఢా జే స్మరణ | 
తేంచి కీ హోఈల కథా నివేదన | శ్రోతీ నిజావధాన రాఖావే | ||౧౮౪||
184. హేమాడు సాయినాథునకు శరణుజొచ్చి, ఏ కథను సాయి గుర్తు చేస్తే, దానినే తరువాత మనవి చేస్తాడు. శ్రోతలు శ్రద్ధ వహించాలి. 

| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే | 
| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | హండీవర్ణనం నామ | 
| అష్టత్రింశత్తమోధ్యాయః సంపూర్ణః | 

||శ్రీ సద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||

టిపణీ: 
1. బ్రహ్మక్షాత్రతేజాసహ మృత్యూలాహీ ఖాఊన టాకణారా 
2. తైతిరీయోపనిషద్, అ. ౩. 
3. వరణ. 4. దాదా కేళకర. 5. హండా. 6. చిఖలాచా గారా. 
7. విస్తవానే. 8. భాండ్యాచ్యా తళాలా. 9. ఢవళతీ. 
10. ధునీచీ పూజా అథవా అగ్నిహోత్ర. 11. నానాసాహేబ చాందోరకర. 
12. నానాసాహేబాంచే సాడూ. 13. దత్తమూర్తీ. 
14. మాధవరావ దేశపాండే. 15. నానాసాహేబ నిమోణకర. 
16. తాందుళాచ్యా పిఠాచా తళలేలా వాటోళా పదార్థ. 17. కసే. 

No comments:

Post a Comment