Tuesday, January 7, 2014

||సంత పరీక్షణ మనోనిగ్రహణం నామ ఎకోన పంచాశత్తమోధ్యాయః||


శ్రీ సాఈసచ్చరిత
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౪౯ వా||

||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః|| 
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః|| 
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః|| 

సాంగోపాంగ సద్గురు స్తవణే | ఠకలే వేద ఆణి పురాణే | 
తేథే మీ అజాణ నేణతపణే | బరే రాహణే నివాంత | ||౧|| 
1. సద్గురువుయొక్క మహిమలను వర్ణించలేక వేదాలు, పురాణాలు అలసిపోయాయి. అలాంటప్పుడు ఏమీ తెలియని అజ్ఞానినైన నేను ఊరక ఉండటం ఉత్తమం.
ఖరే పాహతా ధరావే మౌన | హేంచ కీ వస్తుతః సద్గురుస్తవన | 
పరి సాఈచే ఎకేక గుణ | పాడితీ విస్మరణ మౌనాచే | ||౨|| 
2. వాస్తవానికి, మౌనంగా ఉండటమే నిజమైన స్తోత్రము. కాని, సాయియొక్క ఒక్కొక సుగుణం నా మౌనాన్ని మరిపింప చేస్తుంది. 
ధన్య సాఈచీ అగాధ లీలా | పాహతా నివాంత రాహవే న మజలా | 
పక్వాన్న గోడ లాగతా జివ్హేలా | మనీ ఆఠవలా శ్రోతృ వృంద | ||౩|| 
3. తెలుసుకోవటానికి సాధ్యం కాని సాయి లీల ధన్యం. దానిని చూచి, నేను ఊరుకుండలేను. భక్ష్యాల రుచి నాలుకకు తగలగానే, మనసుకు శ్రోతలు గుర్తుకు వచ్చారు. 
తయాంసీహీ పంక్తీస ఘ్యావే | జేణే నిజ రసానంద దుణావే | 
ఏసే మాఝియా ఘేతలే జీవే | తేణే హీ రససోయే1 నిడారలీ2 | ||౪|| 
4. వారిని కూడా నా పంక్తిలో చేర్చుకుంటే, మాధుర్యం, రుచి మరింతగా రెండింతలవుతుందని అనిపించింది. అందుకే ఈ భోజనం చక్కగా తయారైంది. 
మోఠే గోడ ఖరే పక్వాన్న | పంక్తీ నసతా స్నేహీ సజ్జన | 
నావడే తే ఎకట్యా లాగూన | ఫికే గోడపణ తయాచే | ||౫|| 
5. భక్ష్యాలు బాగా రుచికరంగా ఉన్నప్పటికీ, సజ్జనులు, స్నేహితులు పంక్తిలో లేకుండా ఒంటరిగా ఉంటే, వాని తీపి చప్పబడిపోతుంది. 
సాఈ సకళ అవాప్తకామ3 | సాఈ సకళ సంతలలామ | 
సాఈ నిజభక్త విశ్రామధామ | దుర్ధర భవ భ్రమ నివారక | ||౬|| 
6. అన్ని కోరికలనూ పోందిన సాయి సంతులకే శ్రేష్ఠుడు. భక్తులకు సాయి విశ్రామ నిలయం. అతి కష్టమైన ఈ సంసారం చక్రభ్రమణాన్ని వారు నివారించేవారు. 
అనిర్వాచ్య తయాచీ లీలా | వర్ణవేనా మగ వాణీలా | 
అతర్క్యాచీ అతర్క్య కలా | కేవీ మజలా ఆకళేల | ||౭|| 
7. మాటలకు అందని వారి లీలలను నా మాటలతో వర్ణించలేను. తర్క బుద్ధికి, తర్కానికి అందని వారి కళ నాకు ఎలా అర్థమౌతుంది? 
కల్యాణాచే జే కల్యాణ | తో హా సాఈ నిజకృపే జాణ | 
దేఈ నిజకథేచే స్మరణ | గ్రంథ హా పరిపూర్ణ కరావయా | ||౮|| 
8. ఈ గ్రంథాన్ని పూర్తి చేయటానికి, కల్యాణానికి కల్యాణమైన సాయి, కృపతో తమ కథలను గుర్తు చేస్తారు. 
గావూ జాతా అగాధ మహిమాన | సమర్థ కోణ కరాయా కథన | 
పరా జేథే నిఘే పరతోన | పశ్యంతీ మధ్యమా కోణ కథా | ||౯|| 
9. అర్థంకాని వారి మహిమలను వర్ణించే సమర్థులు ఎవరు? వాక్కులో, పర, పశ్యంతి, మధ్యమ మరియు వైఖరి అను నాలుగు విధములు. వాటిలో చేత కాదని పరమే వెనుకకు తిరిగినప్పుడు, పశ్యంతి మరియు మధ్యమల గురించి ఎవరు చెప్పగలరు? 
తిఘీ జేథే నుఘడతీ వదన | చౌథీ వైఖరీ తేథే కోణ | 
హే మీ జాణే జరీ సంపూర్ణ | తరీ హే మన రాహీనా | ||౧౦||
10. ఆ మూడూ నోరు తెరవక పోతే, ఇక నాలుగవదైన వైఖరి ఏం చేయగలదు? నాకు ఈ సంగతి బాగా తెలిసినా, నా మనసు ఊరుకోవటం లేదు. 

సద్గురూచే పాయీ న వినటతా | యథార్థ స్వరూప యేఈనా హాతా | 
సంత శ్రీహరిస్వరూప స్వతః | కృపాహస్తా ప్రార్థావే | ||౧౧|| 
11. సద్గురు పాదాలలో లీనం కాకపోతే, ఆత్మయొక్క నిజమైన స్వరూపం అర్థం కాదు. సత్పురుషులు శ్రీహరి అవతారాలు. వారి అనుగ్రహం కోసం ప్రార్థించాలి. 
గురూచరణాచీ ఆవడీ | హేచి అపులీ సర్వస్వ జోడీ | 
సంత సహవాసాచీ గోడీ | ప్రేమ పరవడీ లాగో ఆమ్హా | ||౧౨|| 
12. సద్గురు పాదాలలో ప్రేమను సంపాదించుకుంటే, అదే మన సర్వస్వం. సంతుల సహవాసంలోని మాధుర్యం, మరియు ప్రేమ మనకు ప్రాప్తముగాక. 
జయా పూర్ణ దేహాభిమాన | తయా న సాజే భక్తాభిధాన | 
స్వయే జో పూర్ణ నిరభిమాన | ఖరే భక్తపణ త్యా అంగీ | ||౧౩|| 
13. దేహం మీద పూర్తిగా అభిమానం ఉన్నవారిని భక్తులు అనడం తగదు. ఈ అభిమానం సంపూర్ణంగ వదిలినవారిలోనే నిజమైన భక్తి ఉంటుంది. 
జయా జ్ఞాతృత్వాచా తాఠా | శ్రేష్ఠత్వాచా అభిమాన లాఠా | 
కేవళ దంభాచా జో వసవటా | తయాచీ ప్రతిష్ఠా తీ కాయ | ||౧౪|| 
14. జ్ఞానిని అన్న గర్వం, గొప్పవాణ్ణి అన్న అభిమానంతో కేవలం బడాయితో నిండినవారికి ప్రతిష్ఠ ఎక్కడిది? 
ఆపులాల్యా గురుచీ కీర్తీ | అభాగీ జే ప్రేమే న గాతీ | 
బధిర నసునీ జే నాయకతీ | తే మందమతీ మూర్తిమంత | ||౧౫|| 
15. తమ గురువుయొక్క కీర్తిని, భక్తితో గానం చేయనివారు అభాగ్యులు. చెవుడు లేకున్నా, విననివారు మూర్తీభవించిన మూర్ఖులు. 
తీర్థ వ్రత యజ్ఞ దాన | యాంహూన థోర తపాచరణ | 
త్యాంహూన అధిక హరిభజన | నిజగురుధ్యాన సర్వాధిక | ||౧౬|| 
16. యజ్ఞాలు, తీర్థయాత్రలూ, వ్రతాలు, దానాల కంటే తపస్సు చేయటం శ్రేష్ఠం. హరిభజన తపస్సు కంటే గొప్పది. తమ గురువును ధ్యానించటం వీటన్నిటికంటే శ్రేష్ఠమైనది. 
సాఈచ త్యాచియా భక్తాంచే ధ్యాన | సాఈచ త్యాంచే దేవదేవతార్చన | 
సాఈచ త్యాంచే గుప్తనిధాన | రక్షావే పరీ అకృపణత్వే | ||౧౭|| 
17. సాయి భక్తులకు సాయి ధ్యానమే ఆధారము. సాయియే వారి దేవ దేవతా అర్చనలు. సాయియే వారి దాచబడిన నిధి. ఆ నిధిని రక్షించుకోవాలి, కాని, పిసినారిలా కాదు. 
యదా కదా యేఈ మజ ఆళస | పరి న అంతర్యామీ సాఈస | 
విసర పడతా కథానకాస | దేఈ మజ వేళేస ఆఠవణ | ||౧౮|| 
18. అప్పుడప్పుడు నాకు బద్ధకం కలగవచ్చు. కాని, నా హృదయంలో ఉండే సాయికి అసలు అలసట లేదు. నేను వారి కథలను మరచిపోతే, వారు సమయానికి సరిగ్గా నాకు గుర్తు చేస్తారు. 
బసూ మ్హణతా క్షణ నివాంత | మాఝే కాంహీ న చలే తేథ | 
కథా ఏసీ స్ఫురే అకల్పిత | లేఖణీ హాతాంత ఘేణే పడే | ||౧౯|| 
19. ఒక్క క్షణమైనా ప్రశాంతంగా కూర్చుందామని అనుకుంటాను. కాని, నా కోరిక సాగదు, అకస్మాత్తుగా తమ కథను బాబా స్ఫురింప చేస్తే, వెంటనే నేను కలం చేతికి అందుకోవలసిందే. 
ఏసియా త్యాచ్యా అగాధ కథా | ఏకవావయా త్యా నిజభక్తా | 
ఆణిక మాఝియా నిజస్వార్థా | మజ యా సచ్చరితా ప్రవర్తవిలే | ||౨౦||
20. ఇలాంటి అద్భుతమైన వారి కథలను భక్తులకు వినిపించటానికి, మరియు నా శ్రేయస్సు కోసం, సాయియే ఈ సచ్చరిత రచనకు నన్ను ప్రేరేపించారు. 

నాహీ తరీ సంతాచియా కథా | జ్యాచా తోచ రచితా లిహితా | 
తయాచీ తీ స్ఫూర్తీ నసతా | కేవళ నీరసతా పదోపదీ | ||౨౧|| 
21. సంతులు వారి కథను వారే రచిస్తారు. వారి స్ఫూర్తి లేకుంటే, చేసిన రచన రసవత్తరంగా కాక, అంతా చప్పగా ఉంటుంది.
అసో కృపాళూ సాఈనాథ | ప్రవేశూని మన్మనా ఆంత | 
కరవూని ఘేతలా ఆపులా గ్రంథ | మాఝేహీ మనోరథ పురవీలే | ||౨౨|| 
22. సాయినాథులు దయామయులు కనుక నా మనసులో ప్రవేశించి, తమ గ్రంథాన్ని రచింప చేసి, నా మనసులోని కోరికను తీర్చారు. 
ముఖీ శ్రీసాఈనామావర్తన | చిత్తీ తయాచే వచన చింతన | 
మనీ తయాచే మూర్తీచే ధ్యాన | పూర్ణ సమాధాన యేణే మజ | ||౨౩|| 
23. నోటితో శ్రీసాయి నామాన్ని జపిస్తూ, మనసులో వారి మాటలను ఆలోచిస్తూ, హృదయంలో వారి రూపాన్ని ధ్యానిస్తూ ఉంటే, నాకు సంపూర్ణమైన శాంతి లభిస్తుంది. 
వదనీ శ్రీసాఈచే నామ | అంతరీ శ్రీసాఈచే ప్రేమ | 
జ్యాచే సాఈ ప్రీత్యర్థ కర్మ | ఋణాఇత పరమ త్యా సాఈ | ||౨౪|| 
24. పెదవులపై సాయి నామం, అంతరంగంలో సాయిపై ప్రేమ ఉండి, శ్రీసాయి కోసమే ప్రీతిగా పనులను చేసేవారికి, సాయి చాలా ఋణపడి ఉంటారు. 
తుటావయా సంసారబంధన | యాహూన నాహీ అన్య సాధన | 
సాఈకథా పరమ పావన | సదాసేవన సుఖదాఈ | ||౨౫|| 
25. సాంసారిక బంధాలను తెంచుకోవటానికి సాయి ఆరాధన కంటే ఇంకొక సాధనం లేదు. పరమ పావనమైన సాయి కథను సదా శ్రవణం చేయడం సుఖాన్ని ఇస్తుంది. 
పాయీ సాఈసీ ప్రదక్షిణ | కరా శ్రవణీ సచ్చరీతశ్రవణ | 
సర్వాంగీ ద్యా ప్రేమాలింగన | డోళా ఘ్యా దర్శన సాఈచే | ||౨౬|| 
26. పాదాలతో సాయికి ప్రదక్షిణం, చెవులతో సచ్చరిత్ర విని, కళ్లతో సాయి దర్శనం చేసుకుని, సర్వాంగాలతో సాయిని ప్రేమగా ఆలింగనం చేసుకోండి. 
సాష్టాంగీ యావే లోటాంగణీ | మస్తక ఠేవావే తయా చరణీ | 
జివ్హా లావావీ తన్నామస్మరణీ | నాసికే అవఘ్రాణీ నిర్మాల్య | ||౨౭|| 
27. సాయికి సాష్టాంగ నమస్కారం చేయండి. తలను వారి పాదాలమీద ఉంచండి. నాలుకతో వారి నామస్మరణను చేయండి. ముక్కుతో వారి నిర్మాల్యాలను వాసన చూడండి. 
ఆతా పూర్వకథానుసంధాన | గతాధ్యాయీ శ్రోతయా లాగూన | 
చమత్కార ప్రియ భక్త కథా కథాన | కథీన హే వచన దిధలే | ||౨౮|| 
28. ఇప్పుడు, మునుపటి అధ్యాయం తరువాత కథ. గత అధ్యాయం చివరిలో చమత్కారాలలో ప్రీతిగల ఒక భక్తుని కథను చెప్తానని శ్రోతలకు మాట ఇచ్చాను. 
స్వయే న స్వార్థ పరమార్థ పరాయణ | నసతా సంతాంచే అధికారాచీ జాణ4
కేలియా కోణీ తయాంచే వర్ణన | అవిశ్వాసీ మన జయాచే | ||౨౯|| 
29. లౌకికమైన కోరికలు కాని, పరమార్థం గురించి కాని ఏ కోరిక లేకుండా, సత్పురుషుల మహిమ తెలియకుండా, వేరెవరైనా సత్పురుషుల గొప్పతనాన్ని వర్ణిస్తే, నమ్మనివారు కొందరుంటారు. 
స్నేహీ కథితా సాఈచ్యా గోష్టీ | ఏకే పరీ తో దోషైకదృష్టీ | 
తయా న మిళతా స్వానుభవపుష్టీ | కాంహీ న సృష్టీంత మానీ తో | ||౩౦||
30. స్నేహితులు సాయి మహిమను వర్ణించగా, విని, నమ్మకుండా దోషాలను మాత్రమే చూచేవారు, స్వయంగా అనుభవిస్తే తప్ప, సృష్టిలో దేనినీ నమ్మరు. 

హరీ కానోబా నామాభిధాన | స్నేహ్యాంసవే ముంబఈహూన | 
కరావయా సాఈచే పరీక్షణ | నిఘాలే పర్యటణ కరావయా | ||౩౧|| 
31. అలాంటి వారిలో ఒకడైన హరీ కానోబా అనే వ్యక్తి, సాయిని పరీక్షించాలని, స్నేహితుని వెంట ముంబైనుండి బయలుదేరాడు. 
పరి సాఈచీ కలాకుసరీ | ప్రకాశే జో సకళాంతరీ | 
తే లాఘవ తీ నవల పరీ | కోణ నిర్ధారీ జాణీల | ||౩౨|| 
32. కాని, అందరి హృదయాలలో నివసించే సాయియొక్క కలా కౌశలాన్ని తెలుసుకొని, అర్థం చేసుకోగల వారు ఎవరైనా ఉన్నారా? 
హరీభాఊ శిరడీస నిఘతా | కారణ కళలే సాఈసమర్థా | 
కేవళ చమత్కారాచా భోక్తా | తితుకీచ పాత్రతా తయాచీ | ||౩౩|| 
33. హరీభావూ శిరిడీకి బయలుదేరిన కారణం సాయి సమర్థులకు తెలుసు. అతడు కేవలం చమత్కారాన్ని చూడాలని వచ్చాడు. అతని అర్హత అంతే. 
తితుకీచ తయా దావీ చుణుక | ఘేఈ అపులాసా కరూని నిష్టంక | 
తయాచ్యాహీ శ్రమాచే సార్థక | యుక్తిప్రయోజక సంత ఖరే | ||౩౪|| 
34. కనుక, అతను ఆశించినట్లే, ఒక వింతను చూపించి. అతనికి తమయందు నమ్మకం కలగజేసి, బాబా అతని శ్రమను సార్థకం చేశారు. నిజంగా సంతులు ఎంతో ఉపాయంతో కార్యాన్ని సాధిస్తారు. 
కోపరగాంవీ స్నేహీసమేత | హరీభాఊ బైసలే టాంగ్యాంత | 
గోదావరీంత హోఊని సుస్నాత | నిఘాలే శిరడీప్రత అవిలంబే | ||౩౫|| 
35. కోపర్గాంలో, స్నేహితునితో, హరీభావూ టాంగా బండిలో కూర్చున్నాడు. గోదావరిలో స్నానం చేసిన వెంటనే శిరిడీకి బయలుదేరాడు. 
యేతాంచ కోపరగాంవాహూన | హస్తపాద ప్రక్షాళూన | 
హరీభాఊ సంతావలోకన | కరావయా జాణ నిఘాలే | ||౩౬|| 
36. కోపర్గాంనుండి శిరిడీ చేరుకోగానే, కాళ్లు చేతులూ కడుగుకుని, సాయి సత్పురుషుని దర్శించుకోవాలని హరీభావు బయలుదేరాడు. 
పాయీ కోరే పాదత్రాణ | మాథా జరీచా ఫేటా బాంధూన | 
సాఈబాబాంచే ఘ్యావయా దర్శన | ఉత్కంఠిత మన హరీభాఊ | ||౩౭|| 
37. కాళ్లకు క్రొత్త చెప్పులను తొడుగుకొని, తలకి జరీ తలపాగా కట్టుకుని, హరీభావు చాలా ఉత్సుకతతో సాయిని దర్శించాలని వచ్చాడు. 
మగ తే యేతా మశీదీసీ | దురూన దేఖూనియా సాఈశీ | 
వాటలే సన్నిధ జాఊని త్యాంసీ | లోటాంగణేంసీ వందావే | ||౩౮|| 
38. మసీదుకు వస్తూ, దూరంనుండే సాయిని చూసి, వారి సమీపానికి వెళ్లి, వారికి సాష్టాంగ నమస్కారం చేయలని అతనికి అనిపించింది. 
పరి పాదత్రాణాంచీ అడచణ | ఠేవావయా న నిర్భయస్థాన | 
తేథేంచి ఎక కోపరా పాహూన | త్యాంతచి తీ సారూన ఠేవియలీ | ||౩౯|| 
39. కాని, అలా చేయడానికి, క్రొత్త చెప్పుల వలన ఇబ్బంది ఏర్పడిండి. వానిని భద్రంగా పెట్టటానికి అక్కడ స్థలం దొరకలేదు. అయినా, అక్కడే ఒక మూల జాగ్రత్తగా పెట్టాడు. 
మగ తే వరతీ దర్శనా గేలే | ప్రేమే సాఈచే చరణా వందిలే | 
ఉదీ ప్రసాద ఘేఊన పరతలే | వాడ్యాంత నిఘాలే జావయా | ||౪౦||
40. తరువాత, దర్శనానికి పైకి వెళ్లాడు. భక్తిగా సాయి పాదాలకు నమస్కరించి, విభూతి ప్రసాదాన్ని తీసుకుని, తిరిగి బసకు బయలుదేరాడు. 

పాయీ ఘాలూ జాతా పాయతణ | మిళేనా పాహతా శోధ శోధూన | 
పరతలే అనవాణీ ఖిన్న వదన | ఆశా తే సాండూన సమూళ | ||౪౧|| 
41. కాళ్లకు చెప్పులు తొడుగుకోవాలని చూస్తే, ఎంత వెతికినా అవి కనిపించలేదు. అతి దుఃఖంతో, వానిపై ఆశను పూర్తిగా వదులుకుని, చెప్పులు లేకుండానే, తిరిగి వచ్చాడు.
కారణ తేథే మండళీ ఫార | యేతీ జాతీ వారంవార | 
పుసావే తరీ కోణాస సాచార | కాంహీంహీ విచార సుచేనా | ||౪౨|| 
42. ఎందుకంటే, అక్కడ చాలా మంది భక్తులు వస్తూ పోతూ ఉండటం వలన, ఎవరిని అడగాలో ఏమీ తోచలేదు. 
ఏసే తయాచే దుశ్చిత మన | డోళీయాంపుఢే పాదత్రాణ | 
చిత్తాస పాదత్రాణ చింతన | సర్వానుసంధాన పాదత్రాణ | ||౪౩|| 
43. అతని మనసు చాలా అల్లకల్లోలమైంది. కళ్ల ఎదుట చెప్పులు, మనసులో ఎప్పుడూ చెప్పుల ఆలోచనే, ధ్యానమంతా చెప్పుల గురించే. ఇలా అతను చాలా చింతకు గురి అయినాడు. 
హౌసే సారిఖే వికత ఘేతలే | పాదత్రాణ గేలే హరవలే | 
అర్థాత కోణా చోరానే చోరిలే | నిశ్చయే వాటలే తయాంస | ||౪౪|| 
44. ఎంతగానో నచ్చితే, ఇష్టపడి వానిని కొనుక్కున్నాడు. అలాంటి చెప్పులు పోయాయి. ఖచ్చితంగా ఎవరో దొంగలు దొంగిలించి ఉంటారని అతనికి నమ్మకం కలిగింది. 
అసో పుఢే కేలే స్నాన | పూజా నైవేద్యాది సారూన | 
పంక్తీస బైసూన కేలే భోజన | పరి న సమాధాన చిత్తాస | ||౪౫|| 
45. తరువాత స్నానం చేసి ఎలాగో పూజ, నైవేద్యం అవి అయ్యాక, పంక్తిలో కూర్చుని భోజనం చేశాడు. కాని, అతని మనసుకు శాంతి లేదు. 
సభామండప సాఈచే స్థాన | తేథూన సాఈచీ దృష్టీ చుకవూన | 
కోణీ న్యావే మాఝే పాయతణ | ఆశ్చర్య లహాన హే కాయ? | ||౪౬|| 
46. ‘సభా మండపం సాయి ఉండే స్థానం. సాయి దృష్టిని తప్పించి నా చెప్పులను ఎవరు తీసుకుని ఉంటారు? ఇదేమైనా చిన్న విషయమా?’ 
లాగలీ తయా హురహూర | చిత్త నాహీ అన్నపానావర | 
మండళీ సమవేత ఆలే బాహేర | ఆంచవూ కర ధువావయా | ||౪౭|| 
47. ఆందోళన ఎక్కువై, అన్న పానీయాదులు మనసుకు రుచించలేదు. భక్తులందరితో పాటు అతడు కూడా చేతులు కడుక్కోవటానికి బయటకు వచ్చాడు. 
ఇతక్యాంత ఎక ములగా మరాఠా | హరవల్యా పాదత్రాణాచా బాహుటా | 
లావూని ఎకా కాఠీచే శేవటా | పాతలా త్యా ఠాయా అవచిత | ||౪౮|| 
48. ఇంతలో, అకస్మాత్తుగా ఒక మరాఠా కుర్రవాడు, హరీభావూ పోగొట్టుకున్న చెప్పులను ఒక కర్రకు తొడిగి, జెండాలా పట్టుకుని, అక్కడికి వచ్చాడు. 
మండళీ జేవూన ఆంచవీత | ములగా ఆలా శోధ కరీత | 
మ్హణే ‘బాబా మజ పాఠవీత | కాఠీ హీ హాతాంత దేఉని | ||౪౯|| 
49. భోజనం చేసి, భక్తులు చేతులు కడుక్కుంటున్నారు. ‘బాబా ఈ కర్రను నా చేతికిచ్చి పంపారు,’ అంటూ కుర్రవాడు వెతుక్కుంటూ వచ్చాడు. 
“‘హరీ కా బేటా జరీ కా ఫేటా’ | ఏసా పుకార కరీత జా బేటా | 
‘యాచ త్యా మాఝ్యా’ ఏశియా ఉత్కంఠా | ఝోంబేల త్యా దేఊని టాకావ్యా | ||౫౦||
50. ‘“బాబూ! హరీ కా బేటా జరికా ఫేటా అని అరుచుకుంటూ వెళ్లు. ఇవి నా చెప్పులు అని ఆతురతతో అడిగినవారికి వీనిని ఇచ్చేయి,” అని చెప్పారు. 

పరి జో ఆహే హరీ కా బేటా | ఆహే తయాచా జరీచా ఫేటా | 
ఆధీ హే నిశ్చిత ఝాలియా శేవటా | ద్యావ్యా న బోభాటా కరావా” | ||౫౧|| 
51. “కాని, హరీ కా బేటా ఎవరో చూసి, అతని వద్ద జరీ తలపాగా ఉందా అని ముందు నిశ్చయంగా తెలుసుకున్న, తరువాతే ఇవ్వు. ఏం గొడవ చేయకు” అని చెప్పారు’. 
యేతా ఏసా పుకార కానీ | ఓళఖోని త్యా వహాణా నయనీ | 
 హరీభాఊ గేలే ధాంవూని | సాశ్చర్య మనీ జాహలే | ||౫౨|| 
52. ఆ మాటలు చెవులలో పడగానే, కళ్లతో తన చెప్పులను చూసి గుర్తు పట్టి, పరుగెత్తుకుని వెళ్లాడు. మనసులో ఆశ్చర్యం నిండి పోయింది. 
ఆనందాశ్రూ ఆలే డోళా | హరీభాఊస గహింవర దాటలా | 
దేఖూని గేలేల్యా పాయతణాలా | చమత్కారలా అత్యంత | ||౫౩|| 
53. ఆనందపు అశ్రువులు కళ్లనుండి దొరలుతుండగా, శరీరం పులకరించింది. పోయాయి అనుకున్న చెప్పులు కనిపించగా, జరిగిన చమత్కారానికి, ఆశ్చర్య పడ్డాడు. 
మ్హణతీ ములాస ‘యే యే ఇకడే | పాహూ దే ఆణ వహాణా మజకడే | 
పాహూని వదే యా తుజ కోణీకడే | గివసల్యా రోకడే మజ సాంగ’ | ||౫౪|| 
54. ‘ఇక్కడికి రా’ అని పిలిచి, ‘ఆ చెప్పులను నా వద్దకు పట్టుకుని రా! ఏదీ నన్ను చూడనివ్వు’ అని అన్నాడు. వానిని బాగా పరీక్షించి ‘ఇవి నీకు ఎక్కడ దొరికాయి? తొందరగా నిజం చెప్పు’ అని అడిగాడు. 
ములగా మ్హణే ‘తే మీ నేణే | మజలా బాబాంచీ ఆజ్ఞా మానణే | 
‘హరీ కా బేటా’ అసేల తేణే | జరీచా ఫేటా దావణే మజ | ||౫౫|| 
55. అప్పుడా అబ్బాయి ‘అవన్నీ నాకేం తెలియదు. నేను బాబా ఆజ్ఞను పాటించాలి. హరీ కా బేటా ఎవరో వారు నాకు జరీ తలపాగా చూపించాలి. 
తయాసచి మీ దేఈన వహాణా | మజ ఇతరాచీ ఓళఖ పటేనా | 
పటవీల జో యా బాబాంచ్యా ఖుణా | తోచ యా వహాణా ఘేఈల’ | ||౫౬|| 
56. ‘వారికే ఈ చెప్పులను ఇస్తాను. మిగతావారిని ఎవరినీ నేను పట్టించుకోను. బాబా చెప్పిన గుర్తులు చూపి, నన్ను నమ్మించిన వారే ఈ చెప్పులను తీసుకుంటారు’ అని అనగా, 
‘అరే పోరా త్యా మాఝ్యాచ వహాణా’ | హరీభాఊ మ్హణతా దేఈనా | 
మగ తో సకళ బాబాంచియా ఖుణా | పటవీ మనా పోరాచ్యా | ||౫౭|| 
57. ‘ఒరే బాబూ! అవి నా చెప్పులే’ అని హరీభావూ అంటే, ఆ అబ్బాయి ఇవ్వలేదు. అప్పుడు అతడు, బాబా చెప్పిన గుర్తులన్నీ చూపి ఆ కుర్రవాడిని నమ్మించాడు. 
మ్హణే ‘పోరా మీచ రే హరీ | కాన్హోబాచా బేటాహీ వైఖరీ | 
సర్వథైవ ఆహే కీ ఖరీ | మజ సర్వతోపరీ లాగతసే | ||౫౮|| 
58. ‘ఒరే బాబూ! నేనేరా హరీని, కాన్హోబా కొడుకును. ఈ మాటలు పూర్తిగా నిజం. అవి నాకే వర్తిస్తుంది. 
ఆతా పాహీ ఫేటా జరీచా | ఫిటేల తుఝే సంశయ మనాచా | 
మగ మీ ఠరేన ధణీ వహాణాంచా | దావా న ఇతరాంచా యావరీ’ | ||౫౯|| 
59. ‘ఇదిగో, ఈ జరీ తలపాగా చూడు. నీ మనసులోని అనుమానాలన్నీ తొలగి పోతాయి. చెప్పులు నావేనని నిశ్చయమౌతుంది. వీనిని ఇతరులు ఎవ్వరూ కోరరు’ అని అన్నాడు. 
ఝాలీ తేవ్హా ములాచీ సమజూత | వహాణా దిధల్యా హరీభాఊప్రత | 
పురలే తయాచే మనోరథ | సాఈ హే సంత అనుభవిలే | ||౬౦||
60. ఆ అబ్బాయికి అంతా అర్థమైన తరువాత, చెప్పులను హరీభావూకు ఇచ్చాడు. ఆ విధంగా హరిభావుయొక్క కోరిక తీరి, సాయి సంతులని స్వంత అనుభవంతో తెలుసుకున్నాడు. 

ఆహే మాఝా ఫేటా జరీ | హీ కాయ మోఠీ నవలపరీ | 
తో తో మాఝియే మస్తకావరీ | సర్వతోపరీ దృశ్యమాన | ||౬౧|| 
61. ‘నా తలపాగాలో జరీ అంచు ఉండటం ఎవరికీ తెలియని గొప్ప సంగతేమీ కాదు. ఎందుకంటే అది నా తలపై అందరికీ కనిపిస్తూ ఉంది.
పరి మీ అసతా దేశాంతరీ | శిరడీస మాఝీ పహిలీచ ఫేరీ | 
 సాఈబాబాంస కైసియేపరీ | మన్నామ హరీ ఠాఊక | ||౬౨|| 
62. ‘కాని, నేను వేరే ఊరివాణ్ణి. శిరిడీకి రావటం ఇదే మొదటి సారి కదా! అలాంటప్పుడు సాయిబాబాకు నా పేరు హరీ అని ఎలా తెలిసింది? 
కాన్హోబా హా మాఝా పితా | కోణీ పాహిలా సవరలా నసతా | 
‘కా’ యా నామే తయా ఉపలక్షితా | అతి ఆశ్చర్యతా వాటలీ | ||౬౩|| 
63. ‘మా తండ్రి కాన్హోబాను ఎవరూ చూడలేదు. మరి కా అనే అక్షరంతో అతని పేరును సూచించటం చాలా ఆశ్చర్యంగా ఉంది. 
పూర్వీ సాఈసంత మహత్తా | మాఝే స్నేహీ మజలా సాంగతా | 
అవమానిలీ మీ త్యాంచీ వార్తా | పశ్చాత్తాపతా ఆతా మజ | ||౬౪|| 
64. ‘ఇంతకు మునుపు నా స్నేహితులు సాయి సత్పురుషుని మహిమను చెప్పగా, వారి మాటలను నేను అవహేళన చేశాను. ఇప్పుడు పశ్చాత్తప పడుతున్నాను. 
ఆతా మజ యేతా అనుభవ | కళలా సాఈబాబాంచా ప్రభావ | 
ఉరలా నాహీ సంశయా ఠావ | మహానుభావ శ్రీసాఈ | ||౬౫|| 
65. ‘స్వయంగా నాకు అనుభవమయిన తరువాత, ఇప్పుడు సాయిబాబా ప్రభావం తెలిసింది. శ్రీసాయి గొప్ప మహాత్ములు అన్న దాంట్లో ఏ విధమైన సంశయాలు లేవు.’ 
జయా మనీ జైసా భావ | హరీభాఊస తైసాచి అనుభవ | 
సంతపరీక్షణ లాలసాస్వభావ | పరమార్థ హావ నాహీ మనీ | ||౬౬|| 
66. మనసులో ఎలాంటి భావముంటే, అలాంటి అనుభవాలే అవుతాయి. హరీభావుకు అలాగే అయింది. సంతులని పరీక్షించాలనే స్వభావం తప్ప, పరమార్థం పొందాలనే కోరిక అతని మనసులో లేదు. 
సాఈ సమర్థ మహానుభావ | స్నేహీ సోయరే కథితీ అనుభవ | 
ఆపణ స్వయే పహావా నవలావ | శిరడీస జావయా కారణ హే | ||౬౭|| 
67. స్నేహితులు బంధువులు సాయి సమర్థులు మహాత్ములని తమ అనుభవాలను చెప్పగా, ఆ విశేషాలను స్వయంగా అనుభవించాలని అనుకోవటం వలనే అతడు శిరిడీకి వెళ్లాడు. 
సంతచరణీ వహావా జీవ | తేణే గివసావా దేవాచా ఠావ | 
మనీ నాహీ యత్కించిత డావ | సరడ్యాచీ ధాంవ కోఠవరీ | ||౬౮|| 
68. సంతుల పాదాలలో మనల్ని అర్పించుకుందాము. దానివల్ల దేవుడి ఆచూకి తెలుసుకుందాం అని అతని మనసులో కొంచెమైనా కోరిక లేదు. ఊసరవెల్లి ఎంత దూరం పోగలదు? 
జాఊనియా సంతాచ్యా దారా | పాహూ ఆదరిలే చమత్కారా | 
తంవ జోడ పాదత్రాణాచా కోరా | ఆలా కీ ఘరా ఘరపోంచ | ||౬౯|| 
69. సంతుని దగ్గరికి వెళ్లి, చమత్కారాన్ని చూడాలని కోరుకున్నాడు. పోయిందనుకున్న క్రొత్త చెప్పుల జత, తాను ఉన్న చోటికే వచ్చింది. 
నాతరీ క్షుల్లక పాయతన | గేల్యానే కాయ మోఠీ నాగవణ | 
పరి తదర్థ మనాచీ వణవణ | తే సాంపడల్యావీణ రాహేనా | ||౭౦||
70. లేకుంటే, అతి చిన్న వస్తువైన ఒక చెప్పుల జత పోయినంత మాత్రాన, గొప్ప నష్టం ఏం వచ్చేది? కాని, వాని కోసం అతని మనసు కలవర పొంది, అవి మరల దొరికే వరకు శాంతించేది కాదు. 

సంత ప్రాప్తీచే మార్గ దోన | ఎక భక్తి దుజా జ్ఞాన |
జ్ఞానమార్గీచే సాయాస గహన | భక్తిచే సాధన సోపారే | ||౭౧||
71. సత్పురుషుల అనుగ్రహాన్ని పొందటానికి రెండు మార్గాలు. ఒకటి భక్తి, రెండవది జ్ఞానం. జ్ఞాన మార్గం చాలా కష్టమైంది. శ్రమతో కూడినది. భక్తియొక్క సాధన సులువైనది. 
ఏసీ సోపీ సులభ భక్తి | తరీహీ అవఘే తీ కా న కరితీ |
తిజలాహీ మహద్భాగ్య సంపత్తీ | అసతాంచ తత్ప్రాతప్తీ ఘడతసే | ||౭౨||
72. భక్తి మార్గం అంత సులభమైతే, అందరూ ఎందుకు దానిని అవలంబించరు? ఎందుకంటే, భక్తి కూడా ఎంతో మహా భాగ్యంతోనే లభిస్తుంది. 
కోటి జన్మాంచే పుణ్య అసతే | తేవ్హాంచి సంతాచీ గాంఠీ పడతే |
సంతసమాగమ సౌఖ్య ఘడతే | తేణేంచ వికాసతే నిజభక్తి | ||౭౩||
73. కోటి జన్మల పుణ్యముంటేనే, సత్పురుషులతో కలయిక, వారితో సమాగమ సుఖం దొరుకుతుంది. దానితోనే భక్తి పెరుగుతుంది. 
ఆమ్హీ సర్వ జాణో ప్రవృత్తి | తేథేంచి ఆసక్తి నేణో నివృత్తి |
ఏసీ జేథే మనాచీ వృత్తి | తీ కాయ భక్తి మ్హణావీ | ||౭౪||
74. మనకు సాంసారిక జీవితం ఒక్కటే తెలుసు. దానితోనే మనల్ని బంధించుకుంటాము. ఆ బంధాలను ఎలా త్రెంచుకోవాలో మనకు తెలియదు. ఇలాంటి స్థితిలో ఉండగా దానిని భక్తి అని ఎలా అనగలం? 
జైసీ జైసీ ఆముచీ భక్తి | తైసీ తైసీ ఆమ్హాంస ప్రాప్తి |
హే తో కేవ్హాంహీ ఘడణార నిశ్చితీ | యేథే న భ్రాంతీ తిళమాత్ర | ||౭౫||
75. మన భక్తి ఎలా ఎలా పెరుగుతుందో అలా మన ప్రాప్తి కూడా పెరుగుతుంది. ఇది ఎప్పటికైనా నిశ్చయంగా జరిగి తీరుతుంది. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. 
విషయభోగార్థ అహర్నిశీ | ఆమ్హీ జమలో సాఈపాశీ |
యా ఆమ్హాంతే దేణగీహీ తైసీ | పరమార్థియాశీ పరమార్థ | ||౭౬||
76. రాత్రీ పగలూ, ఇంద్రియ సుఖాల కోసమే మనము సాయి వద్ద గుమి కూడాం. కనుక, మనకు దొరికేవి కూడా అవే. పరమార్థాన్ని కోరుకునేవారికి పరమార్థం దొరుకుతుంది. 
అసో ఆతా ఆణీక ఎక | సోమదేవ స్వామీ నామక |
కరావయా సాఈచీ పారఖ | పాతలే ప్రత్యక్ష శిరడీంత | ||౭౭||
77. ఇప్పుడు సోమదేవ స్వామి అనే పేరుగల మరొక వ్యక్తి గురించి చెప్పుతాను. ఇతడు కూడా సాయిని స్వయంగా పరీక్షించాలని శిరిడీ వెళ్లాడు. 
సన ఎకోణీసశే సహా | ఉత్తర కాశీమాజీ పహా |
గృహస్థ భేటలా భాఈజీసహా | పాంథస్థ నివహామాజీ స్థిత | ||౭౮||
78. ఉత్తర కాశీలో ధర్మశాలలో ఉండే ఇతడు, క్రి. శ. ౧౯౦౬వ సంవత్సరంలో భాయిజిని కలిశాడు. 
ప్రసిద్ధ కైలాసవాసీ దీక్షిత | భాఈజీ త్యాంచే బంధు విశ్రుత |
బద్రికేదార యాత్రా కరీత | అసతా హే భేటత మార్గాంత | ||౭౯||
79. ఈ భాయిజి ప్రసిద్ధి చెందిన కీ. శే. కాకాసాహేబు దీక్షితుయొక్క సోదరడు. అతడు బదరీ కేదార్ యాత్ర చేస్తుండగా మార్గంలో ఈ స్వామిని కలిశాడు. 
బద్రికేదార మాగే టాకిలే | భాఈజీ మగ ఖాలీ ఉతరలే |
ఠాయీ ఠాయీ విసావే లాగలే | పాంథస్థ దిసలే బసలేలే | ||౮౦||
80. బదరీ కేదారాల తరువాత, భాయిజి క్రిందకు దిగాడు. దారిలో అక్కడక్కడా విశ్రాంతి కోసం ఏర్పాటు చేసిన చోటులో బస చేసిన ప్రయాణికులు కనిపించారు. 

తయా మాజీల ఎక అసామీ | తేచ హే పుఢే హరిద్వారాచే స్వామీ | 
సర్వత్ర విశ్రుత యాచ నామీ | లాగలే లగామీ బాబాంచ్యా | ||౮౧|| 
81. వారిలో ఈ స్వామి ఒకరు. ఇతడే తరువాత హరిద్వార స్వామి అని ప్రసిద్ధుడయ్యాడు. ఇతడు కూడా బాబా ప్రభావానికి లోనయ్యాడు.
త్యాంచీ హీ కథా బోధప్రద | బాబాంచే స్వరూప కరీల విశదూ | 
శ్రవణకర్త్యా దేఈల మోద | నిజానంద సర్వత్రా | ||౮౨|| 
82. ఈ బోధప్రదమైన కథ అతని గురించే. ఇది బాబా స్వరూపాన్ని విశద పరచి శ్రోతలకు ఆనందాన్ని కలిగిస్తుంది. 
ప్రాతర్విధీస జాతా భాఈజీ | భేటలే మార్గీ హే స్వామీజీ | 
గోష్టీ బోలతా బోలతా సహజీ | ప్రేమరాజీ ప్రకటలీ | ||౮౩|| 
83. ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవటానికి భాయి వెళ్లుతుండగా, దారిలో స్వామిజీ కలిశాడు. వారు అలా సహజంగా ముచ్చటించుకుంటుండగా వారికి ఒకరిమీద ఒకరికి అభిమానం పెరిగింది. 
గంగోత్రీచా అధః ప్రదేశ | బువా అసతా ఉత్తర కాశీస | 
డేహరాడూనహూన సత్తర కోస | తేథే హా సహవాస జాహలా | ||౮౪|| 
84. గంగోత్రికి క్రింద భాగాన, డెహరాడూన్నుండి డెబ్బై కోసుల దూరంలో వీరిద్దరికీ పరిచయం కలిగింది. స్వామి అప్పుడు ఉత్తర కాశీలో ఉండేవారు. 
లోటా ఘేఊన బహిర్దిశేస | నిఘాలే బువా ప్రాతః సమయాస | 
భాఈజీహీ తయా స్థళాస | త్యాచ కార్యాస నిఘాలే | ||౮౫|| 
85. ఉదయాన, చెంబు పుచ్చుకుని, స్వామి బహిఃప్రదేశానికి వెళ్లాడు. భాయిజీ కూడా అదే పని మీద అదే చోటికి వచ్చాడు. 
ప్రథమ ఉభయతః దృష్టాదృష్టీ | పుఢే మార్గాంత పరస్పర భేటీ | 
పరస్పరాంచ్యా కుశల గోష్టీ | సుఖ సంతుష్టీ చాలల్యా | ||౮౬|| 
86. మొదట, ఆ ఇద్దరూ ఒకరిని ఒకరు చూచుకున్నారు. తరువాత, దారిలో పరస్పరం కలుసుకున్నారు. ఒకరిని ఒకరు కుశల సమాచారాలను సుఖ సంతోషాలతో ముచ్చటించుకున్నారు. 
కరూ లాగతా విచార పూస | ప్రేమ ఆలే పరస్పరాంస | 
ఠావ ఠికాణా ఎకమేకాస | పుసావయాస లాగలే | ||౮౭|| 
87. అలా వారు మాట్లాడుకుంటుండగా వారిలో ప్రేమ కలిగింది. దాంతో, వారివారి నివాస స్థలాలను అడిగి తెలుసుకున్నారు. 
హరిద్వారీ తుమచా వాస | నాగపురీ అమ్హా నివాస | 
కధీ జేవ్హా త్యా బాజూస | యేణే ఝాలియాస దర్శన ద్యా | ||౮౮|| 
88. ‘హరిద్వారంలో మీరు ఉంటారు. మేము నాగపురలో ఉంటాం. ఆ వైపు ఎప్పుడైనా రావటం జరిగితే మీ దర్శనాన్ని కలిగించండి. 
యాత్రా కరీత యాల జేవ్హా | పునీత కరావే ఆముచే గేహా | 
పునర్దర్శన అమ్హా ఘడవా | అల్ప సేవా ఘ్యా అముచీ | ||౮౯|| 
89. ‘యాత్రలో మీరు అటువైపు వచ్చినప్పుడు, మా గృహాన్ని పావనం చేయండి. మీ దర్శనాన్ని మరల కలిగించి, మా అల్ప సేవను స్వీకరించండి. 
అసూ ద్యావే ఆముచే స్మరణ | లాగావే అముచే ఘరాస చరణ | 
హేంచ అముచే ఆహే వినవణ | పురవో నారాయణ హీ ఇచ్ఛా | ||౯౦||
90. ‘మీరు మమ్మల్ని గుర్తుంచుకోవాలి. మీ పాద స్పర్శ మా ఇంటికి కలగాలి. ఇదే నా విన్నపం. నారాయణుడు నా ఈ కోరికను తీర్చుగాక’ అని భాయీ అన్నాడు. 

ఎకోణీససే సహా సాలీ | ఉత్తర కాశీచియా ఖాలీ | 
పరస్పరాంత హే భాషా బోలీ | హోఊని గేలీ ఇయాపరీ | ||౯౧|| 
91. క్రి. శ. ౧౯౦౬వ సంవత్సరంలో, ఉత్తర కాశీ క్రింద ఆ ఇద్దరూ కలుసుకున్నప్పుడు ఆ విధంగా మాట్లాడుకున్నారు. 
పరస్పరాంచే ఠావ ఠికాణ | ఘేతలే ఉభయతాంహీ పుసూన | 
పాహూన జవళ ఆలే మైదాన | నిఘాలే సోడూన అన్యోన్యా | ||౯౨|| 
92. ఒకరికొకరు తమ చిరునామాలను అడిగి తీసుకుని, బయట ప్రదేశం రాగానే, ఒకరిని ఒకరు వదిలి వెళ్లిపోయారు. 
జాతా పాంచ వర్షాంచా కాళ | యేతా సాఈసమాగమ వేళ | 
భాఈజీచ్యా భేటీచీ తళమళ | లాగలీ ప్రబళ స్వామీస | ||౯౩|| 
93. ఐదు సంవత్సరాలు గడిచాయి. స్వామిజీ సాయిని కలుసుకునే సమయం రాగానే, స్వామిజీకి భాయీని కలుసుకోవాలని చాలా ఆతురత కలిగింది. 
సన ఎకోణీసశే అకరా | ఆలే స్వామీజీ నాగపూరా | 
తేథే శ్రీసాఈనాథాంచే చరిత్రా | పరిసతా పవిత్రా ఆనందలే | ||౯౪|| 
94. దాంతో, క్రి. శ. ౧౯౧౧వ సంవత్సరంలో స్వామిజీ నాగపురకి వచ్చారు. అక్కడ శ్రీసాయినాథుని పవిత్ర చరిత్రను విని ఆనందించారు. 
దేతీ భాఈజీ శిఫారస పత్ర | సుఖే గాంఠావే శిరడీక్షేత్ర | 
ఏసీ యోజనా ఠరవూని సర్వత్ర | సోడిలే నాగపుర స్వామీనీ | ||౯౫|| 
95. శిరిడీలో స్వామికి అన్ని సదుపాయాలు సుఖంగా జరగాలని భాయి సిఫారసు పత్రం ఇచ్చాడు. అలా అన్ని ఏర్పాట్లను చేసుకుని, స్వామి నాగపురంనుండి బయలుదేరాడు. 
ఉతరతా తే మనమాడావర | కోపరగాంవచీ గాడీ తయార | 
తేథే హోఊని టాంగ్యాంత స్వార | ఆనంద నిర్భర దర్శనా | ||౯౬|| 
96. మన్మాడులో దిగగానే, కోపర్గాంకు బయలుదేరే రైలు బండి సిద్ధంగా ఉంది. అక్కడనుండి, సాయి దర్శనానికి, స్వామి ఆనందంగా టాంగాలో బయలుదేరాడు. 
కోఠేంహీ జా సాధూచే వర్తన | అథవా త్యాంచీ రహాణీ చలన | 
ఎకాచే ఎక ఎకాచే ఆన | నసతే సమసమాన కోఠేహీ | ||౯౭|| 
97. ఎక్కడికి వెళ్లినా, సాధువుల ఆచారము, నడవడి, ఒక్కొక్కరిది ఒక్కో రకంగా ఉంటుంది. అందరి ప్రవర్తనా ఒకే రకంగా ఎక్కడా ఉండదు. 
ఎకా సంతాచే ఆచరణ | తే న దుజియా సంతా ప్రమాణ | 
యోగ్యాయోగ్యతేచే అనుమాన | కరాయా సాధన హే నవ్హే | ||౯౮|| 
98. ఒక సాధువు ఆచరణ మరొక సాధువుకు కొలమానం కాదు. కనుక, సాధువుల అర్హతలను తెలుసుకోవటానికి ఇది సాధన కాదు. 
ఆధీ జో జాఈ సంతదర్శనా | కిమర్థ వ్హావీ హే తయా వివంచనా | 
పాహూ జాతా తయాంచే వర్తనా | నిజ కల్యాణా నాగవణ | ||౯౯|| 
99. అయినా, దర్శనానికి వెళ్లేవారికి, సంతుల ఆచరణ గురించి మొదటే ఆలోచన ఎందుకు? వారి ఆచరణను పరీక్షించాలనుకుంటే, మన మేలు కోల్పోవటామే. 
స్వామీజీచే మనాచీ రచనా | తర్క కుతర్క ఉఠతీ నానా | 
లాంబూన దిసతా శిరడీచ్యా నిశాణా | చాలల్యా కల్పనా స్వామీచ్యా | ||౧౦౦||
100. కాని, స్వామిజీ స్వభావం వలన అతని మనసులో అనేక రకాల తర్కాలు, కుతర్కాలు లేచాయి. దూరంనుంచి, శిరిడీలోని పతాకం కన్పించగా, స్వామికి సంశయం కలిగింది. 

తయాంసవే అసలేలే జన | మశీదీచే కళసాచే నిశాణ | 
దృష్టిపథాంత యేతా దురూన | కరీత వందన ప్రేమానే | ||౧౦౧|| 
101. మసీదుపైన కలశం వద్ద, పతాకం కనిపించగానే, స్వామితో పాటు ఉన్న భక్తులు దూరంనుండే భక్తిగా వందనం చేశారు.
పుఢే ఘడేల సాఈ దర్శన | మ్హణోని జరీ ఉత్కంఠిత మన | 
పరి న త్యాంతే దిసలేలే నిశాణ | త్యాచాహీ అవమాన సాహేనా | ||౧౦౨|| 
102. త్వరలో సాయి దర్శనం కలుగుతుందని మనసు ఉబలాట పడుతున్నా, అది తరువాత సంగతి. కనిపించిన పతాకాన్ని ఉపేక్షించరాదు. 
నిశాణదర్శనే ప్రేమస్ఫురణ | హా తో సర్వత్ర అనుభవ జాణ | 
హే తో భక్తి ప్రేమలక్షణ | కాంహీంహీ విలక్షణ యేథ నసే | ||౧౦౩|| 
103. పతాకం కనిపించగానే ప్రేమ పొంగడం, అందరి అనుభవం. ఇది భక్తి, ప్రేమల లక్షణం. ఇందులో విశేషమేమీ లేదు. 
పరి స్వామీచ్యా కుత్సితమనా | దురూన పాహూనియా త్యా నిశాణా | 
ఉఠల్యా కల్పనావరీ కల్పనా | విచిత్ర రచనా మనాచీ | ||౧౦౪|| 
104. కాని, స్వామియొక్క నీచమైన మనసులో, పతాకాన్ని దూరంనుండి చూడగానే, ఆలోచనల పైన ఆలోచనలు లేచాయి. విచిత్రమైన మనసు అతనిది. 
పతాకాంచీ ఆవడ మనా | హీ కాయ సాధుత్వాచీ కల్పనా | 
దేవళావరీ లావావే నిశాణా | హా తో హీనపణా సాధుత్వా | ||౧౦౫|| 
105. ‘పతాకాల పైన ఇంత ప్రేమ, సాధువుల లక్షణమా? దేవాలయాల పైన పతాకాలను పెట్టటం సాధువులకు హీనత్వం. 
సాధూ మాగే ఏణే మానా | హీ తో త్యాచీ కేవళ లోకేషణా | 
యేఈన ఏసియాచే సాధుత్వ మనా | హా తో ఉణేపణా తయాస | ||౧౦౬|| 
106. ‘సాధువులు ఇలా గౌరవ మర్యాదలను కోరుకోవటం, కేవలం కీర్తి, ప్రతిష్ఠల కోసం ఆశ పడే వారి మనసుకు లక్షణం. ఇలాంటి లక్షణాలున్న సాధుత్వం మనసుకు నచ్చదు. సాధువులలో ఉన్న లోపమిది.’ 
సారాంశ జైసా మనాచా గ్రహ | సాధూనిర్ణయీ తైసాచ ఆగ్రహ | 
ఝాలా స్వామీచ్యా మనాచా నిగ్రహ | నకో మజ అనుగ్రహ సాఈచా | ||౧౦౭|| 
107. సారాంశం ఏమిటంటే, స్వామి తన మనసుకు తోచిన విధంగా సాధువుల యోగ్యతను నిర్ణయించుకున్నాడు. ‘ఇక ఈ సాయి అనుగ్రహం నాకు అవసరం లేదు’ అని మనసులో నిశ్చయించుకున్నాడు. 
ఉగాచ ఆలో మీ యేథవర | స్వామీస థోర ఉపజలా అనాదర | 
తేథూన పరతావయాచా నిర్ధార | కేలా మగ సాచార తాత్కాళ | ||౧౦౮|| 
108. ‘వ్యర్థంగా ఇక్కడి వరకు వచ్చాను’, అని అనుకున్నాడు. బాబా గురించి చాలా అగౌరవంగా అనిపించి, తక్షణం అక్కడినుండి తిరిగి వెళ్లిపోవటానికి నిశ్చయించుకున్నాడు. 
లోకేషణేచా దురభిమాన | సాధూస కశాస పాహిజే మాన | 
యాహూన మజ దుజే అనుమాన | నిశాణ పాహూన హోఈనా | ||౧౦౯|| 
109. ‘దురభిమానం తప్ప, సాధువులకు కీర్తి, ప్రతిష్ఠల గురించి ఇంత ఆశ ఎందుకు? పతాకాన్ని చూస్తుంటే, ఇంతకన్నా నాకు వేరే ఏదీ కనిపించటం లేదు. 
నిశాణే అపులా మోఠేపణా | సాధు హా ఆణితో నిదర్శనా | 
హాచి సంతత్వాశీ ఉణేపణా | కాయ దర్శనా జాణే మ్యా | ||౧౧౦||
110. ‘పతాకాలని ఎగుర వేసుకుని, ఈ సాధు తన గొప్పతనాన్ని చాటుకోవడం, అతని సాధు లక్షణానికి పెద్ద లోపం. ఇటువంటి సాధువు దర్శనానికి నేనెందుకు వెళ్లాలి? 

ఘేతలియా హే ఏసే దర్శన | ఎణే కైసే నివావే మన | 
హే తో దంభధ్వజ ప్రదర్శన | సమాధాన ఎణే నా | ||౧౧౧|| 
111. ‘ఇలాంటి వారి దర్శనం చేసుకుంటే మాత్రం, మనసు ఎలా శాంతిస్తుంది? పతాకం ద్వారా తమ దంభత్వాన్ని చూపించుకోవటమే ఇది. ఇందులో మనసుకు సమాధానం ఉండదు. 
మ్హణతీ జావే మాఘారా | ఆల్యా వాటే అపులే ఘరా | 
దిసేనా హా విచార బరా | ఫజీత ఖరా ఝాలో మీ | ||౧౧౨|| 
112. ‘వచ్చిన దారినే ఇంటికి వెళ్లిపోవాలి. అతనిని దర్శించుకోవటం మంచి ఆలోచన కాదని అనిపిస్తుంది. నిజంగా, నేను మోసపోయాను’ అని అనుకున్నాడు. 
సహవాసీ మగ మ్హణతీ త్యాంసీ | ఇతకే దూర ఆలా కశాసీ | 
కేవళ నిశాణే చిత్తవృత్తీసీ | ఖళబళ ఏసీ కా ఝాలీ | ||౧౧౩|| 
113. అప్పుడు అతని వెంట ఉన్నవారు అతనితో, ‘స్వామీ! ఇంత దూరం ఎందుకు వచ్చినట్లు? పతాకాన్ని చూచినంత మాత్రాన, మీ మనసెందుకు ఇంతలా చలించి పోయింది? 
ఆతా ఆపణ ఆలో జవళ | రథ పాలఖీ ఘోడా సకళ | 
సరంజామ హా పాహతా నిఖళ | కితీ మగ తళమళ లాగేల | ||౧౧౪|| 
114. ‘మనమిప్పుడు వారి దగ్గరికి వచ్చేశాము. అక్కడి రథం, పల్లకి, గుర్రం వగైరా సరంజామానంతా చూస్తే, మీ మనసు ఇంకా ఎంత తపన పడుతుందో’ అని అన్నారు. 
పరిసూని స్వామీ అధికచి బిఘడే | జయా నగారే పాలఖ్యా ఘోడే | 
ఏసే సాధు మిజాసీ బడే | మ్యా కాయ థోడే దేఖిలే | ||౧౧౫|| 
115. ఆ మాటలు విని స్వామికి మరింతగా కోపం వచ్చింది. ‘పల్లకి, గుర్రం వగైరాలున్న ఇలాంటి దాంభికులైన సాధువులను, నేను ఎంత మందిని చూడలేదు!’ 
ఏసే విచార యేఊన అంతరా | సోమదేవజీ నిఘతీ మాఘారా | 
శిరడీచా విచార నాహీ బరా | రస్తా ధరా కీ నదీచా | ||౧౧౬|| 
116. సోమదేవ స్వామి అలా అనుకుని, ‘ఇక శిరిడీకి వెళ్లే మాటేలేదు. నదికి వెళ్లే దారి పట్టాలి’ అని అనుకుంటూ స్వామి వెనుకకు బయలుదేరాడు. 
మగ బరోబరీల వాటసరూ | లాగలే తయాస ఆగ్రహ కరూ | 
ఆలాత ఆపణ యేథవరూ | నకా హో ఫిరూ మాఘారా | ||౧౧౭|| 
117. కాని, అతని వెంట వచ్చినవారు, ‘ఇంతవరకూ వచ్చిన మీరు వెనుకకు మరలవద్దు. 
ఆల్యాసారిఖే చలా కీ పుఢే | నకా కరూ హే తర్కకుడే | 
హే నిశాణ జే మశీదీ ఉడే | సాధూకడే నా సంబంధ | ||౧౧౮|| 
118. ‘ఇక్కడి వరకూ వచ్చినట్లే, ఇంకొంచెం ముందుకు సాగండి.’ అని బలవంత పెట్టారు. ‘కుతర్కాలు చేయకండి. మసీదు పైన ఎగిరే పతాకాలకు ఆ సాధువుకూ ఏమీ సంబంధం లేదు. 
యా సాధూస నలగే నిశాణ | నలగే లోకేషణా నలగే మాన | 
గ్రామస్థాస హే ఆవడే భూషణ | భక్తీ ప్రమాణ కారణ యా | ||౧౧౯|| 
119. ‘పతాకాలు, ఆదర సత్కారాలు ఈ సాధువుకు అవసరం లేదు. వారికి కీర్తి, ప్రతిష్ఠల పైన ఏ మాత్రం కోరిక లేదు. ఆర్భాటాలు, అలంకారాలు, గ్రామస్థులకు ప్రీతి. ఇది వారి భక్తికి నిదర్శనం. 
పాహూ నకా కీ తుమ్హీ నిశాణ | జాఊని ఘ్యా నుసతే దర్శన | 
రాహూ నకా తై ఎక క్షణ | జా కీ పరతోన మాఘారా | ||౧౨౦||
120. ‘మీరు ఆ పతాకాన్ని చూడకండి. వెళ్లి, వారిని దర్శనం చేసుకోండి. తరువాత, క్షణమైనా అక్కడ ఉండకుండా తిరిగి వెళ్లిపోండి’ అని చెప్పారు. 

ఇతక్యాంత యేతా శిరడీ జవళ | వాటలే ఉపదేశ ఏకూన తో సరళ | 
కాఢూన టాకావీ మనాచీ మళమళ | పునశ్చ హళహళ నసావీ | ||౧౨౧|| 
121. ఇంతలో శిరిడీ దగ్గరకు వచ్చింది. ‘వారు చెప్పిన మంచి సలహ విని, అక్కడికి వెళ్లి, మనసులోని ఈ అలజడిని పోగొట్టుకోవాలి. తరువాత పశ్చాత్తాప పడకూడదు’ అని స్వామి అనుకున్నాడు.
అసో శ్రీసమర్థ దర్శనే కరూన | బువా గేలే విరఘళూన | 
ప్రేమ ఆలే డోళా భరూన | కంఠ సద్గదూన దాటలా | ||౧౨౨|| 
122. శ్రీసాయి సమర్థుల దర్శనం కాగానే, స్వామి కరిగిపోయాడు. ప్రేమతో అతడి కళ్లు నిండి పోయాయి. కంఠం గద్గదమైంది. 
చిత్త ఝాలే సుప్రసన్న | నయన ఉల్హాసే సుఖ సంపన్న | 
కధీ చరణరజస్నాన | కరీన ఏసే త్యా ఝాలే | ||౧౨౩|| 
123. మనసు సంతోషంతో నిండి పోయింది. కళ్లకు ఆనందం కలిగింది. సాయి పాద ధూళిలో పడి, ఎప్పుడెప్పుడు పవిత్రుడనౌతానా అని స్వామికి అనిపించింది. 
పాహతా రూప తే నేటక | మనా నయనా పడలే టక | 
పాహతచి రాహిలే టకమక | మోహే అటక పాడిలీ | ||౧౨౪|| 
124. సాయి రూపాన్ని చూస్తుంటే, మనసు ఏకాగ్రమైంది. ప్రేమతో కట్టుబడి, అలా చూస్తూనే ఉండిపోయాడు. 
కుతర్క మనీచె జిరాలే | చిత్త దర్శనానందీ విరాలే | 
సగుణరూప నయనీ మురాలే | బువా ఝాలే తల్లీన | ||౧౨౫|| 
125. మనసులోని అనుమానాలన్నీ తీరిపోయాయి. సాయిని చూసిన ఆనందంతో, మనసు కరిగి పోయింది. సాయి సగుణ రూపం కళ్లలో మిగిలింది. దాంతో స్వామి అలౌకికమైన ఆనందంలో లీనమయ్యాడు. 
డోళా దేఖతా మహానుభావా | పరమ ఆల్హాద సోమదేవా | 
ఆత్మారామా జాహలా విసావా | వాటే వసావా హా ఠావ | ||౧౨౬|| 
126. తన కళ్లతో మహాత్ముని చూసిన సోమదేవ స్వామికి విపరీతమైన సంతోషం కలిగింది. అతని ఆత్మకు నెమ్మది దొరికింది. ఇక్కడే ఎప్పటికీ ఉండిపోదునా అని అతనికి అనిపించింది. 
దర్శనేచ వికల్ప మావళే | బుద్ధీ ఠాయీంచ తాటకళే | 
దుజేపణ సమస్త విరఘళే | ఏక్య జాహలే సబాహ్య | ||౧౨౭|| 
127. దర్శన మాత్రంతోనే అన్ని సంశయాలూ, ఆలోచనలూ మాయమయ్యాయి. బుద్ధి మౌనం వహించింది. భేద భావం పోయి, లోపల బయటా అంతా ఒకటే అనే భావన కలిగింది. 
వాచేసి నిఃశబ్దత్వే మౌన | నిమేషోన్మేష రహిత నయన | 
అంతర్బాహ్య చైతన్యఘన | సమాధాన సమరసే | ||౧౨౮|| 
128. చెప్పడానికి పదాలు తెలియక, మాట మౌనం వహించింది. కంటి రెప్పలు ఆడటం మాని వేశాయి. లోపల బయటా అన్ని చోటా ఉన్న చైతన్యాన్ని తెలుసుకుని, మనసు శాంతించింది. 
నిశాణదర్శనే ఆధీ మురడలే | పుఢే ప్రేమోద్రేకే నిడారలే | 
సాత్విక అష్టభావే ఉభడిలే | వేడిలే ప్రేమ బాబాంచే | ||౧౨౯|| 
129. మొదట, పతాకాన్ని చూచిన వెంటనే వెనుకకు మరలాడు. కాని, తరువాత ప్రేమతో కలిగిన ఉద్రేకంతో కరిగి పోయాడు. స్వామిలో ఎనిమిది రకాలైన సాత్విక భావాలు ఉప్పొంగాయి. బాబా పైన కలిగిన అతని ప్రేమ అతన్ని చుట్టేసింది. 
జేథే మన పూర్ణ రంగలే | తేంచ అపులే స్థాన వహిలే | 
హే నిజగురుచే బోల ఆఠవలే | ప్రేమ దాటలే బువాంనా | ||౧౩౦||
130. ‘మనసు పూర్తిగా లీనమైన చోటే మన నిజమైన స్థానమని’ తన గురువు చెప్పిన మాట స్వామికి గుర్తుకు వచ్చింది. అతనిలో ప్రేమ ఉప్పొంగింది. 

బువా హళుహళూ పుఢే యేతీ | తో తో మహారాజ రాగాస చఢతీ | 
శివ్యాంచీ త్యా లాఖోలీ వాహతీ | తో తో త్యా ప్రీతి ద్విగుణిత | ||౧౩౧|| 
131. మెల్ల మెల్లగా స్వామి బాబా ముందుకు వెళ్లాడు. సాయి మహారాజుకు కోపం బాగా పెరిగి, తిట్ల వర్షాన్ని ధారాళంగా కురిపించారు. దాంతో, స్వామికి బాబా పైన ప్రేమ రెండింతలుగా పెరిగింది. 
సమర్థ బాబాంచీ కరణీ అచాట | తయాంచా తో విలక్షణ ఘాట | 
నారసింహావతారాచా థాట | ఆటోకాట ఆణిలా | ||౧౩౨|| 
132. సాయి సమర్థుల చర్య విశిష్ఠం. వారి లీల అసమానమైనది. సంపూర్ణ నరసింహావతారాన్ని వారు ధరించారు. 
“థోతాండ ఆముచే అముచ్యా పాశీ | రాహో” మ్హణతీ “చల జా ఘరాసీ | 
ఖబరదార మాఝ్యా మశీదీసీ | జర తూ యేశీల మాగుతా | ||౧౩౩|| 
133. “మా డాంబికాన్ని మా వద్దే ఉండనీ. ఫో! ఇంటికి వెళ్లిపో! ఖబర్దార్! మళ్ళీ ఎప్పుడైనా ఈ మసీదుకు వచ్చావంటే, 
“జో లావితో మశీదీస నిశాణ | కశాస వ్హావే త్యాచే దర్శన | 
హే కాయ సంతాచే లక్షణ | యేథే న క్షణ ఎక కంఠావా” | ||౧౩౪|| 
134. “మసీదుపైన పతాకాలను కట్టుకునే వారిని ఎందుకు దర్శించుకోవాలి? ఇది సంతుల లక్షణమా? ఇక్కడ ఒక్క క్షణమైనా ఉండొద్దు” అని అన్నారు. 
అసో పుఢే సాశంక చిత్త | సభా మండపీ స్వామీ ప్రవేశత | 
దురూన పాహూన సాఈచీ మూర్త | స్వామీసీ నివాంత రాహవేనా | ||౧౩౫|| 
135. తరువాత స్వామి, సందేహంతో సభా మండపంలోనికి ప్రవేశించాడు. సాయిని దూరంనుండి చూచిన స్వామి ఊరికే ఉండలేక పోయాడు. 
హా అపులేచ విచారాంచా ప్రతిధ్వనీ | శబ్దశః తో ఆదళతా కానీ | 
బువా శరమలే స్థానిచే స్థానీ | ‘అంతర్జ్ఞా నీ మహారాజ’ | ||౧౩౬|| 
136. తాను అన్న మాటలు అక్షరం అక్షరంగా చెవులలో ప్రతిధ్వనించగా, ‘ఈ మహారాజు అంతర్జ్ఞాని’ అని అనుకుని స్వామి అక్కడికక్కడే సిగ్గు పడిపోయాడు. 
‘కితీ హో ఆపణ అప్రబుద్ధ | కితీ మహారాజ తరీ ప్రబుద్ధ | 
కితీ త్యా మాఝ్యా కల్పనా విరుద్ధ | కితీ హే శుద్ధ అంతర | ||౧౩౭|| 
137. ‘నేను ఎంత బుద్ధి లేనివాణ్ణి. మహారాజు ఎంతటి జ్ఞానులు. నా ఆలోచనలు ఎంత విరుద్ధంగా ఉండేవి, వారు ఎంతటి నిర్మల అంతఃకరణం కలవారు’ అని అనుకున్నాడు. 
‘సాఈ కోణాస దేతీ ఆలింగన | కోణాస కరితీ హస్తస్పర్శన | 
కోణాస దేతీ ఆశ్వాసన | కృపావలోకన కోణాస | ||౧౩౮|| 
138. ‘సాయి కొందరిని దగ్గరకు తీసుకుంటూ, మరి కొందరికి కరచాలన చేస్తూ, ఇంకొందరికి ధైర్యం చెబుతూ, మిగతా కొందరిని ప్రేమతో చూస్తున్నారు. 
‘కోణాకడే పాహీ హాస్యవదన | కోణాచ్యా దుఃఖాచే కరీ సాంత్వన | 
కోణాస ఉదీ ప్రసాదదాన | కరీత సమాధాన సకలాంచే | ||౧౩౯|| 
139. ‘కొందరిని నవ్వుతూ పలకరిస్తూ, కొందరి బాధను ఓదార్చుతూ, మరికొందరికి విభూతి ప్రసాదాన్ని ఇస్తూ, ఇలా అందరినీ సంతృప్తి పరుస్తున్నారు. 
‘ఏసే అసతా మజవరీచ క్రోధ | వాటే హా మమ వర్తనానురోధ | 
క్రోధ నాహీ హా మజలా బోధ | హోఈల మోదదాయీతో’ | ||౧౪౦||
140. ‘ఇలా చక్కగా అందరినీ పలకరిస్తున్న బాబాకు నాపైనే కోపమెందుకు? ఇది నేను అన్న మాటల ప్రభావమే అని అనిపిస్తుంది. ఇది వారి కోపం కాదు, ఆనందాన్ని కలిగించే వారి బోధ. 

అసో పుఢే తైసేంచ ఝాలే | స్వామీ బాబాంపాశీ జే రమలే | 
సాఈకృపే నిర్మళ బనలే | చరణీ ఠేలే నిరంతర | ||౧౪౧|| 
141. తరువాత అలాగే జరిగింది. స్వామి బాబా దగ్గరే ఉన్నాడు. వారి కృపతో నిర్మలుడై, సాయి పాదాలలోనే శాశ్వతంగా స్థిర పడ్డాడు.
సాఈభక్తిప్రభావ వీర్య | విరవో దుర్వాసనా మాత్సర్య | 
ఉపజవో శాంతీ శ్రీ ధైర్య | కరో కృతకార్య నిజభక్తా | ||౧౪౨|| 
142. మన మద మాత్సర్యాలను, దుర్వాసనలను, సాయి భక్తి ప్రభావంలోని శక్తి తొలగించుగాక! ఐశ్వర్యాన్ని, ధైర్యాన్ని, శాంతిని కలిగించుగాక! భక్తులను ధన్యులుగా చేయుగాక! 
గంధర్వ యక్ష సురాసూర | ఇహీ భరలే హే చరాచర | 
త్యా అఖిల విశ్వీ హా విశ్వంభర | జరీ నిరంతర భరలేలా | ||౧౪౩|| 
143. యక్షులతోను, గంధర్వులతోను, సురాసురులతోనూ ఈ చరాచర సృష్టి నిండి ఉంది. దేవుడు ఈ విశ్వమంతటా వ్యాపించి ఉన్నాడు. 
పరి న స్వీకారితా ఆకార | ఠాతా సదైవ నిరాకార | 
ఆమ్హీ మానవ హే సాకార | హోతా న ఉపకార లవమాత్ర | ||౧౪౪|| 
144. అయినప్పటికీ, ఒక ఆకారాన్ని దాల్చకుండా అతడు ఎల్లప్పుడూ ఆకారం లేకుండా ఉంటే, ఆకారంలో ఉన్న మానవ మాత్రులైన మనకు అది ఏమాత్రం ఉపయోగ పడేది కాదు. 
తాత్పర్య ధరోని లీలావిగ్రహ | సాఈ న కరితే లోకసంగ్రహ | 
అథవా దుష్టదుర్జనమతనిగ్రహ | కైంచా అనుగ్రహ భక్తావర | ||౧౪౫|| 
145. అంటే, దీని అర్థం, సాయి ఒక ఆకారాన్ని దాల్చి, ప్రజల వ్యవస్థను సరిదిద్దక పోతే, దుష్టులను, దుర్జనులను అదుపులో పెట్టకపోతే, వారి అనుగ్రహం భక్తులకు ఎలా కలిగి ఉండేది? 
ఆలా అధ్యాయ సంపావయాలా | తో ఎక వృత్తాంత మజ ఆఠవలా | 
సాఈసదుపదేశాచా మాసలా | మానీల త్యాలా హితకారీ | ||౧౪౬|| 
146. ఈ అధ్యాయం ముగింపుకు వచ్చింది. ఇప్పుడు నాకొక సంగతి గుర్తుకు వచ్చింది. ఇది సాయియొక్క గొప్ప ఉపదేశానికి ఉదాహరణ. నమ్మిన వారికి ఇది మేలు చేస్తుంది. 
వృత్తాంత ఆహే అతి లహాన | స్మరణ ఠేవీ తో కృతకల్యాణ | 
మ్హణూన శ్రోతయా కరితో వినవణ | క్షణ అంతఃకరణ ద్యా మజ | ||౧౪౭|| 
147. సంగతేమో చాలా చిన్నదే. అయినా దీనిని గుర్తుంచుకుంటే శుభం కలుగుతుంది. అందుకు మీ మనసులను ఒక క్షణం నా వైపు మళ్ళించండి అని శ్రోతలకు మనవి చేస్తున్నాను. 
ఎకదా భక్త మ్హాళసాపతీ | నానాసాహేబ యాం సమవేతీ | 
బైసలే అసతా మశీదీప్రతీ | పరిసా చమత్కృతి ఘడలీ తీ | ||౧౪౮|| 
148. నానాసాహేబుతో పాటు భక్త మహల్సాపతి ఒక సారి మసీదులో కూర్చుని ఉండగా, అప్పుడు జరిగిన చమత్కారాన్ని వినండి. 
సమర్థసాఈ దర్శనోత్సుక | కోణీ ఎక శ్రీమాన గృహస్థ | 
వైజాపురనివాసీ తేథ | పరివారాన్విత పాతలే | ||౧౪౯|| 
149. వైజాపుర నివాసియైన ఒక శ్రీమంతుడైన గృహస్థుడు, తన కుటుంబ సమేతంగా, సాయి సమర్థుల దర్శనం కోసం అక్కడికి వచ్చాడు. 
పాహూనియా స్త్రియాంచా గోషా | నానా సంకోచలే నిజ మానసా | 
స్వయే ఉఠూని ద్యావే అవకాశా | వాటలే సంతోషార్థ తయాంచ్యా | ||౧౫౦||
150. అతనితో వచ్చిన స్త్రీలు గోషాలో ఉండటాన్ని చూచి, నానా తనలో సంకోచించాడు. వారికి ఇబ్బంది కలగ కూడదని, తాను స్వయంగా అక్కడినుండి లేచి పోవాలని అనుకున్నాడు. 

మ్హణూని నానా ఉఠూ సరతీ | తంవ బాబా తయా వారితీ | 
మ్హణాలే “యేణారే యేతీల వరతీ | త్వా స్వస్థ చిత్తీ బసావే” | ||౧౫౧|| 
151. అలా అనుకుని నానా లేవబోతుండగా, బాబా అతనిని ఆపి, “వచ్చేవారు పైకి వస్తారు. నీవు నిశ్చింతగా కూర్చో” అని చెప్పారు. 
‘తేహీ ఆలేతీ దర్శనార్థ | యావే కాంహీ నాహీ హరకత’ | 
ఏసే తయాంస కోణీ సుచవిత | యేఊని వందిత సాఈస | ||౧౫౨|| 
152. “వారు కూడా దర్శనానికి వచ్చారు. మీరు నిరభ్యంతరంగా రండి” అని ఎవరో ఆ గృహస్థునికి సూచించారు. వారు వచ్చి సాయికి నమస్కారం చేశారు. 
తయా మాజీల ఎక నారీ | వందూ జాతా బురఖా సారీ | 
పాహూని సౌందర్యే అతి సాజిరీ | నానా నిజ అంతరీ మోహిలే | ||౧౫౩|| 
153. వారిలో ఒక స్త్రీ, తన మేలి ముసుగును ప్రక్కకు తొలగించి, వంగి సాయి పాదాలకు నమస్కరిస్తుండగా, ఆమె అద్భుత సౌందర్యాన్ని చూచి నానాసాహేబు మోహితుడయ్యాడు. 
లోకాంసమక్ష పాహణ్యా చోరీ | పాహిల్యావీణ రాహవేనా అంతరీ | 
వర్తావే కాయ కైసే పరీ | మోహాచీ ఉజరీ నావరే | ||౧౫౪|| 
154. ఆమె ముఖాన్ని మరల చూడకుండా మనసు ఆగటం లేదు. అందరి ఎదుట అలా చూడటం మర్యాద కాదు. అయినా మనసును నిగ్రహించుకోలేక పోయాడు. ఏం చేయాలో అతనికి తెలీలేదు. 
బాబాంచీ లజ్జా మోఠీ అంతరీ | మ్హణోని ముఖ తే న కరవే వరీ | 
దృష్టీ జావూ లాగలీ చాంచరీ | సాంపడే కాతరీ తంవ నానా | ||౧౫౫|| 
155. బాబా దగ్గర ఉండటం వలన, మనసులోనే చాలా సిగ్గు పడిపోయాడు. అందు వలన ముఖాన్ని పైకి ఎత్తలేక పోయాడు. కాని, అతని దృష్టి మటుకు ఆమెవైపే తిరుగ సాగింది. అటువంటి కష్టమైన పరిస్థితిలో నానా చిక్కుకున్నాడు. 
హీ తో నానాంచీ అంతఃస్థితీ | సర్వాంతర్యామీ బాబా జాణతీ | 
ఇతరా కాయ తియేచీ ప్రతీతీ | తే తో ఝగటతీ శబ్దార్థా | ||౧౫౬|| 
156. నానాయొక్క ఈ మానసిక స్థితిని, అందరి మనసులలో ఉండే బాబాకు తెలిసే ఉంది. మిగతా వాళ్లకు ఇది ఎలా తెలుస్తుంది? వాళ్లు మాటల్లో వాడిన పదాల అర్థాల కోసం వెదుకుతూంటారు. 
ఏసీ నానాంచీ వృత్తీ బావరీ | జాణూని బాబా నిజాంతరీ | 
ఆణావయా స్వస్థానీ మాఘారీ | ఉపదేశ జో కరీత తో పరిసా | ||౧౫౭|| 
157. నానాయొక్క చంచలమైన ఈ మానసిక స్థితిని తెలుసుకుని, అతని మనసును స్థిర పరచటానికి, బాబా ఏమి ఉపదేశం ఇచ్చారో వినండి. 
“నానా కిమర్థ గడబడసీ మనీ | జ్యాచా నిజధర్మ తో స్వస్థపణీ | 
ఆచరతా ఆడ యావే న కోణీ | కాంహీ న హానీ తయాంత | ||౧౫౮|| 
158. “నానా! ఎందుకు మనసులో ఆందోళన పడుతున్నావు? ఇంద్రియాలు వాని వాని పనులను చేస్తుండగా, వాటిని ఎవరూ అడ్డు పడకూడదు. ఎందుకంటే, అందులో హాని ఏమి లేదు. 
“బ్రహ్మదేవ సృష్టీ రచితా | ఆపణ తయాచే కౌతుక న కరితా | 
వ్యర్థ హోఊ పాహీల రసికతా | ‘బనతా బనతా బనేల’ | ||౧౫౯|| 
159. “బ్రహ్మదేవుడు రచించిన ఈ సృష్టిని మనము అర్థం చేసుకోలేక పోతే, అతని కళాకౌశలం మరియు రసికత వ్యర్థమై పోతుంది. క్రమ క్రమంగా అన్నీ సరిపోతుంది. 
“అసతా పుఢీల ద్వార ఉఘడే | జావే కా మాగీల ద్వారాకడే | 
ఎక శుద్ధ అంతర జికడే | తేథే న సాంకడే కాంహీం హీ | ||౧౬౦||
160. “ముందు తలుపులు తెరచి ఉండగా, వెనుక తలుపుల వద్దకు వెళ్లటం ఎందుకు? మనసు నిర్మలంగా ఉంటే ఎటువంటి కష్టాలు ఉండవు. 

కుఢా భావ నాహీ అంతరీ | తయాస కాయ కోణాచీ చోరీ | 
దృష్టీ దృష్టీచే కర్తవ్య కరీ | భీడ మగ యేథే ధరిసీ కా’ | ||౧౬౧|| 
161. “మనసులో చెడు ఆలోచనలు లేనప్పుడు, ఎందుకు భయ పడాలి? కళ్లు చూచే పనిని చేస్తాయి. మరి సంకోచమెందుకు?” అని చెప్పారు.
హోతే తేథే మాధవరావ | జాత్యా జయాంచా చికిత్సక స్వభావ | 
నిజ జిజ్ఞాసా పూర్తిస్తవ | పుసతీ త్యా భావ బోలాచా | ||౧౬౨|| 
162. అప్పుడు అక్కడ మాధవరావు కూడా ఉన్నాడు. అతనిది అసలే శోధించే స్వభావం. తన కుతూహలాన్ని తీర్చుకోవటానికి, నానాను బాబా మాటలయొక్క అర్థాన్ని అడిగాడు. 
ఏసే మాధవరావే పుసతా | నానా వదలే థాంబ రే ఆతా | 
సాంగేన బాబాంచియా మనోగతా | వాటేనే జాతా వాడియాతే | ||౧౬౩|| 
163. మాధవరావుతో నానా ‘ఇప్పుడు ఊరుకో. బసకు వెళ్ళేటప్పుడు దారిలో బాబా మాటలకు అర్థం చెబుతాను’ అని చెప్పాడు. 
సంపతా క్షేమకుశల వార్తా | అభివందూన సాఈ సమర్థా | 
నానా నిజస్థానాసి పరతతా | నిఘాలే సమవేతా మాధవరావ | ||౧౬౪|| 
164. కుశల క్షేమ వార్తలన్నీ ముగిశాక, సాయి సమర్థుని పాదాలకు నమస్కారం చేసి, తన బసకు బయలుదేరాడు. అతనితోనే మాధవరావు వెళ్లాడు. 
తే నానాంస పుసతీ తాత్కాళ | నానా ‘బనతా బనతా బనేల’ | 
ఆదీకరూని బాబాంచే బోల | స్పష్టార్థ వదాల కాయ త్యాంచా | ||౧౬౫|| 
165. వెంటనే అతడు నానాను, ‘నానా, అంతా క్రమ క్రమంగా సరి అవుతుంది అన్న బాబా మాటలకు అర్థం స్పష్టంగా చెప్పు’ అని అడిగాడు. 
అర్థ సాంగావయా హోఈనా జీవ | బహుత చాలలీ ఉడవా ఉడవ | 
తేణే అధికచి సంశయసముద్భవ | హోఈ న మాధవమన స్వస్థ | ||౧౬౬|| 
166. మాధవరావుకు జవాబు చెప్పటానికి నానా మనసు ఒప్పుకోలేదు. అందుకు ఆ విషయాన్ని దాటించాలని ప్రయత్నించాడు. దాంతో మాధవరావు అనుమానం మరింత పెరిగింది. అతని మనసు ఊరుకోలేదు. 
మగ కరూనియా హృదయ ఉఘడే | నానాంహీ జే ఘడలే తికడే | 
తే సాగ్ర మాధవరావాచియా హోడే | కథూని కోడే ఉలగడిలే | ||౧౬౭|| 
167. అప్పుడు జరిగిన సంగతంతా నానా మనసు విప్పి, మాధవరావుకు చెప్పి, అతని అనుమానాల్ని తీర్చి, ఆ సమస్యను ముగించాడు. 
కాయ బాబా కితీ దక్ష | జావో కోణాచే కోఠేహీ లక్ష | 
తే తో స్వయే అంతర్సాక్ష | సర్వ ప్రత్యక్ష తయాం తే | ||౧౬౮|| 
168. నిజంగా, బాబా ఎంతటి సమర్థులు! ఎవరి మనసు ఎటు తిరిగినా, అన్నీ వారికి తెలుస్తుంది. ఎందుకంటే, అందరి హృదయాలలో ఉండేవారు వారే! 
అసీహీ త్రోటక అభినవ వార్తా | పరిసతా సాశ్చర్య హోఈల శ్రోతా | 
పాహూ జాతా యేథీల మథితార్థా | స్థైర్య గంభీరతా బహుమోల | ||౧౬౯|| 
169. ఇలాంటి వింతైన సంగతి గురించి విని శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది. కాని, ఇందులో దాగియున్న అర్థాన్ని గమనిస్తే, అత్యంత అమూల్యమైన మనసీక స్థిరత్వము, శాంతి లభిస్తాయి. 
మన జాతీచేచ చంచళ | హోఊ న ద్యావే ఉత్శృం ఖళ | 
హోవో ఇంద్రియాంచీ ఖళబళ | శరీర ఉతావీళ హోఊ నయే | ||౧౭౦||
170. మనసు స్వాభావికంగా నిలకడ లేనిది. దానిని, దాని ఇష్టం వచ్చినట్లు తిరుగనీయ కూడదు. ఇంద్రియాలు తొందర పెట్టినా, దేహం తొందర పడకూడదు. 

ఇంద్రియాంచా నాహీ విశ్వాస | విషయార్థ వ్హావే న లాలస | 
హళూహళూ కరితా అభ్యాస | చాంచల్యనిరాస హోఈల | ||౧౭౧|| 
171. ఇంద్రియాలు నమ్మ తగినవి కావు. అందు వలన, అవి కోరే సుఖభోగాలను అనుభవించాలనే లాలస ఉండకూడదు. అభ్యాసం చేసిన కొద్ది, మెల్ల మెల్లగా మనసు చంచలత్వం శాంతిస్తుంది. 
హోఊ నవ్హే ఇంద్రియాధీన | తీంహీ న సర్వథా రాహతీ దాబూన | 
విధిపూర్వక తయాంచే నియమన | కరావే పాహూన ప్రసంగ | ||౧౭౨|| 
172. బానిసవలె ఇంద్రియాలకు లొంగిపోకూదు. అవి కూడా ఎప్పుడూ అణచితే అణగి ఉండేవి కావు. సమయానికి సరిగ్గా, వానిని జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాలి. 
రూప హా తో దృష్టీచా విషయ | సౌందర్య వస్తూచే పహావే నిర్భయ | 
తేథే లాజేచే కారణ కాయ | ద్యావా న ఠాయ దుర్బుద్ధీతే | ||౧౭౩|| 
173. రూపం చూపుకు సంబంధించిన విషయం. వస్తువుయొక్క సౌందర్యాన్ని నిర్భయంగా చూడవచ్చు. అక్కడ సిగ్గు పడాల్సిన అవసరమేముంది? కాని, ఆ చూపు చెడు బుద్ధికి దారి తీయకూడదు. 
మన కరోనియా నిర్వాసన | ఈశకృతీచే కరా నిరీక్షణ | 
హోఈల సహజ ఇంద్రియ దమన | విషయ సేవన విస్మరణ | ||౧౭౪|| 
174. మనసులో ఏ కోరికలు లేకుండా, ఈశ్వరుని సృష్టిని గమనించండి. దాంతో ఇంద్రియాలు సహజంగా అదుపులోనికి వస్తాయి. అవి కోరే సుఖభోగాలను అనుభవించాలనే సంగతి మరచి పోతాము. 
రథ న్యావయా ఇష్టస్థానీ | సారథీ జైసా మూళకారణీ | 
తైసీ హీ బుద్ధీ హితకారిణీ | దక్ష ఆకర్షణీ ఇంద్రియాంచ్యా | ||౧౭౫|| 
175. కోరుకున్న చోటుకు రథాన్ని తీసుకుని వెళ్లటానికి, సారథి మూలకారణమైనట్లే, బుద్ధి నేర్పుతో ఇంద్రియాలను వాని ఆకర్షణలనుంచి రక్షిస్తుంది. 
సారథీ కరీ రథనియమన | బుద్ధిహీ కరూని ఇంద్రియదమన | 
ఆవరీ శరీరస్వైరగమన | అనివార చంచలపణ మనాచే | ||౧౭౬|| 
176. సారథి రథాన్ని అదుపులో ఉంచుతాడు. అలాగే, బుద్ధి ఇంద్రియాలను అదుపులో పెట్టి, శరీరంయొక్క స్వేచ్ఛా విహారాన్ని, మనసుయొక్క చంచలత్వాన్ని అదుపులో ఉంచుతుంది. 
శరీర ఇంద్రియ మనోయుక్త | ఏసియా జీవాచే జే భోక్తృత్వ | 
తే సంపతాచ వైష్ణవపద ప్రాప్త | ఏసే హే సామర్థ్య బుద్ధీచే | ||౧౭౭|| 
177. శరీరం, ఇంద్రియాలు, మనసుతో కూడుకున్నది జీవాత్మ. తనకు ప్రాప్తించిన కష్టాలను, సుఖాలను అనుభవించటం ముగిసి పోగానే, ఈ జీవాత్మ పరమేశ్వరుని చేరుకోవటం కూడా ఆ బుద్ధియొక్క సామర్థ్యం వలననే. 
చక్షురాది ఇంద్రియనిచయ | భిన్నభిన్న హయస్థానీయ | 
రూపరసాది జే జే విషయ | మార్గ తే నిరయ ప్రవర్తక | ||౧౭౮|| 
178. ఇంద్రియాలలో కళ్లు మొదలైనవి గుర్రాలవంటివి. అవి అనుభవించాలని కోరుకునే రూపం, రసాది వస్తువులు నరకానికి తీసుకుని వెళ్లే త్రోవలు. 
యత్కించిత విషయాభిలాష | కరీ పారమార్థిక సుఖా నాశ | 
మ్హణోని త్యాగా తో నిఃశేష | తరీచ తో మోక్ష తుజలాధే | ||౧౭౯|| 
179. ఇంద్రియాల సుఖాలను అనుభవించాలనే కోరిక ఏ కొంచెమైనా ఉన్నా, అది పారమార్థిక సుఖాన్ని నాశనం చేస్తుంది. అందుచేత ఆ కోరికలను సమూలంగా నాశనం చేయండి. అప్పుడే మీకు మోక్షము దొరకుతుంది. 
బాహ్యేంద్రియే జరీ నివృత్త | అసతా అంతఃకరణ ఆసక్త | 
నాహీ జన్మమరణా అంత | విషయ అత్యంత ఘాతుక | ||౧౮౦|| 
180. బయటి ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని, అవి కోరుకునే సుఖాలను అనుభవించాలనే ఆశ మనసులో ఉంటే, చావు పుట్టుకలు ముగిసి పోవు. ఇంద్రియాలు చాలా అపాయకరమైనవి. 

లాధలియా వివేకీ సారథీ | వివేకే రాఖీ లగామ హాతీ | 
ఇంద్రియవాజీ కుమార్గ వర్తీ | స్వప్నీంహీ హోతీ న లవమాత్ర | ||౧౮౧|| 
181. వివేకి అయిన సారథి ఉంటే పగ్గాలను తెలివిగా చేత్తో పట్టుకుంటాడు. అప్పుడు, ఇంద్రియాలనే గుర్రాలు కలలో కూడా చెడు దారిలో పోవు. 
ఏసా మనఃసమాధానపర | నిగ్రహీ దక్ష కుశల చతుర | 
భాగ్యే లాధలియా సారథీ చతుర | కైంచే దూర విష్ణుపద | ||౧౮౨|| 
182. ఇలా మనసును శాంతింప చేసే, నిగ్రహవంతుడు, దక్షుడు, కుశలుడు, చతురుడు అయినటువంటి సారథి భాగ్యవశాత్తు దొరికితే, విష్ణు ప్రాప్తికి ఎంతో దూరం ఉండదు. 
తేంచ పద పరబ్రహ్మ | ‘వాసుదేవ’ అపర నామ | 
తేంచ సర్వోత్కృష్ట పద పరమ | పరంధామ పరాత్పర | ||౧౮౩|| 
183. విష్ణు ప్రాప్తియే పరబ్రహ్మ ప్రాప్తి. ఆ బ్రహ్మకే ‘వాసుదేవ’ అనేది మరో పేరు. అదే అన్నిటి కంటే శ్రేష్ఠమైనది, శాశ్వతమైనది. అదే పరాత్పరుని పరమ నివాసం. 
అసో ఝాలా హా అధ్యాయ పురా | యాహూన గోడ పుఢీల దుసరా | 
రిఝవీల సద్భక్తాంచ్యా అంతరా | శ్రవణ కరా క్రమానే | ||౧౮౪|| 
184. అలా ఈ అధ్యాయం ముగిసింది. తరువాతి అధ్యాయం ఇంతకంటే మధురమైనది. సద్భక్తుల మనసులను రంజింప చేస్తుంది. క్రమంగా శ్రవణం చేయండి. 
అసో శేవటీ జగచ్చాలక | సద్గురు జో బుద్ధిప్రేరక | 
తయాచే చరణీ ఆభారపూర్వక | హేమాడ మస్తక అర్పీతసే | ||౧౮౫||
185. ఈ జగత్తుకు సారథి, బుద్ధికి ప్రేరకుడు అయిన సద్గురు పాదాలయందు హేమాడు కృతజ్ఞతా పూర్వకంగా తన శిరస్సును అర్పిస్తున్నాడు. 

| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే | 
| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | సంత పరీక్షణ మనోనిగ్రహణం నామ | 
| ఎకోన పంచాశత్తమోధ్యాయః సంపూర్ణః | 

||శ్రీ సద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||

టిపణీ: 
1. భోజన. 
2. రంగాత ఆలీ. 
3. జ్యాచ్యా సర్వ ఇచ్ఛా పరిపూర్ణ ఝాల్యా ఆహేత అసా. 
4. జాణీవ. 

No comments:

Post a Comment